Thursday, August 7, 2014

Chapter 23 Part 2 ( Last Part)

అధ్యాయము 23 భాగము 2

శివపూజా రహస్య వివరణము

శివమహిమ, ఆంద్రప్రదేశమందలి ఏకాదశ శివ క్షేత్రములలోని శివ స్వరూపములు

శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును. అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5) అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6)కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7) పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8) మహానంది యందలి మహానందీశ్వరుడు 9) కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10)శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11) త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు.

వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు. శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి, స్థితి, లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు. శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే!  ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత. 

అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి. ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు. మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా! ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ! యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము. 

సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం. ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది. 

శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను, గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమయినది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు, జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. 

భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు. భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును. యోగాభ్యాసము చేయుకొలదినీ, శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ, ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు, యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది, ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను. పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె  నుండును. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! 
       
(అధ్యాయము 23 సమాప్తము)


No comments:

Post a Comment