Tuesday, November 29, 2011

అధ్యాయము 7 భాగము 4

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 4 

సృష్ట్యాది యందు సమస్తమునూ జలములో నిండి యుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమొనరించగా నీటి మీద  పుష్కరపర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహరూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునగగా దిగువన ఉన్న మహాభూమిని పొండినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరుచేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కరపర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. తాతా! దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనునది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి యున్నది. జంబూ ద్వీపమనునది మహాభూమియందే కలదు. దానిలో నవఖండములు ఉన్నవి. దైవఖండము నందు దేవతలు నివసిన్చేదారు. గాభాస్త్య ఖండము నందు భూతములుండెదరు. పురుషఖండము నందు కిన్నెరులు, భరతఖండము నందు మానవులు, శరభఖండము నందు సిద్ధులు, గాంధర్వ ఖండము నందు గంధర్వులు, తామర ఖండము నందు రాక్షసులు, శేరుఖండము నందు యక్షులు, ఇందు ఖండము నందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగా నున్న భరత ఖండములోని భరతపురమున వైవస్వతమనువు, భూ ఋషులతోడను, మానవుల తోడను కొలువుదీరి యుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నటులనే భూగోళము మీద కూడా జంబూ ద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీ పీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద నున్న జంబూ ద్వీపము లక్ష బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగియున్నది. జంబూద్వీపమునందలి భారత ఖండమున మాత్రమీ వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులయిన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగానుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెల్తురుండును గాని పగలురాత్రి అను భేదము లేకుండా ఉందును. మహాభూమి యందలి జంబూద్వీపము లక్ష యోజన విస్తీర్ణము కలదు. లవణ సముద్రము లక్ష యోజనములు, ప్లక్ష ద్వీపము రెండు లక్షల యోజనములు, ఇక్షుర సముద్రము రెండు లక్షల యోజనములు, కుశ ద్వీపము నాలుగు లక్షల యోజనములు, సురాస సముద్రము నాలుగు లక్షల యోజనములు, క్రౌంచ ద్వీపము ఎనిమిది లక్షల యోజనములు, సర్పిస సముద్రము ఎనిమిది లక్షల యోజనములు, శాక ద్వీపము పదహారు లక్షల యోజనములు, దధిస సముద్రము పదహారు లక్షల యోజనములు, శాల్మలీ ద్వీపము ముప్పదిరెండు లక్షల యోజనములు, క్షీర సముద్రము 32 లక్షల యోజనములు, పుష్కర ద్వీపము 64 లక్షల యోజనములు, శుద్ధ జల సముద్రము 64 లక్షల యోజనములు, చాలాచాల పర్వతము 128 లక్షల యోజనములు, చక్రవాళ పర్వతము 256 లక్షల యోజనములు, లోకాలోక పర్వతము 512 లక్షల యోజనములు, తమోభూమి 1250 లక్షల యోజనములు విస్తీర్ణము కలిగి యుండును. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలులేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండభిత్తికిని నడుమనుండేది ప్రదేశము ఎల్లప్పుడునూ చీకటితో కూడి యుండును. అండభిత్తి అనునది కోటి యోజనముల మందము కలిగి యుండును. వరాహావతారము గాని, నరసింహావతారము గాని భూమి పట్టేంతటి అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు. ఖడ్గ మృగము. ఒకే కోర కలిగినది.

ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాధిదేవతల వివరణ 

మహాభూమి యందలి జంబూ ద్వీపమును స్వాయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని ఏడుగురు కుమారులు ఏడు ద్వీపములకు అధిపతులయిరి. ప్లక్ష ద్వీపమును మేధాతిధి, శాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశాద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతుడు, శాకద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్ష ద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్యదైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణక వర్ణ , పీతవర్ణ, కృష్ణవర్ణ అను నాలుగు వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు, కుశ ద్వీపమునందు దమి, శుష్మిణ, స్నేహ, మందేహ, అను నాలుగు వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచ ద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాక ద్వీపము నందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్య భగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములు గాని, శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళము నందలి జంబూ ద్వీపములో భారతవర్షము, కింపురుష వర్షము, హరివర్శము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాశ్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యాక వర్షము, కురువర్శము అనునవి కలవు. తాతా! మహాభూమియందు ఖండవిభాగములు గల జంబూ ద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూ ద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలె మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలచెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించి యుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలచియున్నది. మహాభూమియందు నడిమధ్యన గల మేరురేఖను చుట్టుకొని జంబూ ద్వీపమున్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళము నందలి ఉత్తరార్ధ గోళము దేవభాగమని, దక్షిణార్ధ గోళమును అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించెడి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులయిన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రము  నందు జ్యోతిశ్చక్రము అమర్చబడి యున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగా నున్నది. సప్తకక్ష్యావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనునది లేక కాలవ్యత్యాసము లేక యుండును. భూగోళము నందు దీనికి వ్యతిరిక్తముగా నున్నవి. మహాభూమి అనునది పుణ్య ఫలానుభవమున మాత్రమీ పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది, భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరులు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మహా యుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును.

మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహీ, ఉర్వి, క్షితి, పృథ్వి, భూమి అని పిలిచెదరు. తాతా! పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలము నందు పిశాచ గణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలము నందు భూతములు, తలాతలము నందు యక్షులు, మహాతలము నందు పితృదేవతలు, పాతాళము నందు పన్నగులు ఉందురు.


(ఇంకా ఉంది..)    

No comments:

Post a Comment