Sunday, November 13, 2011

అధ్యాయము-5 భాగము-5

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 5 
కాణీపుర వినాయకుని మహిమ

"నాయనా! వారు ముగ్గురునూ యీ కాణిపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించిననూ, త్రిమూర్త్యాత్మకుడయిన దత్తుని దూషించిననూ లెక్కకు మిక్కుటమయిన అనర్థములు దాపురించును. సోదరులయిన యీ ముగ్గురును ఒక "కాణి" భూమిని యీ గ్రామమునందే సాగుచేసికొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడుబావి కలదు. దీనినుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనెడివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకానొక రోజున నీరంతయూ ఖర్చుకాగా, పారతో యిసుకను తోడు ప్రయత్నములోనుండిరి. ఆ నీటి అడుగుననున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శవలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గ్రుద్దితనము పోయినది. ఆ రాయి స్వయంభూవినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తలమీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది.

ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్యఋషీశ్వరులైన బాపన్నావధానులును, వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో "మహాభూమి నుండి ఈ లోకములోనికి వచ్చినాను. పృథ్వీ తత్త్వములో అవతరించితిని. ఈ తత్త్వము కాలచక్రమున అనేక మార్పులను చెందును. జల తత్త్వములోను, అగ్ని తత్త్వములోను, వాయుతత్త్వములోను, ఆకాశ తత్త్వములోను, నా అవతరణ యిదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరోనరించిన మహాయజ్ఞములోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్య మండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణము నందును, కాశీయండును, బదరీ యందును, కేదారము నందును కూడా ఏక కాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధరా! మీ యింటిపేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులయిన మీ వంశస్థులు ఇకనుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరు గాక!" అనెను.

రాజకుడైన తిరుమలదాసు శంకరభట్టు తో "నాయనా! శంకరా! మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును, శ్రీధరావధానులును పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నియూ సవిస్తారముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగ పిల్లవాడు కలదు. అతడు రావిదాసు అను పేరిట కురువపురం గ్రామమునందే నివసించుచు, అచట శ్రీపాదులవారికి యధోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురములోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తి ననుసరించి జీవించుచున్నాను.

నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలిసికొందువు. వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి  అనువానిని కలుసుకొనిన యెడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తమున్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధమున్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానేరావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ." అని తెలిపెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-5 సమాప్తం)     

No comments:

Post a Comment