Monday, February 6, 2012

Chapter 13 Part 3

అధ్యాయము 13
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 3 

అంతట నేనిట్లంటిని. "అయ్యా! గాయత్రీ మంత్రములోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్యా పరమాత్మ స్వరూపమంటిరి. 8 అనునది మాయాస్వరూపమంటిరి. ఇది నాకంతగా అవగతము కాలేదు."

నవమ సంఖ్య వివరణ

అంతట ఆనందశర్మ యిట్లు నుడివెను. "నాయనా! శంకరభట్టూ! పరమాత్మ యీ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకునూ లోనుగానివాడు. తొమ్మిది అనునది ఒక విచిత్ర సంఖ్య. తొమ్మిదిని ఒకటి చేత గుణింపగా తొమ్మిది వచ్చును. తొమ్మిదిని రెండు చేత గుణింపగా పదునెనిమిది వచ్చును. ఆ పదునెనిమిదిలోని ఒకటిని, ఎనిమిదిని కలిపిననూ తిరిగి తొమ్మిదియే వచ్చును. తొమ్మిదిని మూడు చేత గుణించిన ఇరువది ఏడు వచ్చును. దీనిలో రెండును, ఏడును కలుపగా తిరిగి తొమ్మిదియే వచ్చును. ఈ విధముగా తొమ్మిదిని ఏ సంఖ్య చేత గుణించిననూ వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలుపగా వచ్చునది తొమ్మిదియే అగుచున్నది. అందుచేత తొమ్మిది అనునది బ్రహ్మ తత్త్వమును సూచించుచున్నది.

గాయత్రి వివరణ

అంతేగాక గాయత్రీ మంత్రము కల్పవృక్షము వంటిది. దీనిలోని "ఓం" కారము భూమినుండి పైకి వచ్చెడి మూలకాండమని గ్రహింపుము. భగవంతుడున్నాడనెడి జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్ఠను 'ఓం'కారోచ్ఛరణము వలన పొందవచ్చును. మూలకాండము యొక్క మూడు శాఖలుగా 'భూ:' , 'భువః', 'స్వః' అనునవి వర్ధిల్లినవి. "భూ:" అనునది ఆత్మజ్ఞానమును కలిగించుటకు సమర్థము. "భువః" అనునది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగిన కర్మయోగామును సూచించును. "స్వః" అనునది సమస్త ద్వంద్వములందును స్థిరత్వమును కలిగియుండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును.

'భూ:' అను శాఖ నుండి 'తత్', 'సవితు:', 'వరేణ్యం' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'తత్' అనునది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగించుటకును, 'సవితు:' అనునది శరీరధారికి శక్తిని సముపార్జనము చేయుటకును, 'వరేణ్యం' అనునది మానవుడు తన జంతుధర్మములను అతిక్రమించి దివ్యుడుగా మార్పునొందుటకును సహకరించును.

'భువః' అను శాఖ నుండి 'భర్గో:', 'దేవస్య', 'ధీమహి' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'భర్గో' అనునది నిర్మలత్వము పెంపొందించును. 'దేవస్య' అనునది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్యదృష్టిని కలిగించును. 'ధీమహి' అనునది సద్గుణములను పెంపొందించును.

'స్వః' అను శాఖనుండి 'ధియో' , 'యోనః', 'ప్రచోదయాత్' అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. 'ధియో' అనునది వివేకమును, 'యోనః' అనునది సంయమమును, 'ప్రచోదయాత్' అనునది సేవాభావమును సమస్త జీవరాశుల యందును పెంపొందుటకు సహకరించును.

అందుచేత గాయత్రీ కల్పవ్రుక్షమునకు మూడు శాఖలను, ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలును, కలవని నీకు అవగతమైనది గదా! అందుచేత 2498 అనునది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అను దాని గురించి నీకు వివరించితిని.

అష్టమ సంఖ్య వివరణ

ఎనిమిది అను సంఖ్య మాయాస్వరూపము. ఇదియే అనఘామాత తత్త్వము. ఎనిమిదిని ఒకటి గుణించిన ఎనిమిది వచ్చును. ఎనిమిదిని రెండు చేత గుణించిన 16 వచ్చును. దీనిలోని ఒకటిని, ఆరును కలిపిన ఏడు వచ్చును. ఇది ఎనిమిది కంటె తక్కువ. ఎనిమిదిని మూడు చేత గుణించిన 24 వచ్చును. దీనిలోని రెండును, నాలుగును కలిపిన ఆరు వచ్చును. ఇది ఏడు కంటెను తక్కువ. ఈ రకముగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపజేయు తత్త్వము జగన్మాత యందు కలదు. ఎవడు ఎంతగొప్ప వాడయిననూ వానిని తక్కువగా  చేసి చూపగల శక్తి మాయాస్వరూపమునకున్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపము. వారు అనఘాదేవీ సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములు సిద్ధించును.

గాయత్రీమాత యందు ప్రాతఃకాలమున హంసారూఢ అయిన బ్రాహ్మీశక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢ అయిన వైష్ణవీశక్తి, సాయంసమయము నందు వృషభారూఢ అయిన శాంభవీశక్తియు నుండును. గాయత్రీ మంత్రాధిష్ఠాన దేవత సవితాదేవి. త్రేతాయుగములో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సావిత్రుకాఠక చయనము చేసిన ఫలితముగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించిరి. సవితాదేవత ప్రాతఃకాలమందు ఋగ్వేదరూపముగా నుండును. మధ్యాహ్న కాలమందు యజుర్వేదరూపముగా నుండును. సాయంకాలమందు సామవేదరూపముగా నుండును. రాత్రికాలమందు అధర్వణవేదరూపముగా నుండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందునపుడు త్రికోణాకారమున మహాజాజ్వల్యమానముగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలరు. దీని నుండియే కోటానుకోట్ల బ్రహ్మాండములు ప్రతీక్షణము ఉద్భవించుచుండును. ప్రతీక్షణము నందును సంరక్షింపబడుచుండును. ప్రతీక్షణమందును విద్వంసము కావించబడుచుండును. ఈ విధముగా ప్రతీక్షణమందును సృష్టి స్థితి లయములు కావిన్ప బడుచుండును. అసంఖ్యాకమైన యీ ఖగోళములనన్నింటిని సృష్టి స్థితి లయముల గావించు సవితాశక్తికే సావిత్రియని పేరు. అయితే గాయత్రియు, సావిత్రియు అభిన్న స్వరూపములు. శవములను కాల్చుటకుపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములను తయారు చేసుకొనుటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదే విధముగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది.

జీవరాశుల పరిణామక్రమములో యిహలోకసంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవి అన్నియు సావిత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. జీవరాశులకు అధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. ఇహలోకమునందు సకల సుఖభోగములను అనుభవించుటకునూ, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందమును అనుభవించుటకునూ సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీచరణాశ్రితులకు ఇహపరలాభములు రెండునూ సిద్ధించును. తక్కిన దేవతారాధనలకునూ, శ్రీ దత్తారాధనమునకునూ గల వ్యత్యాసము యిదియే!

(ఇంకా ఉంది...)         

No comments:

Post a Comment