Wednesday, November 30, 2011

Chapter 8 Part 1

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 1 
బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే

ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తీ చేసుకొనిన తదుపరి యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఆత్మ సాక్షాత్కారమగునపుడు పదహారు కళలూ తమతమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము, కర్మలు అన్నియునూ బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైననూ బ్రాహ్మణుడే యగును. 'ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానావిధమైన నామములు' అనువాటిని పదహారు కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశకళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము.

ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును.

విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనునది విశ్వములోని సమస్తప్రాణము. సూక్షాత్మ, హిరణ్యగర్భ నామములతో యిది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవునియోక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తిశరీరమని పేరు. ప్రాణమయచైతన్యమును సరి చేయుట ద్వారా భౌతికసంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమె స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములేర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములేర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన యెడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచనాస్రవంతి క్రమబద్ధము చేసి, నియంత్రణలో ఉంచినయెడల ఆలోచనా ప్రతిబింబరూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యధావిధి నాచారించుచూ, ఆయా కర్మకలాపములలో పధ్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన యెడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంకెల పదహారు రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క యింద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమౌతుంది. సమాధి స్థితిలో ఉన్నయోగికి ఆత్మా సాక్షాత్కారమైనపుడు పదహారు కళలూ తమ తమ భూతములలో లీనమౌతాయి. యోగి యొక్క భౌతిక శరీరమండలి యింద్రియములలోని శక్తులు విశ్వాంతరాళం లోని భూతములలో లీనమౌతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు.

అహం నశించనిదే మోక్షం కలుగదు

మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు బుద్ధి అను వాటియొక్క నియమ నిబంధనలచేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మసాక్షాతారం పొందిన యోగికి పూర్వ జన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటి ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారము జరుగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనపుడు శ్రుతికర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దానియొక్క మాయాజాలములన్నియునూ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూలదేహము కర్మఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూలదేహ స్పృహ లేనపుడు ముక్తావస్థలోనే యుండును. పరమాత్మ సిద్దావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును. యోగికి యీ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు, యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమయిపోవలెను. 

శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రములోని శ్రీ మల్లిఖార్జునలింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి, సూర్యమండలము నుండి శక్తి పాతమును చేసియున్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన యీ శక్తికి శాంతి జరుపవలెను. లేనియెడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా, అర్చనలు జరుపువారు అందరునూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీబాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజలసమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లిఖార్జునలింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు యీ శక్తిపాతమునకునూ అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలములో శాంతి జరిగినది. వేలాదిమందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంత తత్వములో నిలచినపుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును.

అయితే పీఠికాపురములోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరుగవలెనని అన్నదానము జరుగవలెనని సూచించిననూ, అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి.

(ఇంకా ఉంది..)         No comments:

Post a Comment