Wednesday, November 2, 2011

అధ్యాయము-3 భాగము-7

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 7 

శ్రీ దత్తాత్రేయ మహామహిమ 

(మాధవుడు నాగలోకము గూర్చి చెప్పుచూ) నా  ప్రక్కనున్న ఒక మహాసర్పము యీ విధముగా చెప్పసాగెను.

"శ్రీ దత్త ప్రభువులు నేపాళ దేశము నందు గల చిత్రకూటములో 'అనసూయా పర్వతముపై' అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మరూపం లో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరగిరి శిఖరమున, సహ్యాద్రి యందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా, వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందేదారు. సహ్యాద్రి యందు వారు యోగనిష్టులయిరి. వారు నాథ సంప్రదాయనులైన గోరక్షానాధునకు కూడా క్రియా యోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపములో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశ కాలములకు అతీతులు. శ్రీ ప్రభువు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్య వర్తమానములు వేరు వేరుగా కనిపించవు. మాకు అంతయునూ నిత్యవర్తమానమే."   

అనఘా సమేత దత్తాత్రేయ దర్శన 

నా ప్రక్కనున్న మరియొక మహా సర్పము "నాయనా! మాధవా! మమ్ములను కాలనాగులని ఋషీశ్వరులందురు. శ్రీదత్తుడు వేలకువేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తరువాత తన రూపమును గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుడురని అచ్చటనే యుంటిమి. వారు మా నుండి మరుగుపరచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియును. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాతా పైకి వచ్చిరి. అయితే యీ సారి వారి చేతిలో 16 సంవత్సరముల వయసు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపానమత్తుడును, స్త్రీలోలుడును అయిన యితనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారిచేతిలో నున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపిని అయిన అనఘాలక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని యీ భూమి పై అవతరింప జేయుటకు ఘోరతపస్సు చేసితిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురములో వారు శ్రీపాద శ్రీవల్లభావతారమును దాల్చిరి.

శ్రీ కురువపుర వర్ణన

ఆనాడు వారు ఎచ్చోట స్నానార్థము నీట మునిగిరో అదే యీ పరమ పవిత్రమైన కురువపురము. వారు జలసమాధిలో నున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో యీ సూక్ష్మ లోకమున యోగసమాధిలోనున్నాము. కౌరవపాండవులకు మూల పురుషుడైన "కురు" అను మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురుపురమే యీ పవిత్రస్థలము. నాయనా! మాధవా! ఈ కురుపుర మహత్యము వర్ణించుట ఆది శేషునకయినను తరము కాదు.

సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాధ

శ్రీపాద శ్రీవల్లభుల శ్రీ చరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభులు కరుణాంతరంగులై "వత్సా! యీ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతి రామలింగస్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరియొక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబోవు శతాబ్దములలో భూమి మీద అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురములో ప్రతిష్టింపబడును. నేను జన్మించిన నా మాతామహాగృహము నందే నా పాదుకలు ప్రతిష్టింపబడును. నా జన్మకర్మలు దివ్యములు. అవి రహస్యములు. అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్టింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్టలో నున్న కాలనాగులను కలుసుకొని రమ్మనిరి." 

శ్రీ పళనీస్వామి మందహాసము చేయుచూ, "నాయనా! మాధవా! పీఠికాపురము నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తిచేసి ధ్యానము చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ." అని తెలిపెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-3 సమాప్తం)   

No comments:

Post a Comment