Tuesday, October 25, 2011

అధ్యాయము 1 - భాగము 2

చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము  - భాగము 2 

వృద్ధ తపస్వి యిట్లు చెప్పనారంభించెను. నాయనా! ఆంధ్ర దేశమునందు గోదావరీ మండలమందు అత్రి మహర్షి తపోభుమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమశుంఠ అయ్యెను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననూ సంధ్యా వందనము కూడా చేయజాలడయ్యెను. "వ్యాఘ్రేశ్వర శర్మా అహంభో అభివాదయే" అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియూ, వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ, అతడు విని యుండెను. తిలదానములు పట్టుతకును, అభావామేర్పడినపుడు అబ్దీకములకు పోవుటకునూ తప్ప, ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యూనతా భావమేర్పడెను. 

ఒకానొక బ్రాహ్మీముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదికి దిగి వచ్చుచుండెను. వాని శ్రీ చరణములు భూమిని తాకగనే యీ భూమండలము దివ్యకాంతి తో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, "నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకునూ ఋణానుబంధము కలదు. ఋణానుబంధము లేనిదే శునకమైననూ మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము నీకు శుభామగును" అని పలికి అంతర్థానమయ్యేను. 

వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించ సాగెను. అతడు తన సంచారములో ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. వ్యఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్థానమయ్యెను. ఆ మహాత్ముడు యిట్లు వచించెను. "వ్యాఘ్రేశ్వరా! నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వ జన్మార్చిత పుణ్య స్వరూపము. కాలప్రబోధితుడవై నీవు యిచ్చటకు రాగలిగితివి. ఊర్వశీకుండము నందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభుమికి ఆకర్షింపబడితివి. ఇదంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ!" అని పలికెను. 

వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడయి "గురుదేవా! శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది?" అని ప్రశ్నించెను. "నాయనా! శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తూ దత్త ప్రభువులు, త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవితృకాఠక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురము నందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భారద్వాజునకు యిచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రము నందు అనేకమంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు, అవతరించినట్లును, సవితృకాఠకచయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లును, పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినది. దేశమునందలి యితర భాగములందు లుప్తములయినను, కల్కి అవతారభూమి అయిన "శంబల" గ్రామము నందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడియున్నవి. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినపుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినపుడు, పుణ్యకర్మలు ఫలితమివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమీ దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినపుడు ఏ యుగమందయిననూ, ఏ కాలమునందయిననూ శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన, స్పర్శన సంభాషణా భాగ్యము నిచ్చెదరు. నీ పూర్వ జన్మ పుణ్య కర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది. నేను, నా గురుదేవులయిన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు, మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము నభ్యసించుచు, ఆత్మజ్ఞానసిద్ధికి ప్రయత్నించవలెను." అని శిష్యులను ఆదేశించి సంజీవినీ పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను.

వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను....

 

2 comments:

  1. Sripada Rajam Sharanam Prapadhye,
    Excellent work and very useful for abroad devotees.Can i know why stopped in 2012?Please Publish the remaining chapters also.

    ReplyDelete
  2. Jayagurudatta! I apologize for the delay in updating this blog. I shall continue to blog at least once in two days. Please check back for the updated chapters.
    Srigurudatta!

    ReplyDelete