Tuesday, February 21, 2012

Chapter 13 Part 5 (Last Part)

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 5 
మండల కాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణవల్ల కలుగు ఫలము

శ్రీపాదులవారు గణేశచతుర్థిన అవతరించుటలో ఒక గొప్ప విశేషమున్నది. లాభుడు శ్రీ గణేశుని పుత్రుడు. ఒకానొక కల్పములో, ఒకానొక యుగమున అతడే లాభాదమహర్షి యని పెరుగాంచెను. అతడే శ్రీ కృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నములను పోగొట్ట దలంచి తమ చైతన్యములో విఘ్నేశతత్త్వమును స్థిరముగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించిరి. వారు చిత్తానక్షత్రమందు అవతరించిరి. దీనికి 27 వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురువపురమున వారు అదృశ్యులయిరి. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రములందును సంచరించు నవగ్రహముల వలన కలుగు అనిష్టఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తులు మండలదీక్షను వహించవలెను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదులవారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణము చేసిననూ సర్వాభీష్టములు సిద్ధించును. మనోబుద్ధి చిట్టాహన్కారములు ఒక్కొక్కటి దశదిశలలో తమ స్పందనలను, ప్రకంపనలను వెలువరించు చుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశలలో వెలువడుచుండును. ఈ నలభై దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదులవారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమున చేరును. అచ్చట అవి తగురీతిన సంస్కరింపబడి యోగమైన స్పందనలుగా మార్పునొంది తిరిగి సాధకుని చేరును. అపుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలును సిద్ధించును. నాయనా! శంకరభట్టూ! "నీవు శ్రీపాదులవారి చరితమును లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకొంటిని. లోకములో వ్యవహారములోనున్న పారాయణ గ్రంథములలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రములు వగైరా ఉండును. నీవు వ్రాయు ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరము. ప్రభువులను ధ్యానించి, నీ అంతర్నేత్రములో శ్రీపాదులవారిని నిలుపుకొని అందరికినీ సులభముగా అర్థమగు రీతిలో రచింపుము. అపుడు శ్రీపాదులవారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించిన అది మాత్రమే సత్యము కాగలదు. ఆ రకమయిన స్పూర్తిలో వ్రాయబడు గ్రంథములకుగాని, ఉచ్చరింపబడు మంత్రములకు గాని ఛందోబద్ధత ఉండవలసిన అవసరము లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనపుడు వారి వారి స్థానికభాషలో, వ్యావహారికములలోని పదములలో స్తోత్రము చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించిరి. అయిననూ ఆ స్తోత్రములను ఆ విధముగానే  పఠి౦ప వలెను. ఛందోబద్ధముగా నుండవలెను గదా యని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరములనిచ్చెనో ఆ పదములలో భగవానుని అనుగ్రహశక్తి యుండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠి౦చునపుడు మన చైతన్యము తొందరగా భగవచ్చైతన్యమునకు సామీప్యములో నుండును. భగవానుడు భావప్రియుడు గాని బాహ్యప్రియుడు గాడు. భావన అనునది శాశ్వతమైన శక్తి. ఈ విషయమును గమనింపుము". అని చెప్పెను.

అంతట నేనిట్లంటిని. "అయ్యా! భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహము. ఇంకనూ శ్రీపాదులవారి అవతార విశేషములను తెలియజేసి నన్ను కృతార్థుని చేయ ప్రార్థన."

ఆనంద శర్మ యిట్లు పలికెను. "శ్రీపాదుల వారు మల్లాది వారికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, వత్సవాయి వారికిని కూడా చాలా సన్నిహితమై, భాషచేత వెల్లడి చేయుటకు వీలుగాని ఋణానుబంధము కలవారు. ఆ మూడు కుటుంబముల వారికిని పుణ్యబలమెంతో యున్నది. అందువలననే తన తండ్రి ఆ మూడు కుటుంబములవారు యిచ్చు ద్రవ్యమును గాని, వస్తువులను గాని స్వీకరించక పోవుట అనర్థ హేతువని శ్రీపాదులు అభిప్రాయపడిరి. శ్రీపాదుని అభీష్టము మేరకు పండగ, పబ్బములందే గాక, యితర సమయములందు కూడా అప్పలరాజుశర్మ దంపతులు, తమ సంతానముతో సహా మల్లాది వారింటికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికిని, వత్సవాయి వారింటికిని  యథేచ్చముగా పోయెడివారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒకానొక పండుగ రోజున అప్పలరాజు శర్మ దంపతులను తమ యింటికి ఆహ్వానించిరి. శ్రీపాడులవారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తూగుటుయ్యాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊగుచుండిరి. ఆ రోజున శ్రేష్ఠి గారెంతయో గంభీరముగా నుండిరి. దానికి కారణమున్నది. పీఠికాపురములో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు ఓఢ్రదేశమునకు పోయి జ్యోతిషమునభ్యసించెను. అతడు చెప్పిన జ్యోతిషము పొల్లు అయిన దాఖలాలు లేవు. అతడు అతి ఖచ్చితముగా ప్రాణ ప్రయాణ సమయమును సూచించగలడు. అతడు ఫలానారోజున యిన్ని ఘడియల యిన్ని విఘడియలకు హృదయ సంబంధ రోగముచే శ్రేష్ఠి పంచత్వము నొందునని చెప్పెను. కొన్ని ఔషధ మొక్కలకు, గ్రహములకు, నక్షత్రములకు, కొన్ని పవిత్ర వృక్షములకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధము కలదనియూ తానొక ఔషధరాజమును, తాయెత్తును యిచ్చేదననియూ దాని వలన అపమృత్యు దోషము హరించుననియూ, అప్పలరాజుశర్మను వదలి తనను తమ కులపురోహితునిగా చేసుకొనవలసినదియూ చెప్పెను. ఈ విధానమునకు శ్రేష్ఠి నిరాకరించెను. నా జ్యోతిషము తప్పిన యెడల నేను శిరోముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగెదననియూ ఆ జ్యోతిష్కుడు ప్రతిజ్ఞ చేసెను. విషయము అప్పలరాజుశర్మకును, బాపనార్యులకును నివేదింపబడెను. బాపనార్యులు జటిలమైన గణితము చేసి దైవిక శక్తి పని చేసి వాని అపమృత్యువు పరిహరింపబడునని సూచించెను. అప్పలరాజుశర్మ కాలాగ్నిశమనుని పూజించి తీర్థమును ప్రసాదముగా నిచ్చెను. సుమతీ మాత ప్రసంనవదనయై తన చిన్ననాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చెను. ఇంతలో శ్రేష్ఠికి హృదయమునందు బాధ కలిగి అమ్మా! అని పిలిచెను. దగ్గరనేయున్న సుమతీ మాత నాయనా! నన్ను పిలిచితివా? యని పరుగున వచ్చి దివ్య మంగళ స్వరూపమైన శ్రీ హస్తముతో శ్రేష్ఠి హృదయమును స్పృశించెను. శ్రేష్ఠి ఓడిలోనున్న శ్రీపాదులవారు 'పో' అని గట్టిగా అరచిరి. శ్రేష్ఠి యింట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గిలగిలా తన్నుకొని కొన్ని క్షణములలో అసువులు బాసెను. శ్రేష్ఠి రక్షింపబడెను.

