Saturday, November 12, 2011

అధ్యాయము-5 భాగము-2

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 2 
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీ చరణుల నామస్మరణము చేయుకొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రము కోళ్ళను, మేకలను బలి సమర్పించి, చిత్రవిచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యము తో కూడిన ఆహారము యీయబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యము పట్టినది గనుక శాకాహారము యీయవలసినదని మాంత్రికుడు తీర్మానించెను. నాచేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమోయని ఎంతయో కలత చెందితిని, కాని శ్రీపాదుల వారి అనుగ్రహము వలన నాకు శాకాహారము యియ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. మూడు రోజులు నేను తీవ్రమయిన నరకబాధను అనుభవించితిని. అంతటి నరకబాధలోనూ నేను శ్రీ చరణుల స్మరణ మానకపోవుట వలన నాలుగవరోజు నుండి బాధ అనుభావములోనికి వచ్చుట మానివేసెను. శరీరముపై చిత్రవిచిత్రమైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడా తో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభా! శరణు! శరణు! అని బాధతో విలవిలలాడిపోయితిని. శ్రీదత్త ప్రభువును అనన్య భక్తితో సేవించువారికి నరకబాధలెట్లుండును. అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను, నాకు యిసుమంతయైనాను బాధ కలుగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిలలాడి పోయెను. అతడు నన్ను కొట్టినపుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీ చరణుల దివ్యలీలను గమనించి నవ్వుకొంటిని. నేను పథ్యాహారము తినుచుండిననూ అది నాకు చాల మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు, మేకలు భుజించుచున్ననూ అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోజ్గ్యము క్షీనించు చుండెను. అంతట అతడు నన్ను బాధించుట మాని కేవలము మంత్రములు, పూజలు మొదలయిన వానితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన అయిదవరోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ యింటిలో నిప్పు రాజేయకపోయిననూ, ఇంట్లో అందరునూ చూచుచుండగనే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యెను. ఆరవరోజున అతడు బిక్కమొహముతో సుబ్బయ్య యింటికి వచ్చి, సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణదెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుటవలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన యింటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించెననియూ, భేతాళుడు మొదలయిన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలెననియు, దానికి విశేషమైన ధనము కావలెననియూ సూచించెను. వైద్యము చేయుటవలన ఫలితము ఏమీ లేదనియూ, మాంత్రికుడు ధనాశతో యీ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియును. అందుచేత విధివిధానమునకు తల ఒగ్గి, సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించవలసి వచ్చిన యెడల అంతకంటె దురదృష్టము, నమ్మకద్రోహము మరియొకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితముతో యింత క్రూరముగా ఎందుకు ఆడుకోనుచున్నదో తెలియక నా గుండెలో రంపపుకోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో యిట్లంటిని. "జననీ జనకులారా! మీరు ఉన్న చర స్థిరాస్తులన్నింటినీ విక్రయించి యీ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నానని" పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపదిరి. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృసమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతుని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రిపాడులను ప్రార్థించుకొంటిని.

నాకు వైద్యము ప్రారంభమైన ఏడవదినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి యిట్లంటిని. "నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా?" అందులకు ఆమె "నాకు రెండు సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనునది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచినా మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండజాలడు. మీరు యిన్ని బాధలు పడుచున్ననూ నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనయినా లేదు.ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమయిన అభిప్రాయమునూ లేదు. కులాచారము ననుసరించి ధర్మముగా జీవించ దలచితిని. మీరు నా భార్తయీ అయినచో యీ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున, నా భర్త పలాయనమాయి 20 సంవత్సరములు అయిన కారణముననూ, అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతనూ, నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడచుకొందును. మీరు సదా స్మరణము చేసుకోను శ్రీపాదవల్లభులు ఎవ్వరు? వారు సద్గురువులయిన యెడల యీ విషమ సమస్యకు ధర్మ సమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను." అనెను.

ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతట నేను యిట్లంటిని. "శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయులవారు. ఈ కలియుగములో అవతరించినవారు. ప్రస్తుతము కురువపురము నందున్నారు. మన భావముననుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని ఋజువుచేయుదురు. మంచిది. నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోద యోగ్యమయిన పరిష్కారము లభించగలదు."

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment