Monday, November 14, 2011

అధ్యాయము-6 భాగము-4

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము - భాగము 4 
శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతీ మహారాణికి కలిగిన సంకల్పం

ఆ దివ్య మంగళ విగ్రహమును చూచి సుమతీ మహారాణి వాని పాదములపై బడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభులు సుమతీ మహారాణిని లేవనెత్తి "అమ్మా! బిడ్డ కాళ్లపై తల్లిపడుట అసంబద్ధమైన విషయము. బిడ్డకు ఆయు:క్షీణము కూడాను. " అనెను. అంతట సుమతి, "శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! నీవు నన్ను అమ్మా అని పిలచితివి. కావున నేను తల్లిననియూ, నీవు బిడ్డవనియూ అంగీకరించితివి. నీది సిద్ధ వాక్కు గనుక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది." అనెను. అంతట శ్రీచరణులిట్లనిరి. "తధాస్తు! ఇపుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించెదను. తల్లి బిడ్డ పాదములపై బడుట బిడ్డకు ఆయు:క్షీణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడువను గనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించెదను." అనెను. అందులకు సుమతి, "అయ్యో! ఎంతటి అపచారము కలిగినది. 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్షు!" అని విలపించదొడగెను. అందులకు శ్రీచరణులిట్లనిరి. "అమ్మా! 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడచుకొందును. 'వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్' అని ఉన్నది. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలెను గాని ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహము చెసుకొనవలసినదని నిర్భంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా విహరిన్చుటకు అనుజ్ఞ నీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్భంధించిన నేను మీ యింటనుండువాడను గాను. " అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయెను.

సుమతీ మహారాణి నోట మాటరాక కొంతసేపు అట్లే యుండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతట అప్పలరాజశర్మ, "సుమతీ! విచారింపకుము. శ్రీ దత్తుడు యీ ప్రకారముగా మనయింటికి బిక్షకువచ్చునను విషయమును మీ నాయన సూచన ప్రాయముగా యింతకు ముందే తెలిపియుండెను. శ్రీ దత్తుడు కరుణాసముద్రుడు. శ్రీపాద శ్రీవల్లభ జననము కానిమ్ము. తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును." అని పలికెను. అప్పలరాజు యింటికి అవధూత వచ్చెనను వార్త ఊరంతయునూ ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రముఖమైన యీ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు భోజనము చేయుటకు ముందే అవదూతకు భిక్ష యివ్వబడెనను విషయము చర్చించబడుచుండెను. శ్రీ బాపన్నావధానులు గారిట్లనిరి. "శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే! అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే! అందువలన సుమతి యొక్క దోషము ఏమీలేదు. బిడ్డగా జన్మించినపుడు సాష్టాంగము పడుట ఆయు:క్షీణకరము  గాని, అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు." ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్య వహించి యుండెను. అందులో నరసావధానులు అను పండితుడు చాల ఈర్ష్యను కలిగియుండెను. అమావాస్య రోజున అందరునూ పితృ కార్యమున నిమగ్నమై యుందురు. భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యెను. శ్రీ బాపనార్యులు మాత్రము అప్పలరాజు యింట ఎట్టి ఆటంకమును కలుగదని సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్ని శమనుని ధ్యానమున నుండెను. ఇంతలో భోక్తలుగా నుండుటకు మువ్వురు అతిథులు వచ్చిరి. పితృ కార్యము నిరాటంకముగా సాగిపోయెను.

నాయనా! శంకరభట్టు! ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారమున్నదా? లేదా? అను విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళ దేశము నందలి నవద్వీపము నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయా క్షేత్రమునకు వచ్చెను. అతనివద్ద అత్యంత ప్రాచీనమైన నాడీగ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనార్యులు యిట్లు సెలవిచ్చిరి. నియమనిష్ఠలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మవిహితమే! తక్కువగల వర్ణముల వారెవరైన ఉపనయనము కోరిన యెడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అనునవి ఆటంకములు కాదు. సిద్ధ పురుషులలో వైష్యమునులు కూడా కలరనియూ, లాభాదుడను వైశ్యమహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యెననియు, లాభాదమహర్షి దయ ఉన్న యెడల మానవుడు చేయు ప్రతి పనియండును లాభాదులు కలగుననియూ వక్కాణించెను.

ఈ విధమున నిర్ణయము నరసావధానులు అను పండితునికి బాధాకరమయ్యెను, నరసావధానులు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి భగళాముఖీ దేవతా ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతీరోజు అర్చిన్చును. వాడమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని, భగళాముఖీ మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రీ మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షనోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనము చేసికొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయస్సు నుండియు మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశాములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులొలుకు ఆ పసిబాలుని ఎవ్వరునూ ఆటంకా పరచువారు కారు. ఈ రోజున నరసావదానులకు శ్రీ వల్లభులు సభలో నుండుట అయిష్టముగా నుండెను. మహా పండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. భగళామంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవుచూ శ్రీపాదులనుద్దేశించి నీవేళ వచ్చితివని అడిగెను. అందులకు శ్రీపాదులు "తాతా! నీవు పోమ్మనిన యెడల పోయెదను. నాకేమి? నేను స్వేచ్ఛాజీవిని! బాలకుడను." అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకొని వెడలిపోయెను. వాదమునాకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయెను. అతడు నోరెంత పెకలించినను నోటమాట రాలేదు. ఇదంతయును గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనార్యుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడెను. 

ఆశుతోషుని వద్దనున్న నాడీగ్రంధముల గురించి చర్చ జరిగెను. నాదీగ్రంధము నందు సాంద్రసింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీ వల్లభుల జననము నిర్ణయింపబడవలెనని సూచించబడెను. శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషఃకాలములో సింహలగ్నము నందు చిట్టా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాడులవారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీదత్తావతారులనియూ, వారి చరణములయందు సర్వ శుభ లక్షణములు కలిగి యుండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియూ, వారి జన్మకుండలిని ఎవ్వరికినీ యీయరాదనియూ, అది కాలవశమున త్రిపురదేశము నందలి అక్షయకుమారుడు అను జైనమతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియూ, అదంతయునూ దైవలీల ప్రకారము జరుగుననియూ తెలుపబడెను.

ఆశుతోషుడు శ్రీపాదవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీవల్లభులిట్లనిరి. "ఈ రోజు చిత్తా నక్షత్రము. నా జన్మ నక్షత్రమునాడు ఎవ్వరైననూ నన్ను ఆరాధించిన యెడల నేను మిక్కిలి సంప్రీతుడనయ్యెదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి గనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలయునో కోరుకొమ్మనెను." అంతట ఆశుతోషుడు "ప్రభూ! నరసావధానులు భగళాముఖీ ఆరాధకులనీ తెలిసినది. వారినాశ్రయించి అంబికను దర్శింపవలెనని తలంచితిని. నా కోరిక అడియాస అయ్యెను. వారియందు అంబిక కినుక వహించినదని నెను గ్రహించితిని." అనునంతలో శ్రీపాదులిట్లనిరి. "అతడు ఆరాధించు అంబికను నేనే! నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటివరకు నరసావధానులు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకొని యున్న అంబిక నాలో లీనమయినది. నేను సర్వదేవీ దేవతాస్వరూపుడను. అంబిక దర్శన భాగ్యము పొందుము." అని వారు ఆశుతోషునకు శ్రీ భగళాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరణుల ఆదేశము మేరకు పెనుశిలకోన (పెంచలకోన - నెల్లూరు జిల్లా ) అరణ్యము నందలి కణ్వమహర్షి తపోభూమికి పయనమయ్యెను. కణ్వమహర్షికి సంబంధించిన వాజసనేయి శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించెదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినపుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీవుందువు. నాయొక్క అద్భుతలీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. 

(ఇంకా ఉంది..)                

No comments:

Post a Comment