Wednesday, February 1, 2012

Chapter 11 Part 1

అధ్యాయము 11 
సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల వృత్తాంతము- భాగము 1 

దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము.
శ్రీపాదుల జన్మము- అత్యద్భుత జ్యోతిర్మయము.

శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు యీ విధముగా సెలవిచ్చెను. "శ్రీ దత్తప్రభువు సర్వ దేవతా స్వరూపులు. దత్తుని ఆరాధించిన యెడల సకల దేవతారాధన ఫలితము లభించును. సర్వ దేవతలలోను అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయా తత్త్వము నందలి పరమశివుని ఆరాదిన్చేదివారు. అందువలన శ్రీ దత్తప్రభువులోని శివ తత్త్వము అనసూయా తత్త్వము నందు ప్రతిబింబించి, అనసూయా మాతతో సమానమైన స్థితి నందున్న సుమతీమాత యొక్క గృహమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగప్రక్రియ. వారు మాతా పితృ సంయోగము వలన గాక యోగానిష్ఠులైయున్న అప్పలరాజశర్మ, సుమతీమాతల నేత్రములనుండి యోగాజ్యోతులు ప్రభవించి, అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిల్చి నవమాసములు నిండిన తదుపరి కేవలము సంవత్సరమునుండి కొన్ని వింతశక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారి తరువాత వారికి శ్రీవిద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు సోదరీమణులు జన్మించిరి. శ్రీవిద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారియింటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడుండెను. ఘండికోట వారింట మహాలక్ష్మియే జనించెను, ఆమె మల్లాదివారి కోడలయిన బాగుండునని బంధువులు ముక్తకంఠముతో పలికిరి. శ్రీపాడులవారు కూడా తమ సోదరి శ్రీవిద్యాధరిని చంద్రశేఖరునకిచ్చి వివాహము చేసిన బాగుండుననిరి. శ్రీపాడులవారు సిద్ధ సంకల్పులు. వజ్రసంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీవిద్యాధరికిని, చంద్రశేఖరావధాన్లునకును రంగరంగ వైభవముగా పీఠికాపురమున వివాహమాఎను. రాధయను సోదరిని విజయవాటికా నివాసులైన విశ్వనాధ మురళీకృష్ణావధాన్లగారికిని, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధాన్లగారికిని ఇచ్చి వివాహము చేసిరి.

నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించువారికి పాపములు నశించును. గోదావరీ మండలమునందు తాటంకపురము (తణుకు) అను గ్రామము కలదు. అందు అనేక వాజపేయములను, పౌండరీకములను, మహాయాగములను ఆచరించిన పరమపవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయయాజులవారు. పీఠికాపురమునందలి మల్లాదివారికిని, తణుకు నందలి వాజపేయయాజుల వారికిని సన్నిహితబంధములు కలవు. అయితే వాజపేయయాజుల వారు ఇదంబ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అను సిద్ధాంతము నందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ శక్తి, పరాశరత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు, మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటదేశమున ఋగ్వేదము పఠిoచు బాలకులకు సరియయిన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకు నందున్న వాజపేయ యాజుల మాయణాచార్యుల వారిని వారాహ్వానింప కర్ణాట దేశమునందున్న హోయసాలకు వారు వలసవెడలిరి. అప్పటినుండి వారిని హోయసాల బ్రాహ్మనులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణవృత్తిని, క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాని పాట్లు పడిరి. మాయణాచార్యులకు యిద్దరు కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవవారు సాయణాచార్యులు. వీరిరువురును ఉద్ధండపండితులే! సాయణాచార్యుల వారు వేదములకు భాష్యమును వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావలెననిరి. అంతట శ్రీదేవి "నాయనా! అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు." అనెను. వారు వెంటనే "అమ్మా! నేను సన్యసించుచున్నాను. నాకు యిప్పుడు రెండవ జన్మయే కదా!" అనిరి. శ్రీదేవి  అనుగ్రహించెను. వారు లోహమును ముట్టుకొన్న అది బంగారముగా మారుచుండెడిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి మూడవ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణసరస్వతిగా జన్మించునది వారే! శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహసరస్వతిగా అవతరించునపుడు వారికి శ్రీకృష్ణసరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు గనుక తదుపరి శతాబ్దములలో సాయణాచార్యుల వంశములో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రియై రాజర్షిగా వేనోళ్ళ కొనియాడబడెదరు. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదులవారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్యసంకల్పులు. కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగితీరును. 

