Saturday, November 12, 2011

అధ్యాయము-5 భాగము-3

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 3  
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

ఆ రోజుననే మాలజంగమొకడు అచ్చటకు వచ్చెను. జంగమదేవర వేషమున నున్న అతని వద్ద తాళపత్ర గ్రంధములుండెను. ఆ వాడలోని జనులన్దరకూ అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యెను. తనను కలసిన వారందరికినీ అతడు భూత భవిష్య ద్వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్ద నున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంతములనియూ, దానిని రమలశాస్త్రమని అందురనియూ దానిలోని విషయములు తూ.చ. తప్పకుండా జరగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్దన మేరకు అతడు వారి యింటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనేను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంధముల నుండి ఒక పత్రమును తీసి యిట్లు చదివెను. "ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను యితడు లిఖించును. పూర్వజన్మమున యితడును, మరియొకడును కందుకూరు అను పట్టణమునకు ఆనతి దూరమునందున్న మొగలిచెర్ల అను గ్రామము నందు జనిన్చిరి. ద్యూతక్రీద యందు విశేష అనురక్తులయిరి. ఆ గ్రామము నందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయమున్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయములందు యతడు పూజాదికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగానమునండు తన మిత్రునితో కలిసి యితడు ద్యూతక్రీడలో నిమగ్నుడయి ఉండెడివాడు. ఇది ఎంతయో అపచారమయిన విషయము. తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమయిన నిబంధనలతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన యెడల యితడు ద్యూతము నందు ఒడ్డిన ధనమీయవలెను. తాను జూదమునందు నెగ్గిన యెడల తన మిత్రుని భార్యను యితనికి ధారాదత్తము చేయవలయును. దీనికి సాక్షిగా యీ దత్తప్రభువే! అని ప్రమాణములు చేసికొని జూదమాడిరి.

తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జూదమునందు శంకరభట్టు విజయమొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను యితనికి ధారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగవు పెద్దమనుష్యుల వరకు వెళ్ళెను. కులపెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో యింతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియూ, పరస్త్రీయందు మరులుగలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన యితనికి నెత్తిమీద వేడి వేడి నూనెను పోయవలెననియూ, జూదమున తన భార్యనొడ్డిన యితని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగఛ్చేదనము చేయవలెననియూ, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలెననియూ తీర్మానించి, వారి తీర్మానమును అమలుపరచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుటవలన యీ జన్మనందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రము నందు జన్మించి మనస్చాన్చాల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి యీ రామలశాస్త్రము వినిన మరుసటిరోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును.

శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7 1 /2 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను, అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కతినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంతభాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమె చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపురదేశము నందున్న అక్షయకుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును."

శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగానుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జననీజనకుల నుండి శలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామమును చేరితిని.

కాణిపాకం గ్రామము చిత్తూరునకు ఆనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంటేశ్వరస్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములును కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసికొని బైటకు వచ్చితిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి యుండెను. నాకు భయమువేసి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి తిరిగి వేదలితిని. కొంతసేపు దైవధ్యానము చేసుకొని బైటకు వచ్చితిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిణామము గల మరియొక కుక్క యుండెను. ఈ రోజున యీ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చితిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి "అయ్యా! మీరు మాటిమాటికీ బయటకు పోవుచూ, లోనికి వచ్చుచున్నారు. కారణమేమిటి ?" అని అడిగెను. నేను నా భయమును గూర్చి చెప్పితిని. అంతట పూజారి, "అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్దనుండు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామదేయమున శ్రీ దత్తులవారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయిననూ, అతడు మాత్రమూ యీ ఆలయము లోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి యిచ్చెదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు రెండు కుక్కలను చూచితినని చెప్పితివి. మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును యిచ్చెదను. మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూచెదము." అనెను. మేము బయటకు వచ్చునప్పటికి అచ్చట నాలుగు కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వాటికి యిచ్చెను. ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగువైపులా చుట్టుముట్టినవి. పూజారి "ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకునియొద్దకు పొమ్ము. నీకు శుభమగును." అని పలికెను.

నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలిసికొంటిని. సుబ్బయ్య యింటివద్ద జరిగిన సంఘటనలననుసరించి మతభేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున ఛండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. బ్రాహ్మణుడు ఛండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటకట్టుకొని జన్మజన్మాంతరముల వరకు కర్మప్రవాహమున పడిపోవుచుండునని తెలిసికొంటిని.

(ఇంకా ఉంది..)

