అధ్యాయము-4
శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం- భాగము 2
శివశర్మ గాధ - శ్రీపాద శ్రీవల్లభుల చింతనా ఫలితము
ఈ కలియుగము నందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురువపురము గ్రామము చాలా చిన్నది అయిననూ, అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు, సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మయనునతడు తన భార్య అంబికతో కురువపురము లోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురువపురము నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతి రోజూ అతడు దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసికొని తిరిగి కురువపురం చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు. చాలా గొప్ప పండితుడు. అనుష్ఠానపరుడు. యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానము స్వల్ప కాలములోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక కుమారుడు మాత్రము నిలిచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడయ్యెను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శాల్యము కాజోచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముతో నిలుచుండెను. శ్రీస్వామి మందహాసముతో అతని మనసులోని దిగులును గమనించి యిట్లనెను. "శివశర్మా! యితర చింతలను మరచి నిరంతరమూ నన్నే ధ్యానించు వారికి నేను బానిసను. నీ అభీష్టము ఏమిటో తెలుపుమనెను." అందులకు శివశర్మ "స్వామీ! నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావలెనని అపేక్షించితిని. నా ఆశలన్నియును వమ్ము ఆయెను. నా కుమారుడు పరమశుంఠ అయ్యెను. ఘటనాఘటన సమర్థులగు మీకు వానిని పండితునిగాను, ప్రయోజకునిగాను చేయుట కష్ట సాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము." అనెను.
అందులకు శ్రీపాదులు, "నాయనా! ఎంతటి వారికైననూ పురాకృత కర్మఫలములు అనివార్యములు. సృష్టి అంతయునూ అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడచుచున్నది. స్త్రీలకూ పూజా ఫలముగా భర్త లభించును. దాన ఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడునూ సత్పాత్రదానము చేయవలెను. యోగ్యులు కాని వారాలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో, వాడు చేయు పుణ్య కార్యముల వలన కలుగు పుణ్యములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో, వాడు చేయు పాపకార్యముల వలన కలుగు పాపములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దానము చేయునపుడు అహంకార రహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమె అది సత్ఫలితముల నిచ్చును. పూర్వ జన్మ కర్మ విశేషముననే మండబుద్ధుడు నీకు కొడుకాఎను. మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్యునిమ్మని కోరిరి. పూర్ణాయిష్యునొసంగితిని. వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడయిన పండితునిగా చేయవలెనన్న కర్మసూత్రము ననుసరించి నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమయినా ఎడల నేను వానిని యోగ్యుడయిన పండితునిగా చేసెదనని" అనిరి. దానికి శివశర్మ "స్వామి! నేను వృద్ధావస్థలో ప్రవేశించితిని. నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు, వక్తా అయిన యెడల నాకు కావలసినది ఏమున్నది?" అనెను. అంతట ఘటనాఘటన సమర్థులైన శ్రీచరణులు, "సరే! నేను ఆనతికాలములోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో ధీశిలానగరమందు నింబ వృక్ష పాదమున నుండు భూగుహలో తపశ్చర్యలో కొంత కాలముండెదవు. ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠ దేశమున జన్మనొందెదవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమున తెలియనీయకుము." అని ఆజ్ఞాపించిరి.
శ్రీపాద శ్రీవల్లభుల భావిజన్మావిష్కరణ
ఆనతి కాలముననే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండెడిది. ఇరుగు పొరుగువారు చేయు పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడయిన ఆ బ్రాహ్మణబాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకొనదలచి నది వైపునకు పరుగెత్తసాగెను. నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకొనదలచి అతని వెంట పరుగెత్తసాగెను. పూర్వ జన్మ వశమున దారిలో శ్రీపాదులవారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నమూ నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేష జీవితమును గడుపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజాఫలమును గూర్చి వారికి విస్తారముగా తెలియజేసిరి. తరువాత జన్మమున అంబిక తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు గనుక తామే ఆమెకు మరు జన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి.
(ఇంకా ఉంది.. )
No comments:
Post a Comment