Thursday, November 3, 2011

అధ్యాయము-4 భాగము-4

అధ్యాయము-4
శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం-భాగము 4  

శ్రీ పళనిస్వామి నా మనసులో భావనలను అవలీలగా అర్థము చేసుకొని "నీ మనసులోని భావనలను అవగతము చేసుకొంటిని. భవిష్యత్తునందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింప దలచితివి. శ్రీపాద శ్రీవల్లభులవారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని" పలికెను. అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగెను.

శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు, శ్రీపాదుల, శ్రీ దత్తాత్రేయుల, శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ఠ

శ్రీ పళనిస్వామి యిట్లనిరి. "నాయనా! మాధవా! నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహగృహము నీలోని సర్వ శక్తులనూ ఆకర్షింపబడిన స్థలము అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగా నున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్ఠలోనున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్టింపబడును. పాదుకలు ప్రతిష్టింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలము నందు శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైన శ్రీదత్తాత్రేయులు, వారి తదుపరి అవతారమైన శ్రీనృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్టింపబడును. ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును." అని తెలియజేసిరి.

అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరి. మా గుహకు దగ్గరలోనే యున్న నవయువకుని శవమును బైటికి తీసిన తరువాత ప్రణవమునుచ్చరించ సాగిరి. "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదెంచెను. శ్రీపళనిస్వామి నవయువకుని శవములో ప్రవేశించిరి. అంతట వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు వ్యాఘ్ర రూపములో నున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయెను.

నూతన శరీరములో ప్రవేశించిన పళనిస్వామి యిట్లు ఆజ్ఞాపించిరి. "మీరు తక్షణము యిచ్చట నుండి పోవలెను. నాయనా! మాధవా! నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మశరీరములో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు. యీ జన్మకు నీకు అది చాలును. నాయనా! శంకరా! నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవా! మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగును గాక!"

అంతట మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిమి. శ్రీచరణుల లీలలకు అంతెక్కడ!

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-4 సమాప్తం)   

No comments:

Post a Comment