అధ్యాయము 9
కర్మఫల మీమాంస - భాగము 4
కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజశర్మ గారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులయిననూ వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండెడిది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగా నుండెడివారు. వారి కుటుంబములో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహుల నామధేయము శ్రీధరరామరాజశర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించునది శర్మ నామధేయము. గ్రామమునందు పంటలు పందిననూ, పండకపోయిననూ జమీందారులకు పన్ను కట్టవలసివచ్చెడిది. నిర్బంధముగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై నుండెడిది.
అందువలన శ్రీధరరామరాజశర్మ తన యిష్టాయిష్టములతో ప్రమేయములేకుండా, జమీందారు వారి ఆజ్ఞననుసరించి, హింసాపద్ధతులద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చెడిది. అది వారి కర్తవ్యము, ధర్మమూ కూడాను. అయిననూ, దైవముదృష్టిలో అది పాపకార్యమాయెను. అప్పలరాజశర్మ జ్యేష్ఠభ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధరరాజశర్మయు, చిన్నసోదరుడైన రామరాజశర్మయు అన్గావైకల్యముతో జన్మించిరి. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తావతారులయిననూ తాతగారు చేసిన ఆ స్వల్ప పాపకర్మముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసివచ్చినది. అందుచేతనే వారికి కూడా పాలసమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమము సర్వులకునూ వర్తింపజేయును. తాను అవతారముగా వచ్చియున్ననూ కూడా కర్మఫలితమును తానుకూడా అనుభవించుట మనకు మార్గదర్శకత్వము వహించుటకే.
శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియునూ, శ్రీ వత్సవాయి నరసింహవర్మయునూ, శ్రీపాదుల వారిని తమ స్వంత మనుమనివలె భావించువారు. అందువలన వారు శ్రీపాదులవారి పాలసమస్యను తీర్చుట ఎట్లాయని దీర్ఘముగా ఆలోచించిరి. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా! దీనికి సరి అయిన ఉపాయమును మీరే చేయవలయినని చెప్పిరి. శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వశుభలక్షణములున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠిగారు క్రయముపొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమవద్ద భద్రముగా నుంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పలరాజశర్మగారు వచ్చిరి. వారికి యీ గోవిక్రయ ధనమును వర్మగారోసంగిరి. పౌరోహిత్యము జరుపునపుడు సామాన్యముగా సంభావన నిమిత్తము యీయబడు మొత్తముకంటే యిది చాలా ఎక్కువగా నుండెను. అప్పలరాజశర్మగారు ధర్మబద్ధముగా తాము తీసుకోవలసిన ద్రవ్యమును మాత్రమే తాము తీసికొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతట వర్మగారు తాముకూడా ఆ మిగతాధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశములో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలననిరి. యీ తగాదా శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీ బాపనార్యులు యిట్లు ప్రకటించిరి. "అప్పలరాజశర్మ నిరాకరించిన యీ మొత్తమును తీసుకొనుటకు ఇష్టపడేవారు తీసుకోవచ్చును." అనేకమంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు యిప్పించవలసినదని పోటీపడజొచ్చిరి. ఇది అంతయునూ విడ్డూరమైన విషయము.
అంతట తరునవయస్కుడైన పాపయ్యశాస్త్రియను బ్రాహ్మణుడు, "శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాదు. దైవమే అయిన యెడల యీ విచిత్రపరిస్థితి ఏల దాపురించును? శ్రీ దత్తుడే అయినచో తన ఇద్దరు సోదరులను అంగవైకల్యము నుండి ఏలకాపాడడు? జరిగిన కొన్ని సంఘటనలూ కేవలము యాదృచ్ఛికములు. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను. శ్వేతార్కరక్షను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతీరోజు ఎంతయో జపము చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినాను మలినము అంటదు. యోగ్యుడనైన నాకు యీ ధనమును యిప్పించవలసినది." అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్యశాస్త్రికి ఆ ధనమును యిప్పించెను. ఆ ధనము ఒక మంచిగోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగిసిన తదుపరి విజయగర్వముతో పాపయ్యశాస్త్రి యింటికి పోయెను. అపుడు వాని మేనమామ తన యింటనుండెను. ఇరువురికి ఇష్టాగోష్టి జరిగెను. భోజనము చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను. అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనము చేసేదననియు, ప్రస్తుతము తన మేనల్లుని యింట భోజనము చేయుటకు వీలుపడదనియూ చెప్పి శ్రీఘ్రముగా వెడలిపోయెను.