అధ్యాయము-5 భాగము-2

అధ్యాయము-5 
శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. -భాగము 2 
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీ చరణుల నామస్మరణము చేయుకొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రము కోళ్ళను, మేకలను బలి సమర్పించి, చిత్రవిచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యము తో కూడిన ఆహారము యీయబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యము పట్టినది గనుక శాకాహారము యీయవలసినదని మాంత్రికుడు తీర్మానించెను. నాచేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమోయని ఎంతయో కలత చెందితిని, కాని శ్రీపాదుల వారి అనుగ్రహము వలన నాకు శాకాహారము యియ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. మూడు రోజులు నేను తీవ్రమయిన నరకబాధను అనుభవించితిని. అంతటి నరకబాధలోనూ నేను శ్రీ చరణుల స్మరణ మానకపోవుట వలన నాలుగవరోజు నుండి బాధ అనుభావములోనికి వచ్చుట మానివేసెను. శరీరముపై చిత్రవిచిత్రమైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడా తో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభా! శరణు! శరణు! అని బాధతో విలవిలలాడిపోయితిని. శ్రీదత్త ప్రభువును అనన్య భక్తితో సేవించువారికి నరకబాధలెట్లుండును. అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను, నాకు యిసుమంతయైనాను బాధ కలుగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిలలాడి పోయెను. అతడు నన్ను కొట్టినపుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీ చరణుల దివ్యలీలను గమనించి నవ్వుకొంటిని. నేను పథ్యాహారము తినుచుండిననూ అది నాకు చాల మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు, మేకలు భుజించుచున్ననూ అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోజ్గ్యము క్షీనించు చుండెను. అంతట అతడు నన్ను బాధించుట మాని కేవలము మంత్రములు, పూజలు మొదలయిన వానితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన అయిదవరోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ యింటిలో నిప్పు రాజేయకపోయిననూ, ఇంట్లో అందరునూ చూచుచుండగనే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యెను. ఆరవరోజున అతడు బిక్కమొహముతో సుబ్బయ్య యింటికి వచ్చి, సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణదెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుటవలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన యింటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించెననియూ, భేతాళుడు మొదలయిన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలెననియు, దానికి విశేషమైన ధనము కావలెననియూ సూచించెను. వైద్యము చేయుటవలన ఫలితము ఏమీ లేదనియూ, మాంత్రికుడు ధనాశతో యీ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియును. అందుచేత విధివిధానమునకు తల ఒగ్గి, సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించవలసి వచ్చిన యెడల అంతకంటె దురదృష్టము, నమ్మకద్రోహము మరియొకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితముతో యింత క్రూరముగా ఎందుకు ఆడుకోనుచున్నదో తెలియక నా గుండెలో రంపపుకోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో యిట్లంటిని. "జననీ జనకులారా! మీరు ఉన్న చర స్థిరాస్తులన్నింటినీ విక్రయించి యీ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నానని" పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపదిరి. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృసమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతుని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రిపాడులను ప్రార్థించుకొంటిని.

నాకు వైద్యము ప్రారంభమైన ఏడవదినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి యిట్లంటిని. "నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా?" అందులకు ఆమె "నాకు రెండు సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనునది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచినా మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండజాలడు. మీరు యిన్ని బాధలు పడుచున్ననూ నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనయినా లేదు.ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమయిన అభిప్రాయమునూ లేదు. కులాచారము ననుసరించి ధర్మముగా జీవించ దలచితిని. మీరు నా భార్తయీ అయినచో యీ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున, నా భర్త పలాయనమాయి 20 సంవత్సరములు అయిన కారణముననూ, అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతనూ, నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడచుకొందును. మీరు సదా స్మరణము చేసుకోను శ్రీపాదవల్లభులు ఎవ్వరు? వారు సద్గురువులయిన యెడల యీ విషమ సమస్యకు ధర్మ సమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను." అనెను.

ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతట నేను యిట్లంటిని. "శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయులవారు. ఈ కలియుగములో అవతరించినవారు. ప్రస్తుతము కురువపురము నందున్నారు. మన భావముననుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని ఋజువుచేయుదురు. మంచిది. నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోద యోగ్యమయిన పరిష్కారము లభించగలదు."

(ఇంకా ఉంది..)

Friday, November 4, 2011

అధ్యాయము-5 భాగము-1

అధ్యాయము-5
శంకరభట్టు తిరుపతి చేరుట, కానిపాకమున తిరుమలదాసును సందర్శించుట -భాగము 1
శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రమునకు వచ్చితిని. నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రములోని పుష్కరిణిలో స్నానము చేసి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వేంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాలాత్రిపురసుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరి కొద్ది సేపటికి మహావిష్ణు రూపముగా మారినది. ధ్యానము మరికొంతసేపయిన తరువాత ఆ మూర్తి పదునారు వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృతదృష్టియని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడొకడు అరుదెంచెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో "శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! మీరు జగన్నియింతలు. మీ భక్తుడైన శంకరభట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల యిక్కట్లున్నవో అన్నింటిని వానిచే అనుభవింపజేసెదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచియున్నాను." అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, "ఓయీ శనైశ్చ్వరా! నీవు కర్మకారకుడవు. జీవులను కర్మఫలితములను అనుభవింపజేయుచూ వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత  భక్తజనరక్షణ నా ప్రతిజ్ఞ కనుక, నీవు శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధముగా ఆదుకొని
ఎట్లు విడుదలచేసెదనో నీవే చూతువు గాక!" అనెను. శ్రీపాదులు, శనైశ్చ్వరులు యీ రకముగా సంభాషించుకొనిన తదుపరి యిద్దరునూ నా ధ్యానమునుండి తొలగిపోయిరి. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తమయినదనియూ, శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిజేర్చుదురనియూ తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చితిని.

తిరుపతి వీధులలో యిచ్చవచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలముగా ఉన్నది. ఒక క్షురకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి, "నీవు 20 సంవత్సరముల క్రితము యింటినుంచి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా! నీ తల్లిదండ్రులు బెంగపడియున్నారు. నీ భార్య రజస్వరాలైనది. ఆమె యీడేరినది. కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడెను." అంతట నేను "అయ్యా! నేను శంకరభట్టు అను కన్నడదేశ బ్రాహ్మణుడను. బాటసారిని. పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీదత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు. నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకొనునట్లు మంగలి సుబ్బయ్యను కానే కాను." అని పలికితిని.

కాని అతడు నా మాట వినువాడు కాడయ్యేను. అచ్చట చాలా మంది జనులు పోగుపడిరి. అందరునూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనువాని యింటికి తోడ్కొనిపోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచూ తమను విడిచి పోరాదనియు, రజస్వల అయిన భార్యను విడచిపోవుట మహాపరాధమనియు, ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, "సుబ్బయ్య గెడ్డము, మీసములతో పీడగొట్టుకొని పోయినాడు. వీనికి