Sunday, November 13, 2011

అధ్యాయము-6 భాగము-1


అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 1 

ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. "అయ్యా! శ్రీపాద శ్రీవల్లభుల వారు యీ చరాచర సృష్టికంతటికినీ మూలము. వారు వటవృక్షము వంటివారు. వారి అంశావతారములన్నియూ ఆ వృక్షము యొక్క ఊడలవంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్త్వము గలవిగా కనిపించిననూ, వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకునూ వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండియే సమస్త శక్తులును సంప్రాప్తమగుచుండును, తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమున చేరిన వ్యక్తికి అన్ని దారులునూ ఒకటిగానే ఉందును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారునూ దత్త తట్ట్వములో సమన్వయము పొందుదురు. సమస్త ప్రాణులకునూ కాంతి పరివేష్టమై ఉందును. నేను పీఠికాపురము నందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము యీ విధముగా ఉన్నది, ఈ మనుష్యుని యొక్క కాన్తివిశేశము యీ రంగులో యింతవరకు వ్యాపించి యున్నది, అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మ కాంతి ఎంతమేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వారికి స్వయంభూదత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభులు వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవళకాంతి అమెయముగా వ్యాపించియుండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచూ నీలపురంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయనా! ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంతమేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవలయుననే పిచ్చి ప్రయత్నములతో విలువయిన కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పొంచియున్నది. కావున సద్గతిని పొందు యోచనలను చేయుము. సర్వ సత్యములకును, సర్వ తత్త్వములకునూ మూలమైన దత్తుడను నేనే! మహా సిద్ధి పురుషులు, మహా యోగులు, మహా భక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రములో అవతరించితిని.

స్వామివారి ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వ వాసనలన్నియు నశించిపోయెను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయునూ శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. తదుపరి అతడు శ్రీవల్లభులవారిని, వారి స్వగృహమున దర్శనము చేసుకొని ధన్యుదాఎను. "శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించియున్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైనవారనియూ సంపూర్ణ యోగావతారులనియూ, నీలపురంగు కాంతి వారు అనంతప్రేమతోను కరుణ తోను నిండియున్నవారనియూ, యీ వర్ణములు వివరించుచున్నవని, " ఆ యోగి చెప్పెను.

ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చాతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా? లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను? ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను? ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా? లేక మరేదయినా విశేషమా? మేదాజనమనగా నేమి? ఇటువంటి చర్చ చాల వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకురారయిరి.

సత్య ఋషీశ్వరులని పేరు గాంచిన మల్లాది బాపన్నావధానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా యుండిరి. వారిని బాపనార్యులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరునూ సంతోషించిరి. శ్రీ బాపన్నావధానులు గారిని తమ గ్రామములో నివసించవలసినదని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి.యజ్ఞయాగములలో లభించు సంభావనలను మాత్రమె శ్రీ బాపనార్యులు తీసుకొనెడివారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించెడివారు కారు. శ్రీ వర్మగార్కి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి వుండెడిది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చెడిది. మిక్కిలి సాదు స్వభావము కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించుటలేదనియూ, ఎచ్చటనో తప్పిపోయినదనియూ శ్రీ వర్మగార్కి వర్తమానము అందినది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అగుటచే వర్మగారు వారిని ఏ విషయమై ప్రశ్నించిరి. ఆ గోవు శ్యామలాంబాపురమున (సామర్లకోట) ఖాన్ సాహెబ్ అను కసాయి వాని వద్ద ఉన్నదనియూ వెంటనే వెళ్లకపోయిన యెడల గాయత్రి వధించబడుననియూ బాపనార్యులు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించిరి. బాపనార్యుల వచనానుసారము గాయత్రి లభించునెడల వర్మగారిచ్చు 3 పుటల భూమిని, నివాసయోగ్యమయిన యింటిని బాపనార్యులు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకటస్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అపుడు వారికి గోహత్యాపాతకము చుట్టుకొనును. గోహత్యా పాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపురవాసుల అదృష్టము పండెను. శ్రీ బాపన్నావధానులు  గారు 3 పుట్ల భూమికి యజమానులయిరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగెను. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును, సుమతి యను బాలికయును కలరు. సుమతి జాతకము నందు సర్వవిధములయిన శుభ లక్షణములుండుట చేతను ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుటచేతను ఆమెకు సుమతీ మహారాణియని నామకరణము చేసెను. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్ఠలు ఆనతి కాలములోనే దశదిశల వ్యాపింపదొడగెను.

గోదావరీ మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి ఘండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీనరసింహ రాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంబసూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని యింట కాలాగ్నిశమన దత్తుడను విగ్రహము కలదు. పూజాసమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయూ, వానికి ఆదేశములిచ్చుటయూ జరుగుచుండును. చిన్నతనముననే అప్పలరాజుశర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజాసమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును, ఆపస్తంబ సూత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తనవద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక, తన యింటినందే భోజన సదుపాయమును ఏర్పాటుచేసెను. శ్రీ బాపనార్యులు శనిప్రదోష సమయమున శివారాధానము చేసెడివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములు చేసెడివారు. పూర్వకాలమున నందయశోదలు శనిప్రదోష సమయమున శివారాధానము చేసినందువలన సాక్షాత్తూ శ్రీ కృష్ణుని పెంచుకొను అదృష్టమునకు నోచుకొనియున్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును, మరికొందరు వైశ్య ప్రముఖులును శివారాధానమునందు పాల్గొనెడివారు.

(ఇంకా ఉంది..)  

No comments:

Post a Comment