అధ్యాయము 12
కులశేఖర వృత్తాంతము-భాగము 1
శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో క్రొత్త విషయములను సులభ గ్రాహ్యంగా నాకు తెలియజేయుట వలన వానిని ఆకళింపు చేసుకోను కొలదిని నాలో ఆత్మవికాసము కలుగుచున్నట్లు కనుగొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. "శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామియే ! కలియుగాంతమున శ్రీపాద శ్రీవల్లభుల వారే కల్కి అవతారముగా వచ్చువారు. సాధారణముగా బ్రాహ్మణులు కలియుగము 4 , 32 ,000 సంవత్సరములని చెప్పెదరు. కాని సాంద్ర సింధు వేదము ననుసరించి కలియుగము 5000 సంవత్సరముల కాలము దాటిన తదుపరి సామాన్య ప్రళయము జరిగి కలియుగములో సత్యయుగము స్థాపించబడును." నా ఆశ్చర్యమునకు అంతు లేదు. నేను బ్రాహ్మణులనుండి విన్న విషయములకు శ్రేష్ఠి చెప్పునది వ్యతిరిక్తముగా నుండెను.
శ్వాసకు ఆయుష్షునకు గల సంబంధము
"నాయనా! శంకరభట్టూ! కలియుగములో కలి అంతర్దశ 5000 సంవత్సరములకు అంతమగును. ఆ తదుపరి కొంతకాలము సంధికాలము. ఆ తరువాత కలియుగములో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును. మొత్తం 4 ,32 ,000 సంవత్సరములు కలియుగ ప్రమాణమైననూ దానిలో కూడా అంతర్దశలు, సూక్ష్మ దశలు, విదశలు మొదలయినవి ఉండును. ఇది యోగ శాస్త్రము తెలిసినవారికే సుబోధకమగు విషయము. బ్రహ్మ దేవుడు ఒకనికి 120 సంవత్సరముల ఆయుర్ధాయమును నిర్ణయించెననుకొనుము. భౌతికముగా వాడు 120 సంవత్సరములు జీవించుననికాదు అర్థము. 120 సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము యీయబడినదని అర్థము. మనశ్చాంచల్యము గలవారు, కోపధారులు, వడివడిగా పరిగెత్తువారు, నిత్యమూ దిగులుతో జీవించువారు, దుష్ట ప్రవత్తులను కలవారు తమయొక్క శ్వాసలను తక్కువ కాలములో ఖర్చు చేసుకొందురు. అన్నింటి కంటెను తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకొను రాకాసి తాబేలు 300 సంవత్సరముల వరకు జీవించుచున్నది. అత్యంత చంచల స్వభావము గలిగిన కోతి స్వల్పకాలములోనే మరణించుచున్నది. శ్వాస ప్రశ్వాసలను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణము కూడా సరియైన స్థితిలో నుండవలెను. యోగులు గాలిని కుంభించి, శ్వాస శరీరాంతర్భాగములందే నడయాడునట్లు చేసెదరు. దీనివలన ఎన్నో శ్వాసలు మిగిలిపోయి వారు ఎక్కువకాలము జీవించుచున్నారు. మనిషి శరీరములోని జీవాణువులు పరిణామక్రమమునకు లోనగుచున్నవి."
శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము
పది వర్షముల క్రిందట శరీర భాగములు యీనాటి శరీరభాగములు కావు. పాత జీవాణువుల స్థానములో క్రొత్త జీవాణువులు పుట్టుచున్నవి. క్రొత్త శరీరభాగములు పుట్టుచున్నవి. అదే విధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవన దాయకమైన క్రొత్త ప్రాణశక్తి పుట్టుచుండును. జబ్బు పడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధముగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది. పాత భావములు మారిపోయి, నశించి, కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని, దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగియున్నది. తద్వారా మనస్సు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరము కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథములందలి ప్రతీ అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా నుండును. అటువంటి గ్రంథములను మానసికముగా గాని, వాచికముగా గాని లేదా మనస్సు, వాక్కు రెండింటి యందు సమన్వయము కలిగిగాని, పఠిoచిన యెడల శ్రీపాదులవారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షించబడును. గ్రంథ పారాయణము చేయు భక్తుల శారీరక, ప్రాణ, మానసిక రుగ్మతలు, బాధలు, కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలునూ శ్రీపాదులవారి మానసిక చైతన్యము నందు చేరును. అచ్చట అవి పరిశుద్ధత పొంది, దివ్యానుగ్రహపూరితమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి.
(ఇంకా ఉంది..)
No comments:
Post a Comment