Monday, November 21, 2011

అధ్యాయము-6 భాగము-8

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 8 

పీఠికాపురము నందలి జనులు యీ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావదాన్లు యింట చేయబడిన గారెలలో విషము పొరబాటున చేరినదనియూ, భోక్తల అదృష్టము వలన వారు రక్షించ బడిరనియూ, అయితే గోవు మాత్రము విష ప్రభావమున మరణించెననియూ, నరసావదానులకు గోహత్యా పాతకము కూడా చుట్టుకొనుననియూ వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వ్యాఖ్యలు నరసావదానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణము చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలా మంది భావించసాగిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యములో ప్రవేశముండుట వలన నరసావధానులు కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసావధానులు యింటికి పోవునపుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడయిననూ నరసావధానులు ఆరోగ్యము కుదుట పడలేదు సరిగదా మరింత క్షీణించెను. ఒక రోజున నరసావధానులు మరణించెను. 

పీఠికాపురములో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమును సత్యముగాను, సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగానుండెడివి. రాజశర్మ సదుద్దేశ్యముతో వైద్యము చేసెను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు గదా! నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించెనని కొందరు తలపోసిరి. మరి కొందరు నరసావధానులు వారియండున్న ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరి అయిన వైద్యము చేయలేదనియూ, మరియొక వైద్యునిచే వైద్యము చేయించిన బ్రతికి యుండెడి వాడనియూ తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియూ, ప్రతీరోజూ శ్రీవల్లభులు నరసావధానుల యింటికి వెళ్ళుచున్ననూ వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడే అనియూ భావించిరి. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్యా మహాపాతకము వలన మరణించెననియూ, ఆ యింటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి యుండుననియూ, గోహత్యా పాతక నివారనమునకు బ్రాహ్మణులకు భూరి దానధర్మములను చేయించవలెననియూ, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమీయవలెననియూ, ఒక మండలము మహా శాంతి హోమములు జరిపి ప్రతిరోజూ ఆ మండల కాలమంతయునూ బ్రాహ్మణ సమారాధానము చేయవలెననియూ తీర్మానించిరి. పైన చెప్పిన కార్యక్రమములను జరిపించుటకు నరసావధానుల యావదాస్థిని తెగనమ్మవలసివచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతము వంటి విషయము.

నరసావధానుల శవమును దహన క్రియల కొరకు శ్మశానమునకు కొంపోవసాగిరి. రాజశర్మ శ్రీపాదులు, బాపనార్యులు అందరునూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకొని, "నాయనా! చిటికెడు పసుపుకుంకుమల కోసం ఎంత దూరమయిననూ పేరంటమునకు వెళ్ళెడి దానను. నీవు దత్తుడవే అయినచో, మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా?" అని విలపించెను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్య హస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయెను. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనిరి. నరసావధానుల పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నములో నుండెను. శ్రీపాదుల వారి కండ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలెను. మేఘ గర్జన స్వరముతో శ్రీపాదులు యిట్లనిరి. "ఆహా! చచ్చిన తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూచితిని గాని బ్రతికియున్న తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూడలేదు." అంతట అందరునూ నిశ్చేష్టులయి చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపై నున్న నరసావధానుల భ్రూమధ్యమును తన బొటన వ్రేలితో తాకి తిరిగి తమ భ్రూ మధ్యమును తాకిరి. నరసావధానులుకు చైతన్యము రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసివచ్చిన  వారందరితోటి నరసావధానులు శోభాయాత్రగా యింటికి తిరిగివచ్చెను. శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మంశము అవగతము కాసాగెను. తన యింటనున్న గొడ్డుఆవు తన తల్లియని వారికి బోధపడెను. తన యింట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రియని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున యీ రకమైన హీనజన్మ నొంది తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థ లో నున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసినందని ప్రార్థించినట్లును మరు జన్మములో గొడ్డు ఆవుగా జన్మించినపుడు నీ క్షీరము గ్రోలెదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయెను. తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొలది కాలములోనే మరణించు నట్లును, మరు జన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషమున నున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును, సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించ సాగెను. తను కూడా మరుజన్మమున సన్యాసి వేషముననున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహించాబడి విశేష ఐశ్వర్యముతో కూడియున్నట్లును, తన యింట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి, తన స్వహస్తాములతో తోటకూరను పీకిపారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదిన్చినట్లును అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను.

శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు.

శ్రీవల్లభుల వారు నరసావదానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును, వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసెదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేయుచూ కొంతసేపు భజన కార్యక్రమములలో గడిపేదము గాక. వారి నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము.

తిరుమలదాసు వంటి సద్భాక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమందానందముతో పరవశించితిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-6 సమాప్తం)      
    

No comments:

Post a Comment