అధ్యాయము-5
శంకరభట్టు తిరుపతి చేరుట, కానిపాకమున తిరుమలదాసును సందర్శించుట -భాగము 1
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ
నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రమునకు వచ్చితిని. నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రములోని పుష్కరిణిలో స్నానము చేసి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వేంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాలాత్రిపురసుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరి కొద్ది సేపటికి మహావిష్ణు రూపముగా మారినది. ధ్యానము మరికొంతసేపయిన తరువాత ఆ మూర్తి పదునారు వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృతదృష్టియని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడొకడు అరుదెంచెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో "శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! మీరు జగన్నియింతలు. మీ భక్తుడైన శంకరభట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల యిక్కట్లున్నవో అన్నింటిని వానిచే అనుభవింపజేసెదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచియున్నాను." అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, "ఓయీ శనైశ్చ్వరా! నీవు కర్మకారకుడవు. జీవులను కర్మఫలితములను అనుభవింపజేయుచూ వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజనరక్షణ నా ప్రతిజ్ఞ కనుక, నీవు శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధముగా ఆదుకొని
ఎట్లు విడుదలచేసెదనో నీవే చూతువు గాక!" అనెను. శ్రీపాదులు, శనైశ్చ్వరులు యీ రకముగా సంభాషించుకొనిన తదుపరి యిద్దరునూ నా ధ్యానమునుండి తొలగిపోయిరి. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తమయినదనియూ, శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిజేర్చుదురనియూ తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చితిని.
తిరుపతి వీధులలో యిచ్చవచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలముగా ఉన్నది. ఒక క్షురకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి, "నీవు 20 సంవత్సరముల క్రితము యింటినుంచి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా! నీ తల్లిదండ్రులు బెంగపడియున్నారు. నీ భార్య రజస్వరాలైనది. ఆమె యీడేరినది. కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడెను." అంతట నేను "అయ్యా! నేను శంకరభట్టు అను కన్నడదేశ బ్రాహ్మణుడను. బాటసారిని. పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీదత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు. నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకొనునట్లు మంగలి సుబ్బయ్యను కానే కాను." అని పలికితిని.
కాని అతడు నా మాట వినువాడు కాడయ్యేను. అచ్చట చాలా మంది జనులు పోగుపడిరి. అందరునూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనువాని యింటికి తోడ్కొనిపోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచూ తమను విడిచి పోరాదనియు, రజస్వల అయిన భార్యను విడచిపోవుట మహాపరాధమనియు, ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, "సుబ్బయ్య గెడ్డము, మీసములతో పీడగొట్టుకొని పోయినాడు. వీనికి క్షురకర్మ చేసిన యెడల పూర్వపు కల వచ్చునని" సెలవిచ్చెను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వారు వినరయ్యిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండు గీసిరి. గెడ్డము, మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూతవైద్యునొకని రావించిరి. అతడు చిత్రవిచిత్రమైన వేషధారణ చేసి యుండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివైచి కత్తితో నా గుండున గాయమునేర్పరచిరి. దానిపై నిమ్మకాయ రసము, మరి యింకనూ వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తరువాత సుబ్బయ్యను బ్రాహ్మణదయ్యము పట్టెననియూ, అందుచేత యితడు జందెము ధరించి మంత్రములను వల్లించుచుండెననియూ తేల్చిరి. తిరుపతిలో నున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియూ అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉన్దేననియూ తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొనిపోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీకుడనని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకొందునని తెలిపితిని. ఆ బ్రాహ్మణపెద్దలు నేను చెప్పునది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకొనెననియూ అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని" వారికి చెప్పిరి.
గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లి పోయితిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహ లోనికి వచ్చునప్పటికి నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొనియుండుటను నేను గ్రహించితిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను. నాతో తదాకారమయిపోయెను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యెననియూ 7 1/2 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియూ నా మనస్సునకు తోచెను.
(ఇంకా ఉంది..)
గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లి పోయితిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహ లోనికి వచ్చునప్పటికి నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొనియుండుటను నేను గ్రహించితిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను. నాతో తదాకారమయిపోయెను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యెననియూ 7 1/2 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియూ నా మనస్సునకు తోచెను.
(ఇంకా ఉంది..)
No comments:
Post a Comment