Sunday, February 5, 2012

Chapter 13 Part 2

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 2 
గాయత్రీ మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన 

ఆనందశర్మ యిట్లు వివరించెను. "గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తి తో సంబంధమును స్థాపించుకొనిన యెడల సూక్ష్మ ప్రకృతి స్వాదీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించియుండును. కొన్ని నాడులు కలిసిన యెడల గ్రంథియని పిలువబడును. మానవ శరీరము నందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబిడీకృతమై యుండును. జపయోగము నందు నిష్ఠులయినవారు ఆయా మంత్రములను ఉచ్ఛరించుట వలన ఆయా గ్రంథుల యందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును.

'ఓం'  అనుదానిని ఉచ్ఛరించినపుడు శిరస్సుపైన ఆరు అంగుళముల ప్రాంతము నందును,

'భూ:' అనుదానిని ఉచ్ఛరించినపుడు కుడికన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును 

'భువ' అనుదానిని ఉచ్ఛరించినపుడు మానవుని త్రినేత్రము పైన మూడు అంగుళముల ప్రాంతము నందును,

'స్వః' అనుదానిని ఉచ్ఛరించినపుడు ఎదమకన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును శక్తి జాగృతమగును.

ఆజ్ఞాచక్రము ప్రాంతము నందున్న 'తాపిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సాఫల్య' శక్తిని జాగృతము చేయుటకు 'తత్'

ఎడమకన్ను యందున్న 'సఫలత' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'పరాక్రమము' అను శక్తిని జాగృతము చేయుటకు  'స'

కుడికన్ను యందున్న 'విశ్వ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'పాలన' అను శక్తిని జాగృతము చేయుటకు 'వి'

ఎడమ చెవి యందున్న 'తుష్టి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'మంగళకరము' అను శక్తిని జాగృతము చేయుటకు 'తు:'

కుడి చెవి యందున్న 'వరద' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'యోగము' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'వ' 

నాసికా మూలము నందున్న 'రేవతి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ప్రేమ' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'రే'

పై పెదవి యందున్న 'సూక్ష్మ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఘన' అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు 'ణి'

క్రింది పెదవి యందున్న 'జ్ఞాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'తేజము' అను శక్తిని జాగృతము చేయుటకు 'యం'

కంఠము నందున్న 'భర్గ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'రక్షణ' అను శక్తిని జాగృతము చేయుటకు 'భర్'

కంఠకూపము నందున్న 'గోమతి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'బుద్ధి' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'గో'

ఎడమవైపు ఛాతియొక్క అగ్రభాగము నందున్న 'దేవిక' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'దమనము' అను శక్తిని జాగృతము చేయుటకు 'దే'

కుడివైపు ఛాతియొక్క అగ్రభాగమునందున్న 'వారాహి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'నిష్ఠ' అను శక్తి యొక్క సిద్ధి కొరకు 'వ'

ఉదరమునకు పైభాగమున చివరి ప్రక్కటెముకలు కలియు స్థానమందున్న 'సింహిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ధారణా' అను శక్తిని జాగృతము చేయుటకు 'స్య'

కాలేయము నందున్న 'ధ్యాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ప్రాణ' అను శక్తిని జాగృతము చేయుటకు 'ధీ'

ప్లీహము నందున్న 'మర్యాద' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సంయమ' అను శక్తిని జాగృతము చేయుటకు 'మ'

నాభి యందున్న 'స్ఫుట' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'తపో' అను శక్తిని జాగృతము చేయుటకు 'హి'

వేనుబాము చివరిభాగము నందున్న 'మేధా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'దూరదర్శితా' అని శక్తిని జాగృతము చేయుటకు 'ధి'

ఎడమ భుజము నందున్న 'యోగమాయా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'అంతర్నిహితము' అను శక్తిని  జాగృతము చేయుటకు 'యో'

కుడి భుజము నందున్న 'యోగిని' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఉత్పాదన' అను శక్తిని జాగృతము చేయుటకు 'యో'

కుడి మోచేయి యందున్న 'ధారిణి' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సరసతా' అను శక్తిని జాగృతము చేయుటకు 'నః'

ఎడమ మోచేయి యందున్న 'ప్రభవ' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'ఆదర్శ' అను శక్తిని జాగృతము చేయుటకు 'ప్ర'

కుడిమణికట్టు నందున్న 'ఊష్మా' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సాహసము' అను శక్తిని జాగృతము చేయుటకు 'చో'

కుడి అరచేతి యందున్న 'దృశ్య' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'వివేకము' అను శక్తిని జాగృతము చేయుటకు 'ద'

ఎడమ అరచేతి యందున్న 'నిరంజన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న 'సేవ' అను శక్తిని జాగృతము చేయుటకు 'యాత్'

అను వానిని ఉచ్ఛరింపవలెను.

ఈ విధముగా గాయత్రీమంత్రము నందలి 24 అక్షరములకునూ, మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24  గ్రంథులకునూ, ఆ గ్రంథులందు నిబిడీకృతమైన 24 రకములయిన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్యా మార్పులకు లోనుగాని బ్రహ్మ తత్త్వమును సూచించును. 8 అను సంఖ్యా మాయాతత్త్వమును సూచించును.

దో చౌపాతీ దేవ్ లక్ష్మి అను వాక్యమునకు వివరణ 

శ్రీపాదులవారు తమకిష్టమైనవారి గృహము నుండి రెండు చపాతీలను స్వీకరించువారు. వారు 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుటకు బదులు 'దో చౌపాతీదేవ్ లక్ష్మీ' అని పిలుచువారు. "దో" అనునది రెండు సంఖ్యను, "చౌ" అనునది నాలుగు సంఖ్యను, "పతిదేవ్" శబ్దము జగత్ప్రభువైన పరమేశ్వరుని తొమ్మిది సంఖ్యను సూచింపగా, ' లక్ష్మీ' శబ్దము మాయాస్వరూపమైన ఎనిమిది సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2498 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రీ స్వరూపమనియు, పరమాత్మననియు, పరాశక్తిని కూడా తానేననియూ సూచించుటకు యీ సంఖ్యను శ్రీపాదుల వారు యీ విధముగా అన్వయించిరి.

(ఇంకా ఉంది..)       

No comments:

Post a Comment