Friday, November 25, 2011

అధ్యాయము 7 భాగము 3

అధ్యాయము 7
ఖగోళముల వర్ణనము - భాగము 3
శ్రీపాదుల వారు భక్తులకు యిచ్చు అభయము

నా విషయమునకే వచ్చినచో, పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు యీయలేకపోతివి. నన్ను భుజింపచేసిన యెడల లక్షమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి యుండెడిది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మమూ, ఏది అధర్మము అనునది చర్చనీయాంశమైనపుడు శాస్త్రము నాశ్రయించవలసినదే! అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా? లేదా? అను మీమాంస వచ్చినపుడు నిర్మలాంతః కరుణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకొన్నను ధర్మదేవత వారిని చెడు మార్గము లోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీ కృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమైనదని, కౌరవపాండవ సంగ్రామము ధర్మ యుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతి గాంచినది కదా! యజ్ఞము పుణ్య ఫలప్రదమే! కాని, పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేక తల అమర్చ బడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అనువాటితో వైద్యము చేయును. శరీరభాగము కుళ్ళినపుడు కత్తిపుచ్చుకుని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే! నాలో దేవతల అంశలే కాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచాముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల యెడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉందును. సర్వశ్య శరణాగతి చెందినా భక్తులను నేను చేయి విడువను. దూరతీరముల నున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్యపరాశక్తి కన్యకాపరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యమునులు లేరా ? బ్రహ్మ, క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్ఠలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే! ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతః కరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నమవవలెను. నీ మనస్సు శాక జ్ఞానమందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనునది అంగట్లో దొరికే వస్తువనుకొంతివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున ఛండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున ఛండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మపదార్థము కులమతములకు, దేశకాలములకు అతీతమను రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పని చేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచూ భక్తుల యోగక్షేమములు విచారించుచూ, వారిని అనుగ్రహించునపుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికీ, ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి, వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునూ నా వద్ద యున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత యివ్వవలసినది లెక్క చూసుకొనునపుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను, కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖ శాంతులను కలుగజేయుట వలన సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునపుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది.

ప్రశ్న : శ్రీపాదా! క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్త ప్రభువువే! సర్వజీవులకు ఆశ్రయము నీవే! అసలు యీ సృష్టి ఏ విధముగా ఏర్పదినదో తెలియజేసి నన్ను కృతార్ధుడిని  చేయవలసినది.

లోకాలోక వర్ణన

ఉత్తరం : తాతా! స్వర్గము నందు 88 వేల మంది గృహస్థమునులు కలరు. వారు పునరావృత్తి ధర్మమూ కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజ భూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తము గా ఉండెను. పరమాత్మ తేజమువలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తెజోమహిమచే ప్రకాశింప జేసినందున హిరణ్యగర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని, అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాఠక చాయనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాఠక చయనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్తానమను యుక్త స్థానమున్నది. త్రిఖండ సోపానములో వసురుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనునది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియూ మూలప్రకృతి స్థానమనియూ పేరుగాంచిన శ్రీనగరము ఆపైన నున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును, ఆపైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనునది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురము నందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురము నందు సనకసనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములోజ్యోతిష్మతీ పురము నందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీ పురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రధంతర పురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలదు. తాతా! భూలోకమందు రెండు భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది గాక మహాభూమి అనునది మరియొకటి కలదు. ఇది భూగోళమునాకు అయిదు కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగా నున్నది. మర్త్యలోకమనగా భూలోక, భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే యున్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములనునవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు.

మనము నివసించెడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనునది మధ్య భాగము నందు మిర్రుగా నుండి చక్రాకారముగా నున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్య చంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురూ ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములును, సప్తద్వీపములును కలవు. జమ్బూద్వీపమనునది దీనియందే కలదు. భూలోకము, భువర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకము నందు మహాభూమి అనియు, భూగోళమనియు రెండు విధములు కలవు.

(ఇంకా ఉంది..)  

No comments:

Post a Comment