Thursday, November 17, 2011

అధ్యాయము-6 భాగము-7

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 7 

శ్రీపాదుల వారి జన్మదినమైన గణేశ చతుర్థినాడు రాజశర్మ సతీసమేతముగా శ్రీ చరణులను తీసుకొని బాపనార్యుల యింటికి వెళ్ళెను. శ్రీ బాపనార్యులు శ్రీ వల్లభుల వారి పాదపద్మములను పరిశీలించి శుభ లక్షణములను దర్శించ యత్నించునపుడెల్ల వారి కండ్లకు మిరుమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనము యిచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునాకున్న శుభ లక్షణములను వారు దర్శించలేక పోఎదివారు. యిది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషఃకాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్య పాదముద్రలను చూచి బాపనార్యులు తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, "అమ్మా! ఈ మార్గమున ఎవ్వరు వెళ్లినారని అడిగెను." అంతట సుమతి "ఇంకెవరు? మీ ముద్దుల మనుమడే యిటు వెళ్ళినాడు." అని సమాధానము చెప్పెను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరములు బాలుని కాలిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీ వల్లభుని తన ఒడిలోనికి తీసుకొని వారి శ్రీ చరణములను పరిశీలించిరి. ఇదివరకు కనులకు మిరుమిట్లుగొలుపు కాంతులు యిప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శుభ లక్షణములు వారికి దర్శనీయమాఎను. వారు శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్త  ప్రభువని నిర్ణయించుకొనెను. అపుడు బాపనార్యుల వారి నోటివెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్ఛరించబడినవి. వాటికి చందోబద్ధత గాని, వ్యాకరణ దోషరాహిత్యము గాని ఉండనవసరము లేదు.

తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాడులవారు యిట్లనిరి. "తాతా! నీవు శ్రీశైలము నందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లిఖార్జున శివలింగాములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణము నందలి మహాబలేశ్వరుని లోనికిని, పాదగయా క్షేత్రములోని స్వయంభూ దత్తునిలోనికిని ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని (పరమేశ్వరుని ఆత్మా లింగము) లోనికి లయము చేసికొని, శుభ స్పందనలను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శనమాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లిఖార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలచితిని. నీవు సత్యఋషివి. యతిరూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుటవలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్న నాకు అమ్మ పాదనమస్కారము చేయుటవలన నేను అల్పాయుష్కుడనయ్యెదనని నేను వక్కాణించితిని. మన యిద్దరి వాక్కులకును వ్యాఘాతము కలుగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ యింత నుండదలచితిని. సంసార బంధములనుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలెను. నేను చిరంజీవిగా నుండవలెనన్నది నీ సంకల్పము గనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు యీ దివ్య మంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించిననూ, శ్రీపాద శ్రీవల్లభ రూపమున మాత్రము నిత్య సత్యరూపముగా నిలిచి యుండును. నృసింహ సరస్వతినై అవతరించి, శ్రీశైలమున కదళీ వనమందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నాయొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లిఖార్జున శివలింగాము నందు విలీనమయ్యెదను."

బాపనార్యులకు యిదంతయునూ ఆశ్చర్యముగను, అద్భుతముగను తోచెను. తాతగారి యింట గణేశ చతుర్థినాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగెను.

పీఠికాపురములో ఆరోజు మరియొక వింత జరిగెను. ఉషః కాలమున నరసావధానులుగారును, పూజారియును, మరికొందరును శ్రీ కుక్కుటేశ్వరాలయ సందర్శనమునకు వెళ్ళినపుడు అచట స్వయంభూ దత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమయిన విషయము ఊరంతయునూ దావానలము వలె వ్యాపించెను. నరసావధానుల యందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానులు పనియేననియూ, నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియూ, అతడే ఈ విగ్రహమును మాయము చేసెననియూ ప్రచారము చేయదొడగెను. అంతట పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానులు యింటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలెనని తీర్మానించిరి, బాపనార్యులను యీ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తేలదనియూ, ప్రస్తుతము మౌనముగా నుండుట భావ్యమని తాను తలచుచున్నాననియూ, సమయము వచ్చినపుడు మాట్లాడెదననియూ తెలియజేసెను. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరుపగా మానవ కపాలములు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను. నరసావధానులు నిర్దోషి అయిననూ, అతడు క్షుద్ర విద్యా ఉపాసకుడని ముద్ర పడెను. రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీనించు చుండెను. అతని యింటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలె భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయెను. తాంత్రికుడు ఆ గోవు నందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకుని భీకరాకారముగా యింటిలోని వారిని పొడిచి తన యజమాని ఎన్తూ ప్రేమగా పెంచుకొను తోటకూర తోటను ధ్వంసం చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరి తరమూ కాదాయెను. ఆ రోజున నరసావధానులు తల్లి యొక్క అబ్దీకము. ఇంటిలో గారెలు, మరి కొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడెను. నరసావధానులు యింటిలో వంటపాకలో నున్న భక్ష్యములను, గారెలను ఆ ఆవు తినివేసెను. అప్పటికే భోక్తల భోజనములు పూర్తీ అయినవి. అయితే యింటిలోని వారు యింకను భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశార్మతో మనము నరసన్న తాత గారి యింటికి పోవలెనని మారాము చేయసాగెను. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానులు యింటికి ఎదురుగా నిల్చొనెను. ఇంతలో అవధాన్లు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందకు దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి, తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచెను.


(ఇంకా ఉంది..)                   

No comments:

Post a Comment