Saturday, February 4, 2012

Chapter 13 Part 1

అధ్యాయము 13 
ఆనందశర్మ వృత్తాంతము - భాగము 1 

నేను సుబ్బయ్యశ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణమును సాగించితిని. రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకొంటిని. మాధూకరమునకు ఎవరింటికి పోవలెనాయని ఆలోచించు చుంటిని. తన వీధి అరుగు మీద సుఖాసీనుడయి ప్రక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూచితిని. అతని కన్నులు తేజస్వంతములైయుండెను. కనులనిండుగా కరుణారసము చిప్పిలుచుండెను. అతడు నన్ను సాదరముగా లోనికి ఆహ్వానించి భోజనమిడెను. భోజనానంతరము అతడు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! నన్ను ఆనందశర్మ అని అందురు. నేను గాయత్రీ మంత్రమును అనుష్టించుచుందును. గాయత్రిమాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రమునకు గోచరించి, దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు, అతనికి కడుపారా భోజనమిడుము. దత్తప్రభువును దర్శించినంత నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగినది. కడున్గాడు సంతసము."

అంతట నేనిట్లంటిని. "అయ్యా! నేను దత్తభక్తుడనే! దత్తప్రభువుల వారు ప్రస్తుతము భూలోకములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచుంటిని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక బ్రాహ్మణుడను."

కణ్వమహర్షి ఆశ్రమ వివరణ 

నా మాటలను విని ఆనందశర్మ నవ్వుకొనెను. "అయ్యా! మా నాయన నాకు ఉపనయనము చేయు సమయమున మా యింటికి అవధూత ఒకరు వచ్చిరి. మా యింటివారు అతనికి సకల పరిచర్యలను చేసిరి. అతడు గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేసెను. బృహత్ శిలకోన(పెంచలకోన)లో గల నృసింహదేవుని దర్శించమని ఆదేశించెను. మా నాయన నన్ను పెంచలకోనకు తీసుకొనిపోయెను. అచ్చట నృసింహ దేవుని దర్శనానంతరము తలవని తలంపుగా మా నాయన ధ్యానస్థుడయ్యెను. ఆ ధ్యానము రేయింబవలు సాగెను. నాకు భయము వేసినది. ఆకలి వేసినది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనమిడెను. నన్ను తీసుకొని దుర్గమములైన అడవి దారివెంట కొండ గుహల లోనికి తీసుకొనిపోయెను. తరువాత అతడు అంతర్హితుడయ్యెను. ఆ గుహలో ఒకానొక వృద్ధ తపస్విని చూచితిని. అతని కన్నులు ప్రచండ అగ్ని గోళములవలె నుండెను. అతడు 101 మంది ఋషులచే సేవింపబడుచుండెను. ఆ వృద్ధ తపస్వి తాను స్వయముగా కణ్వమహర్షిననియూ, యిది తన తపోభూమి అనియూ, తన శిష్యులందరునూ యువకులుగా కన్పించిననూ, అనేక వేల సంవత్సరముల వయస్సు కలవారనియూ, అవధూతరూపమున శ్రీదత్తప్రభువు దర్శనమువలన మహా పుణ్యము పొందిన కారణమున యీ తపోభూమికి రాగలుగుట సంభవించెననియూ తెలిపెను. నాకు సంభ్రమాశ్చర్యములు కలిగి నోటమాట రాదాయెను. శరీరము వణుకుచుండెను. అంతట కణ్వయోగీంద్రులిట్లనిరి. ప్రస్తుతము దత్తప్రభువులు పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసినదని ప్రభువునకు మా విన్నపముగా తెలియజేయుము. నీకు శీఘ్రముగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనము కలుగును గాక! అని, ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్యహస్తమునుంచిరి. నేను క్షణ కాలములో మా నాయన వద్ద నుంటిని. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేమిర్వురమునూ మా స్వగ్రామమునకు విచ్చేసితిమి. నాకు కణ్వమహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవమునూ, దత్తప్రభువు యొక్క నవావతారము పీఠికాపురములో ఉన్నదనెడి విషయమునూ మా నాయనకు కూడా తెలియజేయలేదు. 

