Thursday, November 3, 2011

అధ్యాయము-4 భాగము-3

అధ్యాయము-4
శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం-భాగము 3
నృసింహ సరస్వతి జన్మసంకల్పము

సమస్త కల్యాణగుణములకు నిలయమైన ఓ వాసవాంబికా! "నీ సంకల్పమే నెరవేరు గాక! నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా యీ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము యీ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే యుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మము నుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది, ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను. తదుపరి కదళీవనము నందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోను, సిద్దపురుషుల రూపములతోను అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను, మహిమలను చేయుచూ లోకులను ధర్మకర్మానురక్తులుగా చేసెదను." అని అనిరి.

యుగములు మారుకొలది మానవులు అల్ప శక్తివంతులగుచుందురు. అందుచేత పరతత్త్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారియై అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్త్వము క్రింది స్థాయిలలోనికి దిగి వచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమున శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగము నందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్త ప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో, శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలయిన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యమేర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నియునూ శ్రీపాద ప్రభువుల చైతన్యము లోనికి ప్రవేశించి, వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును.

శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీస్నానములో పోగొట్టెదరు లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసివేసెదరు. తాము స్వయముగా తపమాచరించి, ఆ తపః ఫలమును తమ ఆశ్రితులకు ధారపోసేదరు. తాము అవసరమని భావించిన యెడల జడస్వరూపమైన కర్మతత్త్వమును శాసించి తమ శ్రీ చరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్రరూపమున చేయుదురు. కావున, వారి పాదుకలను ఆశ్రయించినవారు, తమకు తెలియకుండగనే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు.

శ్రీ పళనిస్వామి యీ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబుచ్చుతూ యీ విధముగా ప్రశ్నించ సాహసిన్చితిని. "స్వామి! ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురుసార్వభౌములు ఏ విధముగా పారద్రోలెదరో తెలుప ప్రార్థన."

"నాయనా! శంకరా! ఖగోళము నందలి గ్రహములు జీవుల యెడ మిత్రత్వ శత్రుత్వములను కలిగియుండవు. మానవుడు జన్మించినపుడు వాని ప్రారబ్దకర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనియించి, ఆయా గ్రహాచారముననుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించునవి అయినప్పుడు, వాటి దోషనివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించానపుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనపుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి, చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను, అశుభములను ఒసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవ శరీరము నందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహబాధలు సంభవించునపుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వచైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించునపుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనలవలన కలుగు ఆకర్షణ వికర్షణలలో తేడాలు కలుగును. ఇంత దనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధు వియోగము, కుటుంబము నందలి సభ్యులలో వివాదములు, ఆకర్షణశక్తి తగ్గుట మొదలయిన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వ శక్తులవలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పని చేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రముననుసరించి ఫలితముల నిచ్చుచుండును. మానవులు దైవ భక్తీ కలిగి జప తపములు చేసిన యెడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తపఃఫలితమును ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్ట దాయకములగు స్పందనలు మనుష్యుని తరువాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడనుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్ప మాత్రము పుణ్య కార్యమును చేసిననూ విశేష శుభ ఫలితము నిచ్చుటను అనుగ్రహమని అందురు. నాయనా! క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి, స్థితి, లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులోభవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదమున నున్న భూగృహములోని నాలుగు నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశ్యములు దృష్టిలో నుంచుకొని నీకీ అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహాత్తరమైనవి. నిగూఢ ప్రయోజనము కలిగినవి. అంతే కాకుండా ఇతరులకు చెప్పకూడనివి. దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి యిచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలగును. వారికి వారే ప్రమాణము. వారికి వారే సాటి. విశ్వ నియంత యొక్క విభూతులు, యోగసిద్ధులు అమెయములు. పరిమాణములకును, కొలతలకును పరిమితులకును అందని విషయము."

శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనందకందళితమైనది. నేను ఉడుపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు కురువపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములయిన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములనన్నిటిని గ్రంథస్థము చేయవలెననియు, శ్రీగురు సార్వభౌముల అనుమతిని పొందవలెననియు, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీచరణులను యీ విషయమై అభ్యర్థించవలెననియు అనుకొంటిని.

(ఇంకా ఉంది..)       

No comments:

Post a Comment