Friday, February 3, 2012

Chapter 12 Part 2 (Last Part)

అధ్యాయము 12 
కులశేఖర వృత్తాంతము - భాగము 2 
సత్పురుషులకు అన్నదానము చేసిన కలిగెడి ఫలము 

గ్రంథ పారాయణానంతరము కనీసము 11 మంది సత్పురుషులకు భోజనము పెట్టుటగానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్త క్షేత్రములందు వినియోగించబడునట్లు చేసినగానీ పారాయణ ఫలము సంపూర్తిగా లభింపదు. సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతే కాకుండా వారు సంతుష్టులయినపుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము, మొదలయిన వాటికి సంబంధించిన భోగ, యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతరములో అవ్యక్తము నందలి బీజములు వ్యక్త స్థితిలో అంకురములై, మహావృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపదీమాత నుండి ఒక్క అన్నపుమెతుకును స్వీకరించిన శ్రీకృష్ణపరమాత్మ దుర్వాస మహర్షికిని, అతని పదివేలమంది శిష్యులకును కడుపు నిండుగా భోజనము అనుగ్రహించ గలిగెను. అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమునూ అవ్యక్తమునందు బీజరూపమున నుండి కాలాంతరమున వ్యక్త స్థితి యందు సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములను ప్రసాదించుచున్నవని గ్రహింపవలెను. 

ఒకసారి శ్రీకృష్ణుడును, సుధాముడును దర్భలను కోసుకొను నిమిత్తము అడవికిపోయిరి. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమము నుండి తెచ్చుకొన్న అటుకులను తినుచుండెను. కపటనిద్ర పోవుచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్లు నటించి, "సుధామా! ఆకలి యగుచున్నది. ఇంటివద్ద నుండి వచ్చునపుడు గురుపత్ని బిడ్డల ఆకలి బాపుటకు ఏమయినా ఆహార పదార్థములను యిచ్చినదా?" అని అడిగెను. సుధాముడు లేదనెను. నీవు ఏదో నములుచున్నట్లు తోచుచున్నదే అని యనెను. ఏమియునూ లేదు. విష్ణు సహస్రనామమును చదువుకొనుచున్నాననెను. ఓహో! అలాగునా! మనయిద్దరికీ అమ్మగారు అటుకులను తినుట కిచ్చిరనియూ, నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లును కల వచ్చినది అని అనెను. అంతట సుధాముడు "శ్రీకృష్ణా! అలసియుంటివి గదా! అందులోనూ పగటివేళ. ఈ వేళలో వచ్చు కలలకు ఫలితము ఉండదని శాస్త్రము చెప్పుచున్నదనెను." శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనెను.

కాలాంతరమున సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యెను. తన వెతలను బాపుమని ఎన్నియో మార్లు విష్ణు సహస్ర నామమును పఠించెను. ఆఖరుకి శ్రీకృష్ణునికి అనుగ్రహము కలిగినది. కుచేలుని నుండి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాను అలసిపోయినపుడు కుచేలుడు ఒడిలో తలపెట్టుకొననిచ్చిన కారణముననే శ్రీకృష్ణుడు కుచేలుని హంసతూలికాతల్పముపై పరుండబెట్టి పాదసేవ చేసెను. కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేయునో ప్రభువు దీనిలో సూచించెను. 

మల్లయుద్ధ ప్రవీణునకు గర్వభంగము 

శ్రీపాదులవారు 4 సంవత్సరముల బాలుడై యుండగా పీఠికాపురమునకు వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మళయాళ దేశీయుడొకడు వచ్చెను. వాని పేరు కులశేఖరుడు. మన శరీరములోని చాలా భాగములను నియంత్రించు కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మలని పిలిచెదరు. ఈ మర్మలపై కొట్టిన లేదా తాకిన యెడల మనిషిని స్పృహ కోల్పోవునట్లు చేయవచ్చును. ఏదయినా శరీరభాగమును పనిచేయకుండా అంగవైకల్యమును కూడా కల్పించవచ్చును. మర్మాభిఘాతాలలో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి వీటిని వినియోగించవలెను. యుద్ధకళే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగళ్ లని అంటారు. ఈ అడంగళ్ మర్మాలలో చికిత్స ఏ విధముగా చేయవలెనో నేర్పే కళనే మర్మ చికిత్స అని అందురు. ఈ శాస్త్రమును ముందుగా లోకమునకు తెలియజేసిన ప్రాచీన వైద్యుడు 'సుశ్రుతుడు'. ఈ కళలో అత్యంత ప్రమాదకరమైన 12 మర్మ స్థానములు ఉన్నవి. వాటిని గురుముఖతః నేర్చుకుని లోక కళ్యాణమునకు మాత్రమే వినియోగించవలెను. ఈ మర్మ స్థానములలో ప్రాణశక్తి విశేషంగా ఉండును. వీటిపై తీవ్ర వత్తిడి కలిగించడంవలనగాని, ఆ స్థానములలో దెబ్బ తీయుటవలనగాని మనిషికి ప్రాణాపాయమును కలిగించవచ్చు. కొన్ని స్థానములలో వత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే గాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయము చేయవచ్చును.

