అధ్యాయము 18
రావిదాసును గురించిన వర్ణనము - భాగము 1
శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము
నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ (కురువపురము) చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆదిమధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపమునుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాదనమస్కారము చేసికొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శచేయునపుడు తమ కమండలమునుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమియునూ మాట్లాడకుండగనే అతితియ్యని కంఠస్వరముతో దివ్యశ్రీచరణులవారు "నాయనా! శంకరభట్టూ! నీ యందలి ప్రేమాతిశయమున నిన్ను యిచ్చటకు ఆకర్షించితిని." అని పలికిరి. ఆ పలుకుల తియ్యదనమును, అపారమైన వారి కారుణ్యామృతదృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకునూ అభయప్రదానమొనరింప సశక్తమగు, అనంతశక్తిసంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపైనుంచిరి. నాలోని కుండలినీశక్తి ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను వివశునిచేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమునూ అంతర్ధానమగునట్లు తోచినది. వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచూ మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయస్పందనము, నాడీస్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై, నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయము నందలి చైతన్యము విశ్వమునందున్న అనంతచైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మస్వరూపమైన ఆనందమాయస్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరియొక పర్యాయము ఆ 'నేను' అనునది కూడా శాంతించి అవ్యక్తమయిన దివ్యానందస్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలోనుండి కోటానుకోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునపుడు 'నేను' ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ 'నేను' అనునది శమించినపుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయునూ నాకు చిత్రవిచిత్రముగా నుండెను.
అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని. జగత్తునకు ఆదిగురువులైన శ్రీ వల్లభస్వామి వేయితల్లుల ప్రేమను మరిపించెడి కారుణ్యామృతదృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి.
మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం
నాతో వచ్చిన బ్రాహ్మణద్వయమునకు శ్రీపాదులవారితో మాట్లాడుటకుగాని, వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకుగాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదులవారు నావైపుచూచి నీతోవచ్చిన యీ యిద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. "ప్రభూ! దివ్య శ్రీచరణుల దర్శనముకోరి వచ్చిన యీ యిద్దరునూ కూడా బ్రాహ్మణులే!" అని నేనంటిని. దానికి ఆ ప్రశాంతసుందరుడు "నాయనా! వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే! గోమాంస భక్షణచేయు మ్లేచ్ఛులవలె తోచుచున్నారు. యదార్ధమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును." అనెను. అంతట ఆ బ్రాహ్మణులిద్దరునూ "అయ్యా! మేము బ్రాహ్మణులము కాము. మ్లేచ్ఛులమే! సందేహము లేదు." అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభులు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయితిని. అంతట ఆ మహాగురువులు "శ్రీపాదశ్రీవల్లభుడనెడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయులవారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారియందు భక్తిభావము సంపూర్ణముగా కలిగియుండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలునూ ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణజన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞపశువయిన ఆ మేకయేకాక, దానితో రక్తసంబంధముగల అనేక మేకలు తమ నీచజన్మము నుండి విముక్తమై ఉత్తమజన్మల నొందును. శీఘ్రముగనే బ్రాహ్మణజన్మ నొందును. యజ్ఞపశువయిన ఆ మేకను ఆ విధముగా ఉత్తమజన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞమును నిర్వహించువారికి ఉండవలెను. ఆ విధమయిన యోగి, తపోబలము లేక, నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలియిచ్చిన, మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ, కాలములనుబట్టి ధర్మకర్మములు మారుచుండును. మ్లేచ్ఛుడైననూ, మహాతపశ్శాలి అయినయెడల గోమాంస భక్షణ చేసిననూ, అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదియై గోవునకు, దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని యెడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది, కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ , పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రమెక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు, అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమునాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండకోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొనితెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తనవద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రిగాని, నరకబడెడి కుమారుడుగాని నరకుట అను క్రియ జరుగునపుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజక్షేమమునకు ఆహారము కావలెను. పంటపండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ, పాండవులకు రాబోవు కాలములో యుద్ధక్షేత్రాముగా నుండదగిన ధర్మక్షేత్రాముగా నిర్ణయించెను. ఓయీ! నామమాత్ర బ్రాహ్మణులారా! మీకు గోమాంసభక్షణచేయుట ఎంతమాత్రము సమర్ధనీయముకాదు. అయితే పూర్వ పుణ్యవశమున, మీ పితృదేవతల ప్రార్ధనాబలమున విశేషించి నా అవ్యాజకారుణ్యమువలన మీరు మా దర్శనభాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా, అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్రజలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే యిచ్చటనుండి బయలుదేరి మీ యిచ్చవచ్చిన చోట్లకు పొండు. మీకు అన్నవస్త్రములకు లోటులేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛవనితలను వివాహమాడి మ్లేచ్ఛధర్మము ననుసరింపుడు. మీచేత చంపబడిన గోవులు మీకు యీ జన్మములోనూ, జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచూ, అత్యంత శ్రమతో మీరు సంపాదించెడి కష్టార్జితమును యధేచ్ఛగా అనుభవించుచూ సుఖించును గాక! అయితే నా దర్శనభాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడేబాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్దులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు గలిగిన, విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరు గాక! మరాఠ దేశమందు శిధిలాగ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధ క్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నాయొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరమువలె మార్చుటకు వీలులేనిది. తక్షణము యీ ప్రదేశమును వీడిపోవలసినది. అని వారిరువురిని ఆజ్ఞాపించిరి.
నేనునూ, శ్రీపాదులవారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రావిదాసు అను నామాంతరము గలిగిన రజకుడొకడు వచ్చెను. రావిదాసు శ్రీపాదులవారికి పదేపదే నమస్కరించుచుండెను. కొంతసేపటివరకు శ్రీపాదుల వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదులవారు వానివైపుచూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమయి ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచూ నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను.
(ఇంకా ఉంది..)