Monday, November 14, 2011

అధ్యాయము-6 భాగము-3

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము -భాగము 3 
దత్తప్రభువు నిత్య వైభవ విభూతి 

ఈ విషయమును సుమతీ మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతట రాజశర్మ పూజాసమయములో కాలాగ్నిశమన దత్తునే అడిగెదననెను. కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవ్వరును చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవరూపములో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహములోనికి లయమయిపోవును. ఇది నిత్యమూ జరుగు వ్యవహారము. రాజశర్మ అల్పవిషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధరా రా! అని పిలిచెను. దత్తునినుండి ఒక రూపము బయల్వేడలి తన ఎదురుగా ధ్యాననిష్ఠమయ్యెను. తిరిగి తన వ్రేలితో సైగ చేయుచూ శ్రీధరా రా! అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యెను. రాజశర్మకు యిదంతయునూ ఆశ్చర్యముగా నుండెను. శ్రీదత్త ప్రభువు రాజశర్మకు, "నీవు యిప్పుడు చూచినా రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమయిన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నియూ నా చేతిలోని ఆటబంతులు, నేను ఒక్క తాపు తన్నిన యెడల కోటానుకోట్ల యోజనములలో పడవలసినదే! నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచూ రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లునూ, తన భార్య సుశీల అను నామాంతరముగల సోమదేవమ్మగా జన్మించినట్లునూ జ్ఞాతమయ్యెను. గతమంతయూ స్ఫురణకు వచ్చినది. శ్రీ దత్తుడిట్లనెను. నెను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదయినా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ యింత పితృ శ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి, మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరించదలచితిని. గత 100 సంవత్సరముల నుండి యీ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును, మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాఠక చాయనమును చేసినాడు. ఆనాటి హోమభాస్మము మహాపర్వతములవలె పేరుకొని పోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ, మర్త్య, పాతాళములకు కొంపోయెను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోనగిరి యందును, మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములను గొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వనగరము (గాణగాపురము) నందు పడినది. గంధర్వనగరము, భీమా, అమరజా పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరచిన తదుపరి మీన అంశ, మీన లగ్నములందు నృసింహసరస్వతిగా జన్మించి, గంధర్వనగరము నందు అనేక లీలలను చూపి, శ్రీశైలము నందలి కదళీవనమున 300 సంవత్సరములు తపోసమాధినందు ఉంది ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినపుడు శరీరమును త్యజించెదను." అని తెల్పిరి.

దత్తప్రభువు యొక్క యీ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులయిన బాపనార్యులు యిట్లనిరి. "నాయనా! రాజశర్మా! నీవు పూర్వ యుగములలోని జన్మమునందు శ్రీదత్త ప్రభువునకు, సూర్యునకు, అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మము నందు ఏ రూపములో నయిననూ దత్తుడు భోజనము పెట్టమని అడుగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమయిననూ సరే భోక్తలు భోజనము చేయుటకు ముందేయైననూ దత్తుడు భోజనమడిగిన యెడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా! సుమతీ! ఈ విషయములను నీవును గుర్తుంచుకొనుము." నాయనా! శంకరభట్టు! దత్త ప్రభువు యొక్క లీలలు అపూర్వములు. అచింత్యములు. ఇదివరకెన్నడును విననివి. 

శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము

ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతట వీధి ముంగిట "భవతీ! భిక్షాందేహీ!" అని వినబడెను. అవదూతకు సుమతీ మహారాణి భిక్షనిచ్చెను. ఏదైన కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి "అయ్యా! తమరు అవధూతలు. మీ వాక్కులు సిద్ధ వాక్కులు. శ్రీపాద శ్రీవల్లభావతారము అతి త్వరలోనే యీ భూమిమీదకి ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీదత్త ప్రభువు యిప్పుడు ఏ రూపములో సంచరించుచున్నారు? ఇప్పటికి వంద సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీదత్త ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరికనేదయినా కోరుకొమ్మనిరి. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలెనని కోరికగానున్నది." అని అడిగెను. 

ఈ మాటలను వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతీ మహారాణికి తన చుట్టుప్రక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సుగల సుందరబాలుడు యతి రూపమున ప్రత్యక్షమై "అమ్మా! నేనే శ్రీపాద శ్రీవల్లభుడను. నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోర్కెను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపముననున్న నన్ను నీవు ఏదయినా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి. ప్రతిగా ఏదయినా వరమీయవలెనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాపఫలితములను పొందుదురు. సంకల్ప పూర్వకముగా పుణ్య కర్మలను ఆచరించిన పుణ్యఫలితములు సిద్ధించును. ఏ రకమయిన కామ్యములు లేకుండ పుణ్య కర్మలనాచరించుట ఆకారమ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మవలన పుణ్యము పాపము అనునవి లేని మరియొక ఫలితము యీయవలసి వచ్చుచున్నది. అది భగవదధీనమై ఉందును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదనీ భావము. కౌరవ సంహారము భగవన్నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోక హితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవయి కోరికను తెలుపుకొనుము. తప్పక అనుగ్రహించెదను." అని పలికెను.

(ఇంకా ఉంది..) 

No comments:

Post a Comment