Friday, November 25, 2011

అధ్యాయము 7 భాగము 2

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 2 
నరసావధానులకు, వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ - నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు.

ప్రశ్న : నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా? 

ఉత్తరం : నేను నేనే! పంచభూతాత్మకమైన యీ సృష్టిలోని ప్రతీ అణువణువునందునూ అంతర్లీనముగా నున్న ఆద్యశక్తిని నేనే!పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యండుననూ మాతృస్వరూపముగాను, పితృస్వరూపముగానూ ఉన్నది కూడా నేనే! సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే!

ప్రశ్న : అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా?

ఉత్తరం : నిస్సంశయముగా నేను దత్తుడనే! మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. 

ప్రశ్న : అయితే నీకు ఆకారమూ లేదు, గునములూ లేవు. అంతేకదా!

ఉత్తరం : ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే! గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే! సాకార, నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను, వాటికి అతీతుడను కూడా!

ప్రశ్న : అన్నీ నీవే అయినపుడు జీవులకు కష్ట సుఖములు ఎందుకు?

ఉత్తరం : నీలో, నీవూ నేనూ కూడ ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు. నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఃఖములు, పాప పుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలోవున్న 'నీవు' క్షీణదశకు వచ్చి నీలో ఉన్న 'నేను' ఉచ్ఛ దశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు దగ్గరయ్యెదవు. నాకు దగ్గరయ్యే కొలదీ నీ బాధ్యతా తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. 

ప్రశ్న : జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమన వచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజాము?

ఉత్తరం : నీవు వేరుగాను, నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమి లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరమూ ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమునూ, నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియూ, నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్త్వమని తెలుసుకొనిన యెడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నోన్డుతయే మోక్షము గనుక నీవు ద్వైతస్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచున్నపుడు, నీలోని అహంకారము నశిన్చినపుడు, నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మొహములేదు గనుక ఇది కూడ మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి, కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినపుడు 'నీవు' అనునది మిగులక 'నేను' అనునది మాత్రమే ఉందును గనుక మనస్సుచేత ఎంతమాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైతస్థితి లో నున్ననూ నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్ననూ, విశిష్టాద్వైతములో నున్ననూ, అద్వైతములో నున్ననూ బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే! అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైకవేద్యము మాత్రమే.

ప్రశ్న : అవధూత స్థితిలో నున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచున్డురు గదా! మరి నీవు కూడా అవధూతవా?

ఉత్తరం : కాదు. నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము, మరియు బ్రహ్మమే సర్వస్వమూ అనునది అవధూత అనుభవము. కాని నేను బ్రహ్మము. నేనే సర్వస్వమూ అనియెడి స్థితి నాది.

ప్రశ్న : అయిన యీ స్వల్పభేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు.

ఉత్తరం : సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు, బ్రహ్మానంద స్థితి ననుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనపుడు సంకల్పము లేదు. యీ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియెడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించినయెడల జన్మకు రావలసినదే! సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానందరూపము నాది, సంకల్పము నశించిన సత్య జ్ఞానానందరూపము వారిది.

ప్రశ్న : విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా! బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానయినపుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము?

ఉత్తరం : వేయించిన విత్తనములు మొలకెత్తక పోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టి కర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్యనిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది.

ప్రశ్న : దత్తప్రభూ! శ్రీపాదా! వివరించవలసినది.

ఉత్తరం:  భూత, భవిష్యవర్తమానములు, అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలయిన త్రయములనన్నింటిని అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులయిరి. సృష్టి యందలి ఏ జీవియండును, ఏ పదార్తమునండునూ అసూయాద్వేషములు లేశమాత్రమూ లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగాను, అతీతముగాను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలెనని అత్రిమహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి యందలి ప్రతీ ప్రాణినీ, ప్రతీ పదార్ధమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించ వలసినదిగా అనసూయా మాత తపమాచరించినది. కర్మ సూత్రముననుసారించి జీవులకు సుఖదుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లునూ, స్వల్ప పుణ్యములకు మహా ఫలితములు కలుగవలెననెడి సత్సంకల్పములో అనసూయామాత ప్రార్థన చేసెడిది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారమున నున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవంతములైన, తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రా స్థితిలోనున్న చైతన్యము. వృక్షములు, వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రా స్థితిలోనున్న చైతన్యము, జంతువులూ పూర్ణ చైతన్యములో నున్న స్థితి. ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి, తరువాత తరుగుల్మాదులుగా జనించి, ఆ తదుపరి జంతుజన్మలనెత్తి, ఆఖరున మానవజన్మ నెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షమునొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయ వచ్చుననునది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములో నున్న చైతన్యము జాగృతావస్థలో నున్నది. గనుక దానిని నిద్రావస్థ లోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపములోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామభాగమున అనఘాదేవియు, కుడి భాగమున దత్తాత్రేయుడు గలిగిన అర్ధనారీశ్వర రూపమున జనిన్చితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్ధ్యములుండునని నీవు గ్రహించవలెను.

ప్రశ్న : శ్రీపాదా! సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా?

ఉత్తరం : తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే! తోటకూర విషయము చాలా చిన్న విషయము. అయిననూ నీవు దానియందు ఎంత మోహమును పెంచుకొన్నావు? అమ్మగాని, నాన్నగారుగాని, తాతగారు గాని ఎవరినీ ఏమియూ యాచించి అడుగరు. పసిపిల్లవాడినయిన నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసుపదినపుడు నీవు తోటకూరను వెంటనే యిచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితకాలము చాలదు. ప్రతీ మానవునికిని పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యం, అందము, ప్రఖ్యాతి మొదలయినవి సిద్ధించును. పాపఫలరూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలయినవి సిద్ధించును. నీ పుణ్యఫలములో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయమును పోసితిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది. పాపభాగము ఎక్కువ మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను, నీవు స్వయంభూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను, అవస్థ పడకుండా రెండుపూటలా అన్నము లభించునట్లు అనుగ్రహించుచున్నాను.

ప్రశ్న : శ్రీపాదా! వర్ణ వ్యవస్థ ప్రకారము నడచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది గదా! మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పుకాదా?

ఉత్తరం : సత్యఋషీశ్వరుల నిర్నయములో దోషము నెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యులవారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనునది ఏమిటో ఎరుగని పరమపవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప జేయవలసినదని కాల కర్మ దేవతలను నేను ఆదేశించితిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నృశింహ స్వామికి పరమభాక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమపద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ మూడు కుటుంబములతోను నాకు గల ఋణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు. ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడకాదు. నా వరద హస్తము తరతరములవరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు. 

(ఇంకా ఉంది.. )         

No comments:

Post a Comment