అనేక దేవతారాధనలు చేయునపుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి, నూతన చైతన్యముగా మార్పునొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువునే ఆశ్రయించినచో ఏ దేవతాంశము వలన ఎంతమేరకు ఏ పని నిర్వర్తింపబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలె కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి యిచ్చెను. శ్రీదత్తప్రభువు సగుణ తత్త్వమునకు, నిర్గుణ తత్త్వమునకు అతీతమును ఆదారమును అయిన పరమతత్త్వము, అదియే చరమతత్త్వము, అదియే ఆదితత్త్వము, అదియే ఆద్యంత రహిత తత్త్వమును దత్తతత్వముకు కేవలము అనుభవ పూర్వకముగా తెలుసుకొనవలెనే గాని అది యీ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒకపని జరుగుటకు గాని, జరగకుండుటకు గాని, వేరొక విధముగా జరుగుటకు గాని గల సర్వసామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. 

శ్రీపాదతత్త్వము

తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ యింట నుండెడి కాలాగ్నిశమనదత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయము బాపనార్యులు యీ విషయమున మధనపడి శ్రీపాదులవారినే "నాయనా! శ్రీపాదా! నీవు దత్తుడవా! లేక దత్తఉపాసకుడువా ?" అని ప్రశ్నించిరి. అంతట వారినిట్లనిరి. "నేను దత్తుడనని చెప్పునపుడు నేను దత్తుడనే అగుచున్నాను. నేను దత్త ఉపాసకుడనని చెప్పునపుడు దత్తోపాసకుడనే అగుచున్నాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పునపుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను. నేను ఏది సంకల్పించిన అదే జరుగును. నేను ఏ విధముగా అనుకొనిన అదే అగుచున్నాను. ఇదే నా తత్త్వము."

తాతగారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. అంతట శ్రీపాదులిట్లనిరి. "తాతా! నీవు నేను ఒకటే! రాబోవు జన్మలో ముమ్మూర్తులా నిన్నుపోలిన శరీరముతో మాత్రమే అవతరింప నున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలెననెడి కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు యీ జన్మలోగాని, వచ్చే జన్మలోగాని సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తులా నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలచినాను, అని గోముగా తాతగారి భ్రూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణములపాటు హిమాలయములలో నిశ్చల తపోసమాధిలోనున్న బాబాజీని చూచిరి. వారు ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమములో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాదవల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూ దత్తునిలో అంతర్లీనమాయెను. దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండుటను చూచిరి. ఆమె ఒడినుంచి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుతాను గమనించిరి. ఆ నవయువకుడు తనవంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా నుండెను. ఏదో రెండు పవిత్రనదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవిగా నడుచుచుండెను. ఆ సన్యాసి తనవంక చూసి యిట్లు పలికెను. ఓహో!నేను ఎవరా? అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి యందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వైచి దానిమీద కూర్చొని శ్రీశైలమును చేరెను. అచ్చట కదళీవనము నందలి మహాపురుషులు, మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, "మహాప్రభూ! మీ రాకకోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము. మమ్ముల ధన్యులజేయవలసినదని" ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారియై వృద్ధరూపమును పొందునట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల యెడల ప్రసరింపజేయుచూ ఈ నా స్వరూపమును స్వామీ సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగాముచేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షము నందును, తన దివ్యాత్మను శ్రీశైలము నందలి మల్లిఖార్జున శివలింగమునందును విలీనము కావిన్చినట్లు గాంచెను. మహాపవిత్రమును, అత్యంత శక్తిమంతమునయిన ఆ శివలింగము నుండి  మేఘ గంభీర స్వరముతో "బాపనార్యా!  నీవు ధన్యుడవు. అగ్రాహ్యమును, అవాంగ్మానస గోచరమును, అనంతమును, కేవల జ్ఞాన స్వరూపమును, అనాద్యంతమును అయిన నన్ను, నీవు నీయొక్క క్రియాయోగ శక్తివలన సూర్యమండలము నుండి శక్తిపాతమొనరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18 వేలమంది దివ్యపురుషులు ఈ జ్యోతిర్లింగము నందు విలీనుడనైయున్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగా దర్శనము చేయువారికి సదా ఆ దివ్యపురుషులు భౌతిక, ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి, స్వామీ సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను." అను మాటలు వినిపించెను.

నాయనా! శంకరభట్టూ! శ్రీగురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతిస్థులయిరి. తమకు ఎదురుగా అమాయకమయిన ముఖముతో చిరునవ్వులు చిన్దిన్చుచూ మూడు సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్యమధురముగా నుండెను. శ్రీపాదులవారిని తమ గుండెలకు హత్తుకోనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థనుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయుకార్యము వింత గొల్పునదిగా ఉండును. జమ్మికర్రను, రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కాని బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండము నందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా యిదే విధముగా చేయుదురు. వారి వంశము నందు అగ్నిపూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండము నందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్నిపూజయందు వారి శరీరమునకు గాని, వస్త్రములకు గాని అగ్నివలన ఏ విధమైన యిబ్బందియు కలుగదు. ఇది ఆశ్చర్యములలో కెల్లా ఆశ్చర్యము.       

(ఇంకా ఉంది..)                       

No comments:

Post a Comment