అధ్యాయము 20
విస్సావధాన్ల వృత్తాంతము - భాగము 1
శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన
నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకారతత్త్వము, సాకారమై, సగుణమై మానవాకారముతో కళ్ళయెదుటనే కన్పించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్త్వమును ముంచెత్తుచుండెను.
శ్రీపాదులవారు అనుగ్రహముతో తమవద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగచేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీ చరణములను భక్తితో స్పృశించితిని. నా శరీరము తేలిక అయినది. నా కన్నులనుండి నల్లని తేజస్సు బయటకువచ్చుట గమనించితిని. ఆ తరువాత, నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సంతయునూ వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి యున్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీ వలెనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా ? అని నన్ను ప్రశ్నించిరి. నేను "స్వామీ! ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితిని కాని, ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు." అని జవాబిచ్చితిని.
అంతట శ్రీపాదులిట్లనిరి. "నాయనా! ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంక నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతీ మానవశరీరము నందునూ పాప పురుషుడును, పుణ్య పురుషుడును ఉందురు. పాపపుణ్యములు రెండింటినుంచి విడుదల లభించినచో ముక్తియే! బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాపశరీరమును దహించుటయే గాక తన పుణ్యబలము తో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్త్వగుణప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారిచేత ఆచరింపచేయుచూ తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారినుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనునపుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని యెడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని, బ్రహ్మజ్ఞానవంతుడయిన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులయిన బాపనార్యుల వంటివారును, మా పితృదేవులయిన అప్పలరాజశర్మ వంటివారును సద్బ్రాహ్మణులనిపించు కొనగలిగినవారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియును పరమపవిత్రులు. అటువంటి వారి స్మరణమాత్రముచేతనే జీవుల శరీరమునందలి వేలవేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. "
ఈ మాటలను పలికి శ్రీపాదులవారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతివ్రేళ్ళతో తమ భ్రూమధ్యమును తాకి, తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్రవస్తువులు ఉద్భవించెను. కొన్ని మధురఫలములు పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదులవారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదాని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగనే ఆ అగ్ని యందు పడెను. నా శరీరము నందంతటను మంటలుద్భవించెను. నేను స్వామీ! నేను దహింపబడుచున్నాను! రక్షింపుడు! రక్షింపుడు! అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యెను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములయిన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృత మగుటను గమనించితిని. నా నాడీ స్పందనమాగిపోయెను. హృదయ స్పందనమాగిపోయెను. నేను సమాధి స్థితి లోనికి జారుకొంటిని.
మధ్యాహ్నసమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదులవారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై యుండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదులవారు తమ దివ్యహస్తముతో స్పృశించిరి. తమ కమండలమునుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటికోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసికొని తిరిగి కన్నులను తెరచి నావైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర యొకటి ఆవిర్భవించినది. దాని నిండుగా 'హల్వా' అని పిలువబడు ఉత్తరదేశ వంటకమొకటి యున్నది. అది శ్రీపాదుల వారికి యిష్ట పాత్రమైన వంటకము. శ్రీపాదులవారు "శంకరభట్టూ! నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తీ శ్రద్ధాలకు మాత్రమె బద్ధుడను. శ్రేష్ఠిగారి యింట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ యీ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసెదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకము నందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షా బంధనము కట్టిన మాట యదార్థమేని నీవు యీ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించ వలసినదని పట్టుబట్టి నిరశనదీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మలనుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల యింట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి యింట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవునూ ఈ ప్రసాదమును స్వీకరించవలసినది." అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరి తరము? ప్రసాదము నందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారవిడిచిరి. అపుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి యిచ్చెను. ప్రసాదము భూమి లోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యధాస్థితికి వచ్చెను.
అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరినీ నిరాశ పరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టిననూ అది ఇంకనూ అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడను భక్తుడేతెంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రాజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివైచిరి.
తరువాత శ్రీపాదుల వారు "పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే! కారణాంతరమున వారు మాంసభక్షకులయిరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణా! నీవు ఎన్నియో రోజులనుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచూ, శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచూ, జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకరభట్టునకు గురుతత్త్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములనూ ఎవ్వరునూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు. " అని శెలవిచ్చిరి.
నేను శ్రీ గురుచరణుడనెడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే! శ్రీ గురుచరణుడు యోగామార్గాములో పరిణితి చెందినవాడు. శ్రీపాదులవారి తత్త్వమును నాకు తెలియజేసి ధన్యులనొనర్పుడు అని నేను వారిని ప్రార్థించితిని. అంతట గురుచరణుడు, "అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయముల నొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్త్వమే, సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి, ప్రస్తుతము ఈ యుగమున, ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతాస్వరూపముగా తోచు సర్వదేవతాస్వరూపము, అన్ని యొగమార్గములకునూ గమ్యము. సృష్ట్యాదినుండియూ మహర్షులు తమతమ సాధనావిశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నియూ శ్రీపాదులవారి యొక్క దివ్యస్వరూపములే !
పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండెడివి. వసిశ్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కరలేకుండగ యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడి వారు. ఏదేని ఒక కర్మమును చేయుటకుగాని, ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్రరహస్యమును తెలిసినవాడే సమర్థుడగును. శ్రీపాదులవారు సర్వసమర్థులు. అయితే వారు కర్మరహస్యమును ఎరిగినవారు గనుక ఆయా వ్యక్తుల యెడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనుపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్ఠమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులుగాని, నరసింహవర్మగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠిగాని విచిత్రయోగసంపన్నులు. వారు ముగ్గురికీ శ్రీపాదులవారి యెడల వాత్సల్యభక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదులవారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదులవారు ప్రతీ స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజస్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరయిననూ శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదులవారు కూడా వారి యిండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇదియే మహామాయ. యోగులు, జ్ఞానులు పదేపదే వల్లించిచెప్పెడి నిర్గుణ, నిరాకార పరబ్రహ్మము దివ్యశిశువుగా పీఠికాపురములో దివ్యలీలలను చూపుత తర్కమునకందని విషయము. వేదశాస్త్రముల ఆధ్యయనము ద్వారానూ, యోగమార్గము ద్వారానూ, జ్ఞానమార్గముద్వారానూ దైవము లభించుననెడి అభిప్రాయముతో సాధన చేయువారికి, ఆ దైవము ఆయా మార్గములద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింప వచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీతమార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదులవారి లీలలు అతర్క్యములు. అశ్రుత పూర్వములు." అని వివరించిరి.
అంతట నేను, అయ్యా! మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను. ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు, అని శ్రీ గురుచరణుని కోరితిని.
అంతట గురుచరణుడు "బ్రాహ్మణోత్తమా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారి సమక్షమున వారి దివ్యలీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుత కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణా కటాక్షము." అని పలికి తనకు శ్రీపాదులవారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి.
నేను దైవభక్తి గల కుటుంబము లోనే జన్మించితిని. చిన్నతనము నుండియూ నేను మా కులదైవమైన దత్త ప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్ధికచింతలు మెండుగానుండెడివి. దత్త ప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననూ నా కష్టములు తీరలేదు సరి కదా మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు నీకు దత్త ప్రభువుని అనుగ్రహము లేదు. నీవు కులదైవముగా వేరొక దైవతము నెంచుకొని పూజించుకొనిన నీ కష్టములు తీరవచ్చును, అని సలహా యిచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్న నా కష్టములు కడదేరునా యని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వానిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకలమందను పెంచుచుండెను. ప్రతీ రోజునూ కొన్ని మేకలను తన కసాయికత్తికి బలిచేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘగంభీర స్వరమున, "నేను దత్తుడను. నీవు ఏ దేవీదేవతలను ఆరాధనము చేసిననూ ఆ స్వరూపములన్నియూ నేనే! నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారెడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటెను గాను. నీవు నా నీడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు ? సమస్త దేవీదేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే! భగవదవతారములన్నియూ ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే! పులినోట చిక్కిన జంతువు తప్పించుకొన గలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహకిశోరముల వలె నుండవలెను గాని పిరికిపందలు కాకూడదు. నేను సింహము వంటివాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందునూ నిన్ను రక్షింపగలుగువారు ఎవ్వరునూ లేరు. " అని పలికెను.
నేను భయభ్రాంతుడనై వెఱ్ఱికేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసికొన్న కర్మ ఫలమో ఈనాడు యీ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్ధికబాధలు మరింత మెండాయెను. నేను చనిపోయిననూ బాగుండునని భావించితిని. తెల్లవారగానే మా యింటిముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోసుకొను పాత్ర యొకటుండెను. ఇతడొక వింత హరిదాసు. ఆ ఒఆత్ర యందాతడు ఒక చిన్న మేడిచెట్టు మొక్కను కలిగి యుండెను. హరిదాసు యింటి ముంగిట నిలచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభసూచకమందురు. అందుచేత యింటిలో బియ్యము ఏమయినా ఉన్నవేమోనని వెదికి, కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసు కిచ్చితిని. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, "అయ్యా! నిన్నరాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనెడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి యీ మేడిమొక్క యందు నిలిచినవి. ఔదుంబర వృక్షమూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరీ మండలమున శ్రీ పీఠికాపురమను మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడనెడి మారువేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహగృహమున నుండు ఔదుంబరవృక్షము యొక్క సంతతి యీ మొక్క. ఈ మొక్క మీ యింటనాటి సర్వశుభములను పొందుము." అని పలుకగా నాకు తలతిరిగి పోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, "అయ్యా! గురుచరణుడనెడి వాడను నేనే! నేను హత్యకు గురికాలేదు. నేను దత్తభక్తుడినే! నేను స్వప్నమున కసాయివానిని చూచితిని. అతడు తనకత్తితో నన్ను సంహరించెదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనపుడు అతని శవము సంప్రాప్తముకానపుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తరక్రియలను చేయుట వినియున్నాను, అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదుంబరవృక్షములోనికి ఆకర్షించి, అదే సమయములో అదే మనిషియందు ప్రాణములను నిల్పుట ఎచ్చటనూ వినలేదు, కనలేదు. " అంటిని.
(ఇంకా ఉంది)