Thursday, December 1, 2011

Chapter 8 Part 2

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 2 
శ్రీపాదులు షోడశకళాప్రపూర్ణులు

కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరములోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశకళా పరిపూర్ణమైన మహాయుగావతారమను విషయమును బోధ చేయుచుండిరి. తమ పదునారు సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత పదునాలుగు సంవత్సరములు కురువపురము, తదితర ప్రాంతముల సంచరించిననూ వారి వయస్సు మాత్రము 16 సంవత్సరములందే నిలచియుండెను. 
దత్తాత్రేయుని షోడశావతార నామాలు 

16 సంఖ్యకు మరియొక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయస్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చి యుండిరి. అవి (1) యోగిరాజు, (2) అత్రివరదుడు, (3) దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, (4) కాలాగ్ని శమనుడు, (5) యోగిజనవల్లభుడు, (6) లీలావిశ్వంభరుడు, (7) సిద్ధరాజు, (8) జ్ఞానసాగరుడు, (9)విశ్వంభరావధూత, (10) మాయాముక్తావధూత, (11) ఆదిగురువు, (12) సంస్కారహీనశివస్వరూపుడు, (13) దేవదేవుడు, (14)దిగంబరుడు, (15) దత్తావధూత, (16) శ్యామకమలలోచనుడు. 

శ్రీ దత్త ప్రభువులు భోగమోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను నాల్గు వేదములు నాల్గు కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలనూ పోగొట్టగలిగిన వేదములే, అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు, సప్తర్షులకు కూడా అసాధ్యము.

పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించునపుడు మాతృ గర్భము నుండి తల ఒక పర్యాయము బైటికి వచ్చి పరిసరములను పరికించి, తిరిగి గర్భస్థమయ్యెను. అపుడు దేవతలు, ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు.

శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా రెండుసార్లు జన్మించుట వలన వారు ఆజన్మద్విజులు. ఆజన్మబ్రహ్మజ్ఞానసంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ, అనంత, అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయెను. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము గాక, వారికి అతీతముగా నున్న ఒకానొక ప్రత్యేక తత్త్వము. అందువలన వారు త్రిమూర్తులకతీతమైన నాలుగవ తత్త్వమని సూచించుటకు చతుర్థీ తిథినాడు జన్మించిరి. సృష్టి యందలి ప్రవృత్తి గణములు, నివృత్తి గణములు రెండింటికీ అధిపతి అయిన గణేశ తత్త్వమని సూచించుటకు గణేశ చతుర్థీ దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళ గ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైనయెడల జీవులకు అనేక అమంగాలములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిట్టా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేషఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త గనుక, హరిహరాత్మజుడైన అయ్యప్పస్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి, వారు విశ్వప్రభువుననియూ, దర్బారుచేయుటకు వచ్చిన చక్రవర్తిననియూ తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మసూక్ష్మములు లేవు. ధర్మసంకటము లేర్పడినపుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపధము దర్శనీయమగును.


శ్రీదత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటిదేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్తదేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషిపూజ చేయవలయును. విష్ణు ముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రా ముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వ యందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టియందలి సమస్త స్త్రీదేవతాశక్తులును శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులును శ్రీపాదుల వారి కుడిభాగము నందు కలవు.  

తిరుపతిలో ఏడుకొండల మీద వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే! 'వేం' అనగా పాపములను 'కట' అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. 'వేం' కారము అమృతబీజము. 'కట' అనునది ఐశ్వర్యబీజము. అందువలన వేంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయునూ, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులును అభిన్నమూర్తులు.

అప్పుడు నేనిట్లంటిని. "అయ్యా! తిరుమలదాసూ! వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు వచిన్చిరి. శ్రీపాదవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది.
బ్రాహ్మణ లక్షణములు 

అంతట తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించెను. "నాయనా! బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన యెడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన యెడల అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగువాటికి లోనైన యెడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైననూ లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారమువలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేకమార్పులకు లోని చండాలత్వము నొందును. అపుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సువలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మ  సిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వము నొందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్చ్వరుడు మూడురాశులలో ప్రయాణము చేయు 7 1 /2 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులు చెందును. పాత జీవకణములు నశించును. క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయునూ మనుష్యులకు తెలియకుండగనే జరుగుచుండును.

క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వ్రుత్తి అయిన కృషి, గోగణపోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన యెడల అది తీవ్ర దశకు వచ్చిన యెడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమునూ నిలువదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకులోనై వైశ్యత్వము నొందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తి నవలంబించిన పరశురాముని వలెనగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా! జన్మతః శూద్రుడనయిన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానము పొందలేదా? జన్మతః శూద్రుదయినా వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడుగా గాని, బ్రాహ్మణుడుగా గాని మారవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనయిన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. జన్మతః బ్రాహ్మణుడయినవాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింప వచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్లు కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చి యుండిరి. శంకరభట్టూ, నీవు మా యింత ఆతిధ్యమును స్వీకరించుచున్నావు. మా యింటి భోజనము బ్రాహ్మణ భోజనమే!

(ఇంకా ఉంది..) 

2 comments:

  1. 8th adyayamu part 2 brahmana lakshnamulu 10th line shanisharudu

    ReplyDelete
  2. Corrected. Thank you for the comment.

    ReplyDelete