Thursday, July 3, 2014

Chapter 23 Part 1

అధ్యాయము 23 భాగము 1

శివపూజా రహస్య వివరణము

శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు 

నేను కృష్ణ యీవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చుచుండెను. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులయిన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరునూ శ్రీపాదుల వారి దివ్య చరితమును, లీలలను, మహిమలను, వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత, విశేషత సంతరించుకొనియున్నవి. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడెడివి. అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధము లేని వింతవింతలు. ఇదివరకెన్నడునూ నేను వినియుండని చిత్రవిచిత్ర సంగతులు. నాకు ఇప్పటివరకు శ్రీపాదుల వారి పది సంవత్సరముల వరకూ జరిగిన లీలా విశేషములు ఒక క్రమపద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనసున యిట్లాలోచించుచుంటిని. ధర్మగుప్తులవారు శ్రీవారి 11వ సంవత్సరములో జరిగిన సంఘటనలను ఏవయినా నాకు తెలియజేతురేమోనని అనుకుంటిని. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలావిహారి. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో యిట్లు చెప్పనారంభించిరి. అయ్యా!శంకరభట్టూ! నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరములో శివయోగి ఒకడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. కరతలభిక్ష చేయువాడు. తనయొద్ద ఏ రకమైన సంచిని గాని, కంచమును గాని, మరే పాత్రను గాని ఉంచుకొనువాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివానివలె నుండెను. అతడు తొలుదొల్త శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. అతని పిచ్చివాలకమును, ధూళిధూసరిత విగ్రహమును చూచి అర్చకస్వాములు ఆలయములోనికి రానీయరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటిమాటికీ శివపంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుఱ్ఱము మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనయిన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను అయిదు వరహాలను అర్చకస్వాముల కీయదలంచితిని. ఆ అయిదు వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు. వారి ఆర్థికపరమైన కష్టములను, వెతలను, బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు రెండు త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చకస్వాములకు ముచ్చెమటలు పట్టినవి. 

ఆ శివయోగి, "అర్చకస్వాములారా! మీకు భయమేమియును వలదు. మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు యివి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనునట్లు ఈ నాగుబాములు మన తండ్రియైన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను జూచి భయపడుట, పారిపోవుట, లేదా చంపబూనుట మహాపాపము. అర్చకస్వాములు చేయు విశేషపూజ వలన అవి యిక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించెదము గాక! నమకచమకములను సుస్వరముతో, రాగయుక్తముగా ఆలపించుడు." అనెను. 

అర్చకస్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు. అర్చకస్వాములకు కొంత వందిమాగధ జనముండెడివారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరయినా ధనవంతులైయుండి విశేషముగా సంభావనల నిచ్చువారయినచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెడివారు. ఈ అర్చకస్వాములలో పీఠికాపురములో నున్న సూర్యచంద్రశాస్త్రి  అనునతడు మంచి పండితుడే గాక నిష్ఠ గల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమకచమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళ బద్ధముగా తమ పడగలను కదల్పుచూ తమ ఆనందమును వ్యక్తము చేసెను. 

సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల యింటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తి కరమయిన భోజనమొసంగబడెను. అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనము కూడా అయ్యెను. శ్రీపాదుల వారు వానికి శివశక్తిస్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి మూడురోజుల పాటు సమాధిస్థితి నందుండెను. మూడు రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తముతో వానికి అన్నమును తినిపించి, తదుపరి వానికి, "నాయనా! సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలనాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములు కల్పనలు గాని, అసత్యములు గాని కానేకావు. వాటిలోని సామాన్య అర్థము వేరు. నిగూఢమైన రహస్యార్థము వేరు. అనుష్ఠానము చేసెడి సాధకులకు మాత్రమే. దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు, అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులగు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా, చంద్రుడు మనస్సుకు ప్రతీక. చిత్సూర్యతేజస్సు, మనోరూపమయిన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యము నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రథమమున వసువులు అనెడి పేరుగల కళలను సృజించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తనయందు లయము చేసికొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది. మాయయునూ, అమావాస్యయును జడస్వరూపములయిననూ వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యమును బట్టి చిజ్జడాత్మకమయినది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడ శిశుజనాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మ జ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుండును. స్త్రీలయందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమయినది గనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు. 

ఛందస్సులచే కప్పిపుచ్చబడినది గనుక వేదరహస్యములను ఛాందసమందురు. వంక లక్షణము ఆర్తవమునకుండును గావున ఋతిమతియైన స్త్రీని మూడు రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనునది స్వతసిద్ధ కాంతి గల తేజోగోళము. మర్త్యలోకమనునది చావుపుట్టుకలు గల లోకము. పాతాళములన్నియు సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృశ్నులు అని పేరు. సప్త పాతాళములకునూ జాతవేదాది అధిష్ఠాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్తపాతాళములకునూ ముందున్నది. దీనికి అగ్నియను వాడు అధిదేవత. ఈ ఎనమండుగురు అధిదేవతలకునూ అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందెడివారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ ఎనిమిది గోళములకునూ మధ్యనున్న వాయుస్కంధములను సప్తసముద్రములందురు. వాయువులకు సముద్రము అనెడి సంజ్ఞ కలదని యాచ్యమహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్తసముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు." అని తెలియజేసిరి. 

(ఇంకా ఉంది..)
  

No comments:

Post a Comment