రాజమహేంద్రవరము దగ్గర పట్టసాచల పుణ్యక్షేత్రము

కాలము గడచుచుండెను. కణ్వమహర్షి ఆశీర్వాద ప్రభావము వలన నాకు ధ్యానములో తరచు పాదుకా దర్శనము అగుచుండెను. ఒక పర్యాయము మా యింటికి కొందరు బంధువులు వచ్చిరి. వారికి పుణ్య నదులందు స్నానములాచరించి పుణ్యక్షేత్రములు సందర్శింప అభిలాష కలిగెను. వారు మా నాయనను కూడా తమతో రమ్మనిరి. అప్పటికి నా వయస్సు పది సంవత్సరములు. మా నాయనకు నా యందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనెను. నేను వల్లెయంటిని. రాణ్మహేంద్రవరము గోదావరీనది యోడ్డున గల పట్టణము. మహాపుణ్యక్షేత్రము. రాణ్మహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండిన కొండలమీద ఋషులు కొందరు తపస్సు చేసుకొనువారు. తూర్పుదిశలో నుండిన కొండలమీద మరికొంతమంది ఋషులు తపస్సు చేసుకొనువారు. రాణ్మహేంద్రవరమునకు ఆనతి దూరముననున్న పట్టసాచల పుణ్యక్షేత్రము గోదావరీనదీ మధ్యస్థమై యున్నది. మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరులలో కొంతమంది పట్టసాచలములోను, మరికొంతమంది ఋషీశ్వరులు రాణ్మహేంద్రవరమునందలి కోటిలింగక్షేత్రము నందును వేదస్వస్తి చెప్పువారు. ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్యేమార్గముగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమము నుండి వచ్చువారు, ఉత్తరము నుండి వచ్చువారు, దక్షిణమునుండి వచ్చువారు "ఎదురులపల్లి" యను గ్రామమున కలుసుకొనువారు. ఈ ఎదురులపల్లి గ్రామమునకు అత్యంత సామీప్యమైయున్న మునికూడలి గ్రామమున విశ్రమించి పరస్పరము చర్చలు చేసుకొనువారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికూడలి గ్రామమును దర్శించగలిగితిని. ఇది అంతయును శ్రీదత్త ప్రభువుల లీల.

కలియుగములో శ్రీదత్తాత్రేయుల వారి ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీవల్లభులు 

అత్యంత గహనములయిన వేదాంత విషయములు, యోగశాస్త్ర రహస్యములు, జ్యోతిశ్శాస్త్ర విషయములు చర్చకు వచ్చినవి. ఈ చర్చలలో పాల్గొన్న మహామునులందరునూ ముక్తకంఠముతో శ్రీదత్త ప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభ నామమున పీఠికాపురములో అవతరించియున్నరనియూ, కలియుగములో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తవతారమనియూ చెప్పిరి. భౌతికముగా వారి దర్శనము పొందుటకు వీలులేని వారు ధ్యాన ప్రక్రియల వలన తమ తమ హృదయములలోనే దర్శించగలరనియూ, యీ అవతారము అత్యంత శాంతమయ, కరుణారస పరిపూర్ణము అనియూ చెప్పిరి.

అంతట మా నాయన నన్ను పీఠికాపురమునకు తీసుకొని వెళ్ళినారు. మాతో వచ్చిన పండిత బృందము పాదగయా తీర్థమునందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయము నందలి వివిధ దేవతలను దర్శించి, అర్చించి అచ్చటనుండి వేదస్వస్తి చెప్పుచూ శ్రీ బాపనార్యుల వారింటికి బయలుదేరిరి. శ్రీ బాపనార్యులవారు, శ్రీ అప్పలరాజుశర్మగారు, తమ పండిత బృందముతో వేదస్వస్తి చెప్పుచూ మమ్ములను కలసికొనిరి. అది ఎంతయో మనోహరమైన దృశ్యము. అటువంటి దివ్య, భవ్య దృశ్యములను చూచుట కూడా పూర్వజన్మలలోని సుకృత విశేషమున గాని పొందలేని విషయము.

శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన 

మాకు అందరకునూ శ్రీ బాపనార్యుల యింట విందు భోజనములు ఏర్పాటు చేయబడినవి. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయస్సు అయిదు సంవత్సరములు మించిలేదు. పాలుగారు పసివయస్సు నందున్న ఆ దివ్యశిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహముగా బయల్వెడలుచుండెను. నేను వారి శ్రీపాదములను స్పృశించగా వారు తమ అభయహస్తమును నా తలపై నుంచిరి. "జన్మ జన్మాంతరములందుననూ నా అనుగ్రహము నీపై ఉండును. నీవు కడపటి జన్మము నందు వెంకయ్య నామముతో అవధూతవై, నిత్యాగ్ని హోత్రివై , అకాలము సంభవించినపుడు వర్శములను కురిపింప సమర్థుడవై, సాంసారికజనుల ఈతిబాధలను తీర్ప సమర్థుడవై, వెలుగొందుదువు గాక!" అని ఆశీర్వదించిరి.

అంతట వారిని నేనిట్లంటిని. "శ్రీపాదుల వారి లీలలు ఆలకించు కొలదిని చిత్రవిచిత్రములుగా నున్నవి. గాయత్రీమంత్ర సాధనలలోని రహస్యములను ఎరిగింప ప్రార్థన."

(ఇంకా ఉంది..)               

No comments:

Post a Comment