ఈ విషయము జ్యోతిష్కునకు తెలిసెను. అతడు శ్రేష్ఠి యింటికి పరుగు పరుగున వచ్చెను. తృటిలో తన అమోఘ జోశ్యము తప్పి పోయినండులకు అతడు లోలోన ఎంతో దుఃఖించెను. 

జ్యోతిష్కునితో శ్రీపాదులవారు, "నీవు జ్యోతిష్కుడవే! చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడవే! కాదనను! జ్యోతులన్నిటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేల? నీవు శిరో ముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగనక్కరలేదు. నీవు పశ్చాత్తప్తుడవయిన చాలును. నీ తండ్రి తను జీవించి యుండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకొనెను. అతడు ఆ అప్పును తీర్చి వేసితినని అబద్ధమాడెను. ఆ అబద్ధము కూడా గాయత్రీ సాక్షిగా చెప్పెను. దాని ఫలితముగా మీ తండ్రి శ్రేష్ఠి యింట ఆబోతుగా జన్మించెను. శ్రేష్ఠి ధర్మాత్ముడు గనుక ఆ ఆబోతునకు సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మనొందిన నీ తండ్రికి ఉత్తమజన్మను నేను ప్రసాదించితిని. అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును ఆబోతునకు బదలాయించితిని. నీవు యీ ఆబోతునకు దహన సంస్కారములోనరించి అన్నదానము చేయుము. నీ తండ్రికున్న కర్మఫలము నశించును. ఉత్తమగతి కల్గును." అని పలికిరి. శ్రీపాదుల వారి యీ వచనముల ప్రకారమే ఆ జ్యోతిష్కుడు నడచుకొనెను.

నాయనా! శంకరభట్టు! శ్రీపాదులవారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేసెదరు. ఒక్కొక్క పర్యాయము రాబోవు జన్మలోని కొంత ఆయుష్షును తగ్గించి యీ జన్మలో ఆయుష్షును పెంచగలరు. లేదా కర్మ ఫలితములను బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు చేయగలరు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్షు నుండి ఆ వ్యక్తికి ఆయుష్షు పెంచగలరు. అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుర్దాయము నీయగలరు. శరీరములో తరుగుదలనూ, పెరుగుదలనూ నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకొనును. శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు. వారికి అసాధ్యమనునది లేదు. ఉచ్చ్వాస నిశ్వాసముల గతిని విచ్చేదనం చేయుట వలన ముక్తిని సాధించుట సులభతరము. క్రియాయోగి తన ప్రాణ శక్తిని ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్టాన, మూలాధార చక్రములను చుట్టి పై నుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి పరిభ్రమించునట్లు చేస్తాడు. ఒక్క క్రియకు పట్టే కాలము ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసమునకు సమానమౌతుంది. నాయనా! ఆహోరాత్రములోని మూడోవంతు సమయంలో వెయ్యి క్రియలు జరిగితే కేవలం మూడు సంవత్సరకాలంలో సహజ ప్రకృతి ద్వారా పది లక్షల సంవత్సరములలో వచ్చే పరిణామం వస్తుంది. పురాణములలో అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామ కాలమని అర్థం చేసుకోవాలి. అంటే ఆయా యోగులకి పట్టే వాస్తవకాలం వేరుగాను, ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టేకాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతీ జీవికి ఆయుర్దాయాన్ని యిచ్చి శ్వాస ప్రశ్వాసలని నిర్ధారిస్తాడు. అంతేగాని యిన్ని సంవత్సరాలుగా నిర్ణయించాడు. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చవుతుంది. తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువగా శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో ఎనిమిదో వంతు మాత్రమే తీసుకుంటుంది. 

ఆనంద శర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడను అయినాను. ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకుని ఆనంద శర్మ అనుజ్ఞ తీస్కుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురువపురం వైపుకు బయలుదేరితిని. 


శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 13 సమాప్తం.)   

No comments:

Post a Comment