Monday, November 14, 2011

అధ్యాయము-6 భాగము-2

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 2 
శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి - సుమతిఅప్పలరాజుల వివాహము

ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధానము చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి "నాయనా! బాపనార్యా! నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతీ మహారాణిని అప్పలరాజు శర్మ కిచ్చి వివాహమోనరింపుము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్త ప్రభువుల వారి నిర్ణయము. ఈ మహా నిర్ణయమును మీరుటకు యీ చరాచర సృష్టి యందలి ఈ వ్యక్తికినీ అధికారము లేదు." అని పలికెను.

ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును అక్కడున్న అందరికిని కూడా వినిపించెను. అందరునూ ఆశ్చర్యచకితులయిరి.

అయినవిల్లి గ్రామము నందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును, బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయెను. రాజశర్మకు కనీసము గృహమయినా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియూ అందొకదానిని రాజశర్మకు యిచ్చెదననెను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపడాయెను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెల కట్టించెను. అది ఒక వరహాగా నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము పండ్రెండు వరహాలని నిర్ణయించబడెను. తక్కువగా నున్న పదకొండు వరహాల సొమ్ము యిచ్చుటకు తనవద్ద పైకములేదని రాజశర్మ చెప్పెను. అట్లయిన నేను నా గృహమును ఒక వరహాకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. "దానముగా తీసుకొనుట మీ కభ్యంతరకరమయిన యెడల ఒక వరహాను మాత్రము ఇచ్చి నా గృహమును తీసికొనుడు" అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పునది ధర్మ సమ్మతమేనని అందరునూ అంగీకరించిరి. శ్రీ సుమతీ మహారాణికిని, శ్రీ అప్పల లక్ష్మినరసింహ రాజశర్మకును మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవోపేతముగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీవల్లభుల అవతారము అజ్ఞానమనెడి అంధకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక, భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీదత్త ప్రభువులు కాలదేవతను, కర్మదేవతను శాసించిరి. వారి శాసనముననుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గ్రుడ్డిబాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటి తనమునకు ప్రతిగా కుంటిబాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ యిద్దరు బిడ్డలు యీ రకము వారయినందులకు సుమతీ, రాజశర్మలు ఎంతగానో ఖేదమునొందిరి. అయినవిల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయము కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకొని వచ్చిరి. సుమతీ, రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిరి. ఆ రోజు రాత్రి సుమతీ మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమయినది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములయిన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలయినవారు స్వప్నములో దర్శనమీయసాగిరి. మరికొన్ని రోజులయిన తదుపరి జాగ్రదవస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను. కండ్లు మూసినయెడల తెరమీద బొమ్మలవలె దివ్యవర్చస్సులతో, రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు, మొదలగువారు దర్శనమిచ్చుచుండిరి. 

ఈ విషయమై సుమతీ మహారాణి తన తండ్రియైన బాపనార్యుని సంప్రదించగా వారు, "ఇవన్నియును సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి." అనిరి. సుమతీ మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు "అమ్మా! సుమతీ! రవి యొక్క జన్మనక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకును సంబంధము కలదు. చంద్రుని జన్మనక్షత్రమైన కృత్తికానక్షత్రమునకును శ్రీకృష్ణావతారమునకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికిని శ్రీలక్ష్మీనరసింహావతారమునకును సంబంధము కలదు. శ్రవణం నక్షత్రములో జన్మించిన బుధునకును, బుద్ధావతారమునకును సంబంధము కలదు. పూర్వఫల్గునీ నక్షత్రములో జన్మించిన గురుడునకును, విష్ణ్వుంశకును సంబంధము కలదు. పుష్యమీ నక్షత్రములో జన్మించిన శుక్రునకును భార్గావరామునికిని సంబంధము కలదు. రేవతీ నక్షత్రములో జన్మించిన శనికిని, కూర్మావతారమునకును సంబంధము కలదు. భరణీ నక్షత్రములో జన్మించిన రాహువునకును, వరాహావతారమునకు సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రములో జన్మించిన కేతువునకును, మత్స్యావతారమునకును సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యమునకు సంబంధించిన సమయము. అందువలన కోటానుకోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితి, గతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగా నున్నది." అని అనిరి.

(ఇంకా ఉంది...)           

No comments:

Post a Comment