Wednesday, November 2, 2011

అధ్యాయము-3 భాగము-6

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 6 


దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము 

శ్రీ పళనిస్వామి యీ విధముగా సెలవిచ్చిరి. "ఈ పాము గత జన్మము నందు స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యెను. ఆమె కొంత పాపమును, కొంత పుణ్యమును చేసి యుండెను. ఒక పర్యాయము దత్త భక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసంనమగు తత్త్వము గలవాడు. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మమునకు పోయెను. యమధర్మరాజు యీమెనిట్లు ప్రశ్నించెను. "నీవు కొంత పాపమును, కొంత పుణ్యమును చేసుకొని యుంటివి. దత్త భక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహా ఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవ లోకములో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదియూ, నీకు మహాపుణ్యము కలుగునట్లును, స్వల్పపాపము కలుగునట్లునూ మమ్ములను వారు ఆజ్ఞాపించిరి.. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలుదొల్తగా పాపమును అనుభవించెదవా? లేక పుణ్యమును అనుభవించెదవా?" దానికి ఆమె స్వల్ప పాపఫలమును అనుభవించి, ఆ తదుపరి పుణ్య ఫలమును అనుభవించెదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము యితరులకు హాని చేయునది అగుటవలన తనదారికి అడ్డము వచ్చిన వారినందరనూ కరచుచుండెడిది. అందువలన దానికి మరింత పాపఫలము తోడగుచున్నది. నాయనా! సర్పములలో నాలుగు జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికి హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన యెడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురయిన యెడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరునూ తనకు అపకారము చేయకపోయిననూ, నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధస్త్రీ రజోగుణ పూరితురాలు గనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటు వేసెను. ఆమె పూర్వపుణ్య వశమున మాధవుని కాటి వేసినది. మాధవుడు పూర్వ జన్మములోని పాప వశమున విగతజీవుడయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగ జన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండును. నాగదోశము వలన సంతాన నష్టము కలుగును."

యోగ్యులకు అన్నదానఫలము

"శ్రీ దత్తుడు అల్పసంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికయినా అన్నము పెట్టినచో, అన్నగ్రహీత యోగ్యుడయిన యెడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్నసారములోని కొంతభాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళ ప్రదమైన స్పందనలతో నిండును. దానివలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి గలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ, సూక్ష్మ నియమముతోనూ పరిపాలించబడుచుండును." అని పళనీస్వామి సెలవిచ్చిరి.

శ్రీపాదుల మహిమ 

శ్రీవల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీ ప్రదమైనది! వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము! శ్రీ చరణుల అనుగ్రహ విశేషమున పదిరోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కుచెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును కరుణను దివ్యలీలను ఏమని వర్ణించగలము?

మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనీస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా వంద సంవత్సరముల క్రితముది. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమునిచ్చెను. మరికొంతసేపటికి జలమునిచ్చెను.

నాగలోక వర్ణన

మాధవుడు పునరుజ్జీవితుడయ్యెను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు యిట్లు చెప్పసాగెను. "నేను సూక్ష్మ శరీరములో కురువపురము చేరుకొంటిని. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు. విశాల నేత్రములు కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయముగా జీవుల యెడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహధారిని కాకపోవుట వలన అచ్చట స్థూల దేహధారులయిన భక్తులకు కనుపించనైతిని. శ్రీవల్లభులు కురువపురములోని ఆ దీవి మధ్య భాగమునకు పొమ్మని అజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణము చేసికోనుచూ ఆ దీవి ఒక్క మధ్య భాగము నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రాసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకొంటిని. స్థూలముగా చూచువారికి అచ్చట స్థూలరూప పదార్థము మాత్రమే గోచరించును. నావలె సూక్ష్మ శరీరములో పోవువారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపధారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగినవారు. వారు సాధారనముగా నాగరూపములోనే సంచరించుటకు యిష్టపడువారు. అచ్చట నేను అనేక మహా సర్పములను చూచితిని. కొన్ని సర్పములకు వేలకువేలు పడగలున్నవి. పడగలయందు మణులున్నవి. వాటినుండి కాంతిప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగముద్రలో నున్నట్లు పడగలను విప్పి మోవ్నముద్రలో నున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకువేలు పడగలుండెను. ఆ మహా సర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీమహావిష్ణువు వలె పవలించియున్దిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము యీ విధముగా చెప్పసాగెను.

(ఇంకా ఉంది..)   

No comments:

Post a Comment