కులశేఖరుడు ఏడుకొండల వాని భక్తుడు. అతడు ప్రతి రాజ్యములోని మల్లయోధులను జయించుచూ జయపతాకములను గైకొనుచూ కాలకర్మవశమున పీఠికాపురమునకు వచ్చెను. పీఠికాపురములో కూడా మల్లయోధులు ఉన్నారు. వారందరూ సమావేశమై మనము కులశేఖరుని చేతిలో చావు దెబ్బ తినుట ఖాయము. మన ఊరి ప్రతిష్ఠకూడా మంటగలసిపోవును. యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతీతి. శ్రీపాద శ్రీవల్లభులవారు దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసినవారు అనుచున్నారు. కావున మనము ఈ విషమ సమస్యా పరిష్కారము వారినే శరణువేడెదము అని అనుకొనిరి. అపుడు శ్రీపాదులవారు నరసింహవర్మ గారి యింటనుండిరి. శ్రీ వర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేకముగా ఒక వెండిజరీతలపాగాను తయారు చేయించిరి. వారు తమ జమిందారీ భూముల పర్యవేక్షణకు పోవునపుడు వెండిజరీతలపాగాను ధరింపజేసి శ్రీపాదుల వారిని గుఱ్ఱపుబండిలో తీసుకొని వెళ్ళుట పరిపాటి. ఒకరోజు తలపాగాను ధరింప జేయబోవు సందర్భములో శ్రీపాదులవారు  తాతా! మనము మరికొంత సమయము ఆగి వెళ్ళవచ్చుననిరి. 

ఇంతలోనే పీఠికాపుర మల్లయోధులు వారివద్దకు వచ్చిరి. వారు శ్రీపాదులవారిని శరణుజొచ్చిరి. శ్రీపాదులవారు వారికి అభయమిచ్చినారు. పీఠికాపురములో భీముడు అనుపేరుగల గూనివాడు ఒకడుండెను. అతడు అష్టవంకరలతో నుండెడివాడు. పైగా దుర్భలుడు. ఏ పనీ చేయలేకపోయిననూ వానిని వర్మగారు తనసేవకు వినియోగించుకొని జీతమునిచ్చువారు. భీమునకు శ్రీపాదులవారియందు అపారమైన ప్రేమాభిమానములు మరియు మహా అచంచల విశ్వాసము. వాడు, తన గూనెను బాగు చేయవలసినదని శ్రీపాదులవారిని తరచుగా కోరెడివాడు. దానికి శ్రీపాదులవారు తగిన సమయము వచ్చినపుడు బాగు చేసెదనని చెప్పెడివారు.శ్రీపాదులవారు మల్లయోధులతో మనకేమి భయము? మన భీముడున్నాడు. కులశేఖరుని ఎదుర్కొనగలడు. భీముడంతటివాడు మన అండనుండగా మనకేమి భయము? అని అనిరి.

దత్త విధానములు చిత్ర విచిత్రములుగా నుండును. కులశేఖరునిపై పోరునకు భీముని ఎంపిక చేయుట పీఠికాపుర వాసులకు ఆశ్చర్యమును కలిగించినది. ఈ దెబ్బతో భీముడు చనిపోవుట అయినా జరుగవచ్చును, లేదా శ్రీపాదులవారి దివ్యత్వము వెలుగులోనికి వచ్చును అని కొందరు తలపోసిరి. కుక్కుటేశ్వరాలయ పరిసరములందు మల్లయుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడినది. అనేకమంది అచ్చటకు ఈ వినోదమును చూచుటకు వచ్చిరి. పోరు ఆరంభమయ్యెను. కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకును భీముని శరీరము శక్తివంతమగుచుండెను. భీముని అతడు ఏ ప్రాంతములందు కొట్టుచుండెనో అదే ప్రాంతములో కులశేఖరునికి దెబ్బలు తగులుచుండెను. కులశేఖరునికి నీరసము వచ్చెను. భీముని గూనె సరిచేయబడుటయే గాక అతడు మంచిబలశాలిగా తయారయ్యెను.

కులశేఖరుడు శ్రీపాదులవారి పాదాక్రాంతుడయ్యెను. శ్రీపాదులవారు, "కులశేఖరా! మానవశరీరంపై మర్మలు 108 వరకూ ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్త జ్ఞానమును నీకున్నది. అయితే భీముడు కేవలము నన్నే నమ్ముకొని యున్నవాడు. నేనే తన రక్షకుడనను జ్ఞానము వానికున్నది. నీ జ్ఞానము గొప్పదా? వాని జ్ఞానము గొప్పదా? నీవు అహంకారముతో విర్రవీగితివి. నేను దివ్య వినోదిని. రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వమును నీకిచ్చుచున్నాను. శరీరమునందు నీరసముతో అన్నవస్త్రములకు లోటు లేకుండా మాత్రము జీవించెదవు గాక! భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తినంతటినీ తీసుకొని ధృడకాయుడై యుండుగాక!నేను ప్రపంచములోని ప్రతి జీవికంటెను బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవ్వరు? నేను కాదా? సదా నా రక్షణను కోరుచూ ఈ మర్మకళను నీవు దుర్వినియోగపరచినావు. కావున నీలోని ఈ మర్మకళను ఉపసంహరించుచున్నాను." అని పలికిరి.

శ్రీపాదుల వారు క్షణకాలము పాటు కులశేఖరునకు శ్రీ పద్మావతీ వేంకటేశ్వరునిగా దర్శనమిచ్చి వానిని కృతార్థుని చేసిరి. శ్రీపాదుల వారి లీలలు దుర్గ్రాహ్యములు. అచింత్యములు. వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరి అయిన మార్గము.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

( అధ్యాయము 12 సమాప్తం )        

No comments:

Post a Comment