మేనమామ వెళ్ళిపోయిన తరువాత పాపయ్య సాలోచనగా కూర్చొనియుండెను. అతని భార్యవచ్చి, "స్వామీ! ఇప్పుడు వచ్చిన యీ మేనమామ గత సంవత్సరము చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చు గ్రుద్దినట్లు పోలియుండలేదా?" అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండెడివాడు. అతడును గత సంవత్సరము పరమపదించెను. ఇప్పుడు యీ మేనమామ ఎవడు? తన బుద్ధి ఎంతభ్రమలో చిక్కుకున్నది?తనకు మేనమామ వరుస అయినవాళ్ళు మరికొందరున్నను వారెవ్వరునూ ఇతనిని నూటికి నూరుపాళ్ళు పోలియుండలేదు? చనిపోయిన తన మేనమామయొక్క ప్రేతాత్మనా తాను చూచినది? అతని గుండె వేగముగా కొట్టుకొననారంభించినది. తనకు భూతప్రేతపిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయము కూడా లేదు. తాను ఉపాసించెడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకు చెడుకాలమా? మేనమామ వెళ్లిపోవుచూ "నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను." అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరివిధముల బాధింపదొడగెను. తాను ఆనతికాలములోనే మరణించి తన మేనమామను పరలోకములో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్రచిత్తముతో చేసుకొనలేకపోయెను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయము నందలి స్వయంభూదత్తుని దర్శించుకొనుటకు పోయెను. దత్తమూర్తిని ద్యానింపదొడగెను. ఆ ధ్యానములో తనకు శిరస్సులేని దత్తుడు కనిపించసాగెను. అచ్చటకూడా జపము చేసుకొనుటకు కూర్చున్నపుడు మనస్సు చంచలముగా నుండెను. అర్చకస్వామి ప్రసాదము నిచ్చునపుడు ఆ ప్రసాదమంతయును విషపూరిత కలశమున ముంచి యిచ్చునట్లు తోచెను. అర్చకస్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రము యీ ప్రసాదమును తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య యింటికి తిరిగివచ్చునప్పటికి తన భార్యనుదుట కుంకుమ కనిపించదాయెను. నేను బ్రతికుండగనే కుంకుమనేల తీసితివని అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంత కుంకుమబొట్టును పెట్టుకొనియుండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మనస్థిమితము తప్పెననియెడి ప్రచారము వేగవంతమాయెను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూతచికిత్స మొదలయినవి చేయబడుచుండెను. తనకు పిచ్చిలేదనియు, తాను చెప్పెడి విషయములన్నియూ యదార్థములేయని అతడు చెప్పుచుండెను. అచటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధముగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. ఆజ్ఞానవశమున తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకిది ఫలితమని ఆమె తలపోసెను. నోరులేని పాషాణమూర్తులయిన దేవతామూర్తుల కంటె సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని యింటికి వచ్చినది. వానిని ఎత్తుకొని ముద్దాడినది. ఏకాంతసమయము చూసుకొని వానితో తనయొక్క దురవస్థను తెలిపినది. శ్రీపాదులిట్లనిరి. "అత్తా! ఇదంతయును ఒక చిన్న సర్డుబాతుతో సమసిపోవును. నీవు నాకు మాత్రుసమానురాలవు గనుక యీ రహస్యమును నీకు చెప్పుచున్నాను. నీవు ఎంతమాత్రము ఆలస్యము చేయక నూతన గృహమును నిర్మించుకొనుము. నీవును, మామయు వాస్తుపూజ చేసి, నూతన గృహప్రవేశము చేసిన తదుపరి అంతయును స్థిమితపడును."
శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించిరను విషయమును ఎవరికీ తెలియనీయక అద్దె యింటిలో ఉండుటచే ఈ కష్టములు తమకు సంప్రాప్తించినవనియూ, స్వంత గృహమును నిర్మాణము చేసుకొని తీరవలయుననియూ తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానముగా యిచ్చిరి. దానిని వెంటనే వ్యయప్రయాసల కోర్చి పూడ్పించిరి. నూతన గృహనిర్మాణమునకు యింటిలోని ధన, కనక, వస్తువులు అన్నియునూ వ్యయమాయెను. కొంతఋణము కూడా చేయబడెను. కొండరాల్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణమందు వాడిరి. గృహప్రవేశము జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయెను.
నాయనా! శంకరభట్టూ! పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటమునుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక, క్షోభ, అవమానము, ధనవ్యయము మొదలయినవి కలిగించి కర్మను ధ్వంసముచేసిరి. అంతేగాకుండా పాపయ్య చెడుకర్మను కొండరాళ్ళలోనికి ఆకర్షించి, వాటిని శకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేసిరి. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధమార్గములు చిత్రవిచిత్రములుగా నుండును. స్వస్థుడయిన పాపయ్యతో శ్రీపాదులిట్లనిరి. "నీవు ఎంతటి బుద్ధిహీనుడవు. బుర్రలేనివాడవు? నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదుడుగా నీ ఎదుటనే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వరాలయములోని పాషాణదత్తమూర్తినే నీ రక్షకుడని నీవు నమ్మిటివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్ళకు ఆకర్షించి వాటిని ఖండఖండములుగా చేయించి, నీ కర్మను క్షయింపజేసి, నీకు నూతన గృహమును కూడా ప్రసాదించితిని. నీవు సశరీరుడైయున్న యీ దత్తునియందు విశ్వాసముంచిన యెడల నీ సంస్కారము లన్నింటిని నా శరీరముపైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించెడివాడను. భక్తుని ఒక్క భావనను బట్టి దైవము అనుగ్రహించి ఫలముండును."
