అధ్యాయము 22 - భాగము 2
గురుదత్తభట్టు వృత్తాంతము
జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే
"నాయనా! శంకరభట్టూ! కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరీగా జన్మనెత్తెడి దౌర్భాగ్యము నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధముగా కాపాడిరి. నన్ను కేవలము విధికే వదలివేసి యుండినచో నేను పూర్తిగా పతనమయి ఉండెడివాడను." అని గురుదత్తభట్టు చెప్పెను. సద్గురువులు మానవాళియందు తమకున్న అవ్యాజప్రేమ వలన పూర్వజన్మ కర్మఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసము వారు తమ అమూల్యమయిన శక్తిని, కాలమును వెచ్చించువారు.
శ్రీపాదుల వారి జాతకము సాంద్రసింధువేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిథివార నక్షత్రములు కూడా సాంద్రసింధువేదము ననుసరించియే యుండును. శ్రీపాదులవారును, అప్పలరాజుశర్మగారును, బాపనార్యుల వారును యింటిలో తెలుగుభాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములలో సప్తఋషుల పవిత్రభూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకొనుట కూడ గలదు. శంబలలో మాట్లాడుకొను ఈ భాష సంస్కృతము కంటె భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును గాని, సౌకుమార్యమును గాని వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురములో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మ గారు మాత్రమే యీ భాషను మాట్లాడుకొనగలిగినవారు.
సత్యఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో "తాతా! శ్రీకృష్ణుడు సత్యమును గాని, అసత్యమును గాని పలుకువాడు కాడు. అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే." అని శ్రీపాదులవారనిరి. అంతట బాపనార్యులు, "కన్నా! ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను. మాటవరుసకు కూడా అసత్యమును పలుకరాదు." అని శ్రీపాదుల వారితోననిరి. శ్రీపాదులవారు మందహాసము చేసిరి. అదేరోజు మధ్యాహ్నము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి యింటికి వచ్చిరి. శ్రేష్ఠిగారికొక ప్రగాఢ కోరిక ఉండెడిది. అది బాపనార్యుల వారు తమ యింట భోజనము చేయవలయుననియూ, భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలెననియూ, అది కూడా పరమపవిత్రమయిన మహాలయపక్షములలో జరుగవలెననియూ, దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరనియూ వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో, మన్నించరోయని శ్రేష్ఠిగారికి మనసున శంక కలదు. అయిననూ శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడిచేసిరి. బాపనార్యుల వారు అప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠిగారింట భోజనము చేసెదమనియూ, దక్షిణను కూడా స్వీకరించెదమనియూ తెలిపిరి. శ్రేష్ఠిగారి ఆనందమునకు అవధులు లేవు.
శ్రీపాదులవారు బహు చమత్కారులు. మహాలయపక్షములు జరుగుచుండగా వాగ్ధానమును పొందిన శ్రేష్ఠిగారును, వాగ్దానమును చేసిన బాపనార్యులును కూడా యీ విషయమును మరచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారి యింటికి శ్రేష్ఠిగారు వచ్చిరి. శ్రీపాదుల వారు మందహాసము చేయుచూ, "వాగ్దానమును చేయనే కూడదు. చేసిన తరువాత తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరచినయెడల, వాగ్దానమును పొందినవారయిననూ జ్ఞప్తికి తేవలయును. ఈ విషయమును మీరిద్దరి నుండి నేను సంజాయిషీని అడుగుచున్నాను."అనిరి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదము తెలియ వచ్చెను. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుట;ప కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. చేసిన తప్పిదమునకు వారిరువురుకునూ చింత కలిగెను. వారినోదార్చుచూ, "మీ యిద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతీ మానవునిలోను, 'నేను' 'నేను' అనునది చైతన్యరూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా 'నేను' అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ 'నేను' అను చైతన్యమునకు విశ్వప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై యున్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినపుడు మాత్రమే యీ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన యీ వాగ్దానము, లేదా పొందబడిన యీ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన యీ జన్మలోనే మీ యిద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన 'నేను' అను చైతన్యమునకు బదలాయించబడినది గనుక, ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి, శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి యింట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమయినది, సూక్ష్మమయినది. కొన్ని కొన్ని కర్మలకు భౌతికకాలము వేరుగాను, యోగకాలము వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా యీ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరించబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది." అని శ్రీపాదులు వారిరువురికి హితవుచేసిరి.
అంతట నేను శ్రీపాదుల వారు హితవుచేసిన భౌతికకాలము, యోగకాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగితిని. శ్రీ భట్టుమహాశయుడు, "భౌతికకాలము, భౌతిక దేశముతో పాటు మానసిక కాలము, మానసిక దేశము అనునవి కూడ కలవు. వీనికి తోడుగా యోగకాలము, యోగదేశము అనునవియునూ కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకొనుము. అతడు 20 సంవత్సరముల వయస్సు వానివలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది.
అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికుండెడి బరువు, బాధ్యతలున్నాయనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతికకాలము, మానసిక కాలము ఒకే కాలమును కలిగిఉండవలెననెడి నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును." అని తెలియపరచిరి.
కాశీలో గాని, పిఠాపురములోగాని నివసించవలెనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీ వాసఫలము గాని పిఠాపురవాస సహితము గాని ప్రాప్తించును.
దేహము ఒక క్షేత్రమందు వుండినను, మనసు అచ్చట లేకున్న ఆ క్షేత్రవాస ఫలితము రాదు.
(ఇంకా ఉంది.)