Sunday, November 13, 2011

అధ్యాయము-5 భాగము-4


అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 4 

శంకరభట్టుకు తిరుమలదాసుకు జరిగిన సంవాదము

పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించు చోటుకు వెళ్ళితిని. తిరుమలదాసు అను పేరుగల ఆ రజకుడు 70 సంవత్సరముల వయస్సుగల వృద్ధుడు. అతడు తన గుడిశె నుండి బయటకు వచ్చి, ఆదరముగా నన్నొక మంచముపై కూర్చొండబెట్టెను. బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాల భాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరయిననూ నాకు చాల ఆత్మీయులుగా కనిపించాసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమలదాసు నాకు యిచ్చెను. దానిని నేను శ్రీపాదవల్లభుల ప్రసాదముగా భావించి స్వీకరించితిని. తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను.

అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట

"అయ్యా! ఈ రోజు ఎంతయో సుకృతము! నాకు మీ దర్శనభాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీతికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయనా! శంకరభట్టు! వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు యీ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురము నందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను. పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుత గమనించి దానిని జాగ్రత్తపెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసానకాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణములు విడుచుట చేత నేను రజక జన్మము నొందితిని. జన్మావసానమున ఏ సంకల్పముతో ప్రాణము విడువబడునో, తదనుగుణమైన మరు జన్మము లభించును. నా పూర్వ పుణ్య వశమున గర్తపురీ (గుంటూరు) మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయెను. ఆ గ్రామము నందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. బావబావమరుదులు యిద్దరునూ మహా పండితులే. గోదావరీ మండలాంతర్గతమైన "అయినవిల్లి" అను గ్రామములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు యిద్దరునూ వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొన వలెననియూ, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమీయ వలెననియూ, కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు యిద్దరునూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచ గలమనియూ, వేదోక్తముగా సమస్తమునూ జరిపిన్చాగాలమనియూ ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, ఆనతి కాలములోనే వారు గణేశచతుర్థినాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదరని ఆనతిచ్చిరి. యజ్ఞమునకు హాజరయిన వారందరునూ ఆశ్చర్యచకితులయిరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనిపిన్చినదంతయునూ ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. అట్లయిన మరియొక పర్యాయము నిదర్శనమీయవలయును, అని వాడిన్చిరి.

కాణీపుర వినాయకుని మహిమ 

అప్పుడు హోమగుండము నందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహా గణపతి రూపము "మూర్ఖులారా! త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడునూ, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియునూ, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియునూ, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియునూ, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువునూ, సమస్త సిద్ధులూ సిద్ధించుటకు సిద్ధ మునులునూ, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మథుడునూ, యిదే విధముగా సమస్త దేవతలునూ, నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీశక్తులు, రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్తయే. విష్ణురూపములో బ్రహ్మరుద్రులు విలీనమయిన అది దత్తరూపము. ధర్మశాస్త రూపములో గణపతి, షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడును త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి యున్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశ చతుర్థి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్యతత్త్వము వలన వారిది కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త తత్త్వము వలన వారిది సమస్త ధర్మ కర్మలకు ఆదియునూ, మూలమునూ అని గమనించుడు. రాబోవు వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు. జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును.

ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియూ అసత్యము పలికినండులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసందులయిన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురునూ అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు." అని పలికెను."

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment