Saturday, November 12, 2011

అధ్యాయము-5 భాగము-3

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 3  
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

ఆ రోజుననే మాలజంగమొకడు అచ్చటకు వచ్చెను. జంగమదేవర వేషమున నున్న అతని వద్ద తాళపత్ర గ్రంధములుండెను. ఆ వాడలోని జనులన్దరకూ అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యెను. తనను కలసిన వారందరికినీ అతడు భూత భవిష్య ద్వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్ద నున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంతములనియూ, దానిని రమలశాస్త్రమని అందురనియూ దానిలోని విషయములు తూ.చ. తప్పకుండా జరగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్దన మేరకు అతడు వారి యింటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనేను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంధముల నుండి ఒక పత్రమును తీసి యిట్లు చదివెను. "ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను యితడు లిఖించును. పూర్వజన్మమున యితడును, మరియొకడును కందుకూరు అను పట్టణమునకు ఆనతి దూరమునందున్న మొగలిచెర్ల అను గ్రామము నందు జనిన్చిరి. ద్యూతక్రీద యందు విశేష అనురక్తులయిరి. ఆ గ్రామము నందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయమున్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయములందు యతడు పూజాదికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగానమునండు తన మిత్రునితో కలిసి యితడు ద్యూతక్రీడలో నిమగ్నుడయి ఉండెడివాడు. ఇది ఎంతయో అపచారమయిన విషయము. తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమయిన నిబంధనలతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన యెడల యితడు ద్యూతము నందు ఒడ్డిన ధనమీయవలెను. తాను జూదమునందు నెగ్గిన యెడల తన మిత్రుని భార్యను యితనికి ధారాదత్తము చేయవలయును. దీనికి సాక్షిగా యీ దత్తప్రభువే! అని ప్రమాణములు చేసికొని జూదమాడిరి.

తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జూదమునందు శంకరభట్టు విజయమొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను యితనికి ధారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగవు పెద్దమనుష్యుల వరకు వెళ్ళెను. కులపెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో యింతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియూ, పరస్త్రీయందు మరులుగలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన యితనికి నెత్తిమీద వేడి వేడి నూనెను పోయవలెననియూ, జూదమున తన భార్యనొడ్డిన యితని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగఛ్చేదనము చేయవలెననియూ, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలెననియూ తీర్మానించి, వారి తీర్మానమును అమలుపరచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుటవలన యీ జన్మనందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రము నందు జన్మించి మనస్చాన్చాల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి యీ రామలశాస్త్రము వినిన మరుసటిరోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును.

శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7 1 /2 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను, అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కతినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంతభాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమె చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపురదేశము నందున్న అక్షయకుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును."

శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగానుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జననీజనకుల నుండి శలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామమును చేరితిని.

కాణిపాకం గ్రామము చిత్తూరునకు ఆనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంటేశ్వరస్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములును కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసికొని బైటకు వచ్చితిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి యుండెను. నాకు భయమువేసి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి తిరిగి వేదలితిని. కొంతసేపు దైవధ్యానము చేసుకొని బైటకు వచ్చితిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిణామము గల మరియొక కుక్క యుండెను. ఈ రోజున యీ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చితిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి "అయ్యా! మీరు మాటిమాటికీ బయటకు పోవుచూ, లోనికి వచ్చుచున్నారు. కారణమేమిటి ?" అని అడిగెను. నేను నా భయమును గూర్చి చెప్పితిని. అంతట పూజారి, "అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్దనుండు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామదేయమున శ్రీ దత్తులవారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయిననూ, అతడు మాత్రమూ యీ ఆలయము లోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి యిచ్చెదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు రెండు కుక్కలను చూచితినని చెప్పితివి. మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును యిచ్చెదను. మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూచెదము." అనెను. మేము బయటకు వచ్చునప్పటికి అచ్చట నాలుగు కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వాటికి యిచ్చెను. ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగువైపులా చుట్టుముట్టినవి. పూజారి "ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకునియొద్దకు పొమ్ము. నీకు శుభమగును." అని పలికెను.

నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలిసికొంటిని. సుబ్బయ్య యింటివద్ద జరిగిన సంఘటనలననుసరించి మతభేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున ఛండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. బ్రాహ్మణుడు ఛండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటకట్టుకొని జన్మజన్మాంతరముల వరకు కర్మప్రవాహమున పడిపోవుచుండునని తెలిసికొంటిని.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment