Thursday, November 3, 2011

అధ్యాయము-4 భాగము-1

అధ్యాయము- 4 

శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం-భాగము 1 

పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి యిట్లనెను. "నాయనా! మాధవా! వత్సా! శంకరా! మనము ముగ్గురము ధ్యానస్థుల మయ్యెదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకొందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ గనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవము లోనికి వచ్చును. భవిష్యత్తులో హూణశకము వ్యవహారము నందుండును. ఈ రోజు హూణశకము రీత్యా 25 -5 -1336 . ఈ రోజు శుక్రవారం. సర్వశుభ యోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈ రోజు మన జీవితములో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూలశరీరమును ఇచ్చటనే యుంచి స్థూల శరీరముతో కురువపురము పోయెదను. ఒకే పర్యాయము నాలుగయిదు చోట్ల ఒకే సమయములో సూక్ష్మరూపములో విహరించుట నాకు బాల క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మశరీరముతో కురువపురము లోని వారి సన్నిధానమునకు చేరెదను."

స్వామి అనుగ్రహ సౌలభ్యతా విధానము

పళనిస్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి "స్వామీ! మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్య మంగళ రూపమును దర్శించెను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధమున్నది. మరి నాకు వారి నామమే గాని రూపము తెలియదు గదా! నేను వారిని ధ్యానించుట ఎట్లు?" అని వారిని అడిగితిని. అందులకు పళనిస్వామి మందహాసముతో, "నాయనా! శ్రీపాదుల యందు భక్తీ కలిగి యుండినచో సర్వమూ సిద్ధించును. కూర్మము తన బిడ్డను విడిచి ఎంతదూరములో నున్నను తన ఆలోచనా తరంగములతో బిడ్డను కాపాడును. మార్జాలము తన కిశోరములను నోటితో కరచుకొని ఒక యింటి నుండి మరియొక యింటికి కొనిపోవును. కిశోరములకు ఎచ్చట సురక్షిత స్థానమనిపించునో అచ్చటనే వాని నుంచును. అట్లే తొలుదొల్త శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మకిశోర న్యాయమున పాలింతురు. కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిశోర న్యాయమున భక్తపాలనము చేయుదురు. తదుపరి మర్కట కిశోర న్యాయమున భక్తపాలనము జరుగును. ఇందు కిశోరమునకు తన తల్లిని ప్రయత్న పూర్వకముగా అంటిపెట్టుకొనవలసిన అవసరమున్నది. ఇంకనూ పరిణితి సాధించిన పిదప తల్లిచేప వెంటబడి స్వేచ్చగా పయనించు పిల్లచేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శనభాగ్యమిత్తురు. శ్రీవల్లభులు అతిముఖ్యమైన భవిష్యనిర్ణయము ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మరూపములో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు. ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షనముననే కురువపురము పోయెదను. అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరుగబోవుచున్నది. అది కనులార గాంచెడి మహత్తరమైన అవకాశమును శ్రీదత్త ప్రభువులు దయచేసిరి." అని పలికి వారు ధ్యానస్థులైరి. తదుపరి నేనునూ, మాధవుడునూ కూడా ధ్యానస్థులమైతిమి.

ఈ రకముగా ధ్యానము పది ఘడియల కాలము జరిగినది. అందరమునూ ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహోల్లాసముగా కనిపించిరి. నేనునూ, మాధవుడునూ శ్రీ స్వామి  వారిని తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ యీ విధముగా సెలవిచ్చిరి.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment