అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 1
నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులవారిని భౌతికముగా ఎప్పుడు దర్శించెదనా అని మనమున ఎంతయో ఆతురతగా నున్నది. ఒక చేతిలో కల్లుముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయిననూ బ్రాహ్మణుడనయిన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతనూ, ఆ కల్లు వాసన నాకు ఎంత మాత్రము ఆమోద యోగ్యము కాని కారణముననూ, నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదులవారి నామమును ఉచ్ఛరించుచూ వడివడిగా నడచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా? అని అతడు ప్రశ్నించెను.
అంతట ఓయీ! నీవెవ్వడవు? నాతో నీకేమి పని? అని నేనడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కల్లువాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో? నీ పయనము ఎక్కడికో? తెలుసుకొనుట యుక్తమనెను. కల్లు నమ్ముకొనువారు గూడ యీ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్ధులు కాబోలనుకొంటిని. దారిన బోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచట చేరినది. ఆ కల్లు నమ్ముకొను వ్యక్తి, "అయ్యా! నేను యీ ప్రాంతములో కల్లు తీసుకొని అమ్ముకొనువాడను. ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటిచెట్టే కల్పవృక్షము. నేను చెట్లునెక్కికల్లు తీసుకొని వచ్చునంత వరకును యీ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నాకొరకు వేచి యుండెను. నేను బ్రాహ్మణుడనయిననూ కల్లు త్రాగుటకు అలవాటు పడితిననియూ, చెల్లించుటకు తనవద్ద పైకము లేదనియూ, కాస్త కల్లుపోసి పుణ్యమును పొందవలసినదనియూ కోరెను. నేను వల్లె యంటిని. నేను కల్లు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి, నలుగురి ఎదుట కల్లు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునాకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దానభంగమొనరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు యిది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కల్లును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన యెడల విశేష పుణ్యము లభించును గదాయను ఆశతో నున్నాను, నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులయిన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది." అనెను.
అచ్చట ప్రోగుపడిన వారందరునూ కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులైనందున తమసాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కల్లు త్రావింపబడెను. తదుపరి వారందరునూ తలా ఒకదారిలోను పోయిరి. నాకు కల్లు త్రావించిన ఆ విచిత్రవ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నా మనసులో "ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడయిన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచూ నీచమైన కల్లును సేవిన్చితిని. నా బ్రాహ్మనత్వము మంట కలిసినది. పరమపవిత్రులైన శ్రీపాడులవారి ముఖమునెట్లు చూడగలను? నా ఖర్మ యిట్లు కాలినది. విధి బలీయమైనది. నా నుదుట యీ రకముగా వక్రలిపి లిఖించియుండ మరోవిధముగా ఎట్లు జరుగును?" అని కుమిలిపోసాగితిని.
నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లువాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాడులవారి నామోచ్ఛరణము చేసుకోనుచూ నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కన్పించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందుననూ, కల్లు త్రాగిన యీ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచితిని.
నేను నా దారిన పోవుచుండ వెనుకనుండి ఒకవ్యక్తి చప్పట్లు చరచుచూ, "ఓయీ! శంకరభట్టూ! ఆగుము. నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానందస్వాముల వారి ఆజ్ఞ" అని ఉచ్చైశ్వరమున పల్కెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తీ దత్తానందస్వాముల వారి ఎదుట నిల్పిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీస్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములయిన ఫలముల నొసంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, "నాయనా! దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కల్లు గీసుకోను గౌడ కులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కల్లుగా భ్రమించితివి! ఎంతటి విడ్డూరము!" అని పలికిరి.
నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయునూ నా కళ్ళముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగమువలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును, అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగయినది. 'నేను' అనునది ఏమిటో తెలియరాని, తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయితిని. నాలోని పరిమితమైన 'నేను' అనునది నశింపగా యీ సమస్త సృష్టియూ కేవలము స్వప్నమువలె అనిపించసాగినది.
ఇంతలో శ్రీస్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్రభస్మమును నా నుదుటిపై తమ దివ్య హస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనయితిని. కొద్ది క్షణములపాటు నేను దివ్యానందమును అనుభవించితిని. ప్రకృతిస్థుడనయిన వెంటనే నేను స్థూలతత్త్వములోనికి కూరుకుపోయితిని అని తెలిసికొంటిని.
శ్రీస్వామి, "ఒకానొక జన్మమందు నీవు గౌడకులస్థుడవు. మిక్కుటముగా కల్లును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కల్లును త్రాగవలెననెడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదులవారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైననూ, నీవు కల్లు త్రాగుటకు అలవాటు పడిపోయి పతన మయ్యెడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగనే వాటిని పరిహరించుచుంటిరి. శ్రీగురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి." అని వివరించిరి.
(ఇంకా ఉంది...)