యీ లీల జరిగిన తర్వాతా పాపయ్య శ్రీపాద శ్రీవల్లభులవారిని దత్తావతారముగా గుర్తించిరి.
శ్రీపాదుల వారి పాలసమస్య శ్రీ శ్రేష్ఠి గారికిని, శ్రీ వర్మగారికిని బాధాకరముగా నుండెను. వారు శ్రీ సత్యఋషీశ్వరుల చెంతకువచ్చి, "ఓ! రాజర్షీ! మీరు జనకమహారాజు వలె సంసారము నందుండియూ బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమైయున్నారు. మాదొక చిన్న విన్నపము. మీరు దానిని ఆమోదింప వలసినది." అని అడిగిరి. దానికి బాపనార్యులు, "విన్నపమేదో తెలియకుండ ఆమోదము తెలుపుటెట్లు? మీరు నిస్సంకోచులై విషయమును తెలియజేయుడు. నేను అది ధర్మబద్ధమైనయెడల ఆమోదించి తీరెదను." అనిరి. అంతట శ్రీ శ్రేష్ఠి "నేను శ్రీ వర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందినా శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొందియుంటిని. మా కులపురోహితులయిన శ్రీ అప్పలరాజశర్మ గారికి దానిని యీయదలంచితిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమయిన యెడల అంతకంటె మేము కోరదగినదేదియు లేదు." అనిరి.
శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు "సరి! సరి! ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రండు. దానిని అప్పలరాజునకు యిచ్చు ప్రయత్నమును చేసెదము. శుభ లక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు యింట నుండుట దాటకు, గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరము." అని వచించిరి.
గోమాత బాపనార్యుల యింటికి తీసుకొని రాబడినది. దానిని దానముగా స్వీకరించుటకు అప్పలరాజుశర్మ నిరాకరించిరి. హిమాలయములలో శతోపథ ప్రాంతమనునది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతము నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములుండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించి యున్నామనియు, తన బాల్యరూపమును చూసి తరించవలసినదనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగతించిరి. శ్రీపాద శ్రీవల్లభరూపముననున్న శ్రీ దత్తప్రభువులని దర్శించి చరితార్థులైరి. వారిముందు యీ పాలసమస్య తేబడెను. శ్రీ అవధూత, అప్పలరాజుశర్మ గోదానమును స్వీకరించి తీరవలెననియూ, శ్రీపాదుల వారు సాక్షాత్తూ దత్తప్రభువనియూ, వ్యర్థములయిన నియమములతో దత్తప్రభువులకు క్షీరమునొసంగు మహాత్తరసేవను పోగొట్టుకొనగూడదనియూ నొక్కి వక్కాణించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగిరి. పంచభూతములచే సాక్ష్యము నిప్పించెదమని ఆ అవధూతలనిరి.
శ్రీపాదులే దత్తాత్రేయులని పంచ భూతములు సాక్ష్యము యిచ్చుట
యజ్ఞము ప్రారంభమాయెను. భూమాత సాక్ష్యము పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే గనుక అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకముగా నిచ్చునది, దానముగా లెక్కకురాదు గనుక సత్యఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా యీయవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరింపబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపముతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యముగా స్వీకరించబడెను. ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులేయని తెలియపరచెను. పంచ భూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించిరి. గోదానఫలితము శ్రేష్ఠి గారికి దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు యిచ్చునట్లు నిర్ణయించబడినది. యీ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికిని, వత్సవాయివారికిని అపూర్వ పుణ్యము లభించినది.
భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారము ( కాకినాడ), శ్యామలాంబాపురము (సామర్లకోట), శ్రీ పీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశములవారు, అన్ని జాతులవారు, అన్ని సంప్రదాయములవారు, ఏదో ఒక జన్మమున, ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీస్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడెను. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను యీ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడెను. ఆ భూర్జ పత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్యరూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువులలోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలము నందు పాదుకాప్రతిష్ఠ, ఆలయనిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్యశ్రేష్థుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుతుమ్బమున సిరిసంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్యలోకము నందు కొంతకాలముండిన తరువాత మరాఠదేశమున మహాదైశ్వర్యవంతులయిన వైశ్య కుటుంబము నందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతీ అవతారమును కూడా దర్శించగలరు.
నాయనా! శంకరభట్టూ! యీ గోదాన సత్యధివిశేష శుభప్రదము. నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాదవల్లభులు సదా రక్షించెదరు గాక!
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము !
(అధ్యాయము 9 సమాప్తం)
No comments:
Post a Comment