Tuesday, November 1, 2011

అధ్యాయము-3 భాగము-5

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం-భాగము 5 

నాయనా! శంకరా! నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. ఆర్తులైన మానవులు ఎవరయినా వచ్చిన యెడల తపస్సమాధికి భంగము కలుగకుండ నీవును, మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరయినా వచ్చిన యెడల స్వామి యోగసమాధిలో ఉన్దేననియు, అందుచేత శాస్త్రప్రకారము చనిపోయినవారి శరీరమును నదీ ప్రవాహములో విడిచివేయుట గాని, లేదా పూడ్చి పెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుదు." అని వచించెను.

శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చుని తపస్సమాదిలోనికి పోయెను. నేనును, మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినపుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బతి మట్టను తెచ్చి వంట ప్రారంభించెదనని పలికెను. నేను వల్లెయుంటిని. మాధవునితో మరియొకడు బయలుదేరెను. విధి వైపరీత్యము! మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవునంతలో కొబ్బరి మట్ట చాటున నున్న త్రాచు పాము మాధవుని కరచెను. ముగ్గురు మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకొని వచ్చిరి.

శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుని నేను పాతిపెట్టితిని. ఖనన సందర్భములో నాకు అచ్చట నున్న భక్త జనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తీ, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కకావికలమయ్యెను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంతిని. ఈ దుస్సంఘటన తరువాత మరియొక దుస్సంఘటన చూచితిని. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధీకులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించెను. శ్రీస్వామి యోగసమాధిలో నున్నారనియు, వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు, యితని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించెననియు, శ్రీస్వామి వారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడ జరిగెననియు తెలిపిరి. వారు విషణ్ణవదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరివిధములుగా నిందించుకొనుచూ ఆ నవయువకుని ఖననము చేసిరి.

ప్రతీరోజూ ముగ్గురో నలుగురో స్వామివారి దర్శనమునకు వచ్చేదివారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకొని వెళ్ళిపోయెడివారు. ఈ విధముగా పదిరోజులు గడచిపోయెను. పదకొండవ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యము రాసాగెను. బ్రాహ్మీముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై "మాధవా!" అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచూ జరిగినదంతయూ వివరించితిని.

అప్పుడు స్వామి నన్ను ఓదార్చి, యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలుగ సాగెను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యెను. "నాయనా! మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము యీ పదిరోజులనుండి కురువపురములో నున్న శ్రీ చరనుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమయినను వాని కోర్కె తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాల కర్మ కారణ రహస్యములు ఎవ్వరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదులవారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నేరవేర్పవలెను." అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను.

నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యెను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటె నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బైటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి ఇద్దరు ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణదిక్కుగా నున్న తాటిచెట్ల గుంపు వద్దకు పోయి, "మాధవుని కరచిన ఓ నాగరాజమా! శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీపళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది." అని చెప్పమన్న మేము ఆ విధముగనే చేసితిమి.

శ్రీ పళని స్వామి తన కౌపీనము నుండి నాలుగు చిన్ని గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క నాలుగు దిక్కులా వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచూ ఆకాశములోనికి నాలుగు దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూచితిమి. అది ఉత్తరదిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క నాలుగు చిన్ని గవ్వలు దాని పాడగా మీద గ్రుచ్చినట్లుగా అంటుకొనిపోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము పళనిస్వామి పాదములను ముద్దుపెట్టుకొని, శ్రీ స్వామికి ముమ్మారు ప్రక్షినము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను.

(ఇంకా ఉంది..)       

    

No comments:

Post a Comment