అధ్యాయము 13
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 4
నాకు శ్రీ ఆనందశర్మ మహాశయులు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా నుండెను. అంతట నేనిట్లంటిని. "మహాభాగా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారు శ్రీ నృసింహసరస్వతీ అవతారము ధరించెదరని వింటిని. ఆ అవతారములో శ్రీ కృష్ణసరస్వతి యనువారిని గురువులుగా స్వీకరించెదరని వింటిని. ఇది ఏమి విచిత్రము?"
శ్రీ ఆనందశర్మ యిట్లు చెప్పసాగెను. "భగవంతుని అవతారము వచ్చునదే భక్తులకొరకు. మానవ రూపమును ధరించి వచ్చినపుడు ఉత్కృష్ఠ మానవుడు ఏ విధముగా నుండవలెనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసియున్నది. తను సన్యాసి కావలెనన్న తనకు కూడా ఒక గురువు కావలెను. ఆ గురువు బహుయోగ్యుడై యుండవలెను. సాక్షాత్తు అవతారపురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశములో 80 తరముల వారు అవతరించేదారు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాశులు రాశులుగా పదియుండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా నుండెడి వ్యక్తీ వంశము కూడా పరమపవిత్రముగా నుండవలెను. తాటంకపురమున (తణుకు) వాజపేయయాజుల వారి వంశము నందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్య దంపతులు. వారు దరిమిలా నందికొట్కూరు ప్రాంతములందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయణుడు, భోగినాథుడను వారు జన్మించిరి. సనాతన ధర్మము నుద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహాతపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లిఖార్జున లింగామునండు శక్తిపాతమొనరించిరి. వాస్తవమునకు శ్రీదత్తుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించినవి. శ్రీపాదులవారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు "శ్రీ" దత్తప్రభువు చరణములు శ్రీచరణములు. ఈ నవావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతయో తగియున్నది."
బాపనార్యులవారి వంశమునకునూ, మాయణాచార్యులవారి వంశమునకునూ ఎన్నియో తరముల నుండి సంబంధబాంధవ్యములు కలవు. మల్లాది వారింట ఆడపడుచు జన్మించిన వాయపేయయాజుల వారి కోడలనియు, వాజపేయయాజుల వారింట ఆడపడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారముగా అనుకొనెడివారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయయాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధిప్రేరితులై, అగోచరమైన దివ్య సంకల్పము వలన ఘండికోట అప్పలరాజశర్మగారికిచ్చి వివాహము చేసిరి.
సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధము కలిగిన వాజపేయయాజులవారిని కూడా తరింపజేయదలచి మాధవాచార్యుని తనవద్దకు ఆకర్షించిరి. మాధవాచార్యులవారికి శ్రీపాదులవారియందు వాత్సల్యభావము పెల్లుబికినది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామము చెందిరి. వారి శిష్యులు మలయానందులు. వారి శిష్యులు దేవ తీర్థులు. వారి శిష్యులు యాదవేంద్రసరస్వతులు. వారి శిష్యులు కృష్ణసరస్వతులు. శ్రీ విద్యారణ్యులకును, కృష్ణసరస్వతులకును మధ్య ముగ్గురు కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణసరస్వతిగా అవతరించి శ్రీపాదులవారి తరువాత అవతారము నందు గురువులుగా నుందురు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవిందదీక్షితనామమున జన్మించి రాజర్షియై తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్యవచనము.
శ్రీపాదులవారు నిత్యసత్యవచనులు. ఒక పర్యాయము సుమతీ మహారాణి శ్రీపాడులవారికి స్నానము చేయించుచుండెను. ఇంతలో వెంకటప్పయ్యశ్రేష్ఠిగారు అచ్చటకు విచ్చేసిరి. వారిని చూచి శ్రీపాదులవారు, "తాతా! మనది మార్కండేయ గోత్రమా?" అని ప్రశ్నించిరి. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దుగొలుపు మాటలకు, శ్లేశార్థమునకు నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రీకులు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా వెంకటప్పయ్యశ్రేష్ఠిగారికి కూడా దౌహిత్రుడనే అను విషయమును నర్మగర్భితముగా చెప్పిరి. ఇంతలోనే సుమతీ మాత స్నానానంతరము "మార్కండేయునంతటి ఆయుష్మంతుడవు కావలె"నని నీళ్ళను గుండ్రముగా త్రిప్పి ఆశీర్వదించినది. మార్కండేయుడు 16 సంవత్సరముల వరకు మాత్రమే ఆయుషు గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను పదునారు వర్షముల పర్యంతము మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండెదనని నర్మగర్భితముగా సూచించెను. 16 సంవత్సరముల వయస్సు తరువాత మార్కండేయుడు మహర్షియై గృహత్యాగము చేసి చిరంజీవి అయినాది. శ్రీపాదులవారు కూడా 16 సంవత్సరముల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్దనుండి తరువాత జగద్గురువైనారు. తాను తన శరీరమును గుప్త మొనరించెదననియు, తన యీ శరీరమునకు చిరంజీవిత్వముండుననియు, ఇపుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపమేదైతే ఉన్నదో అదే స్వరూపములో అత్రి అనసూయలకు కుమారుడుగా గతములో అవతరించితిననియూ పదే పదే చెప్పియున్నారు.
శ్రీపాదుల వారి వివిధ రూపములు
శ్రీపాదులవారు తమ యోగశక్తిని బహిర్ముఖముగావించి స్త్రీరూపముననున్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చెడివారు. ఇది ఎంతయో అపూర్వమైన విషయము. కుండలినీశక్తిని యీ విధముగా స్త్రీ స్వరూపముగా బహిర్ముఖమొనర్చుట కేవలము శ్రీదత్త ప్రభువులకే చెల్లును. 16 సంవత్సరముల వయస్సులో నుండు ఆ నవయౌవన దంపతీరూపమును బాపనార్యులును, రాజమాంబయును, శ్రీపాదుల వారి జననీజనకులును, నరసింహవర్మ దంపతులును, వెంకటప్పయ్యశ్రేష్ఠి దంపతులును, మరికొంతమంది దర్శించిరి. వారిరువురికి వివాహము చేయసంకల్పించిన తల్లిదండ్రులకు కేవలము నిరాశ మాత్రమే ఎదురయ్యెను. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించిరనుటకు ప్రప్రథమమున వారు అవధూత రూపమున సుమతీ మాతకు దర్శనమిచ్చినపుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో యిట్లనిరి. "అమ్మా! నీ కుమారుడు 16 సంవత్సరములవరకు మీ వద్ద నుండును. వానికి వివాహము చేయ సంకల్పించిన వినడు సరిగదా గృహత్యాగము చేసి వెడలిపోవును. అందుచేత అతని మనోభీష్టము ననుసరించి నడుచుకొనవలసినది." శ్రీ అనఘాదత్తులు ఆదిదంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలావిహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభరూపమునను, శ్రీ నరసింహసరస్వతి రూపమునను, స్వామి సమర్థుల రూపమునను అర్థనారీశ్వరులై యుందురు. ఇది దైవ రహస్యము.
(ఇంకా ఉంది..)
No comments:
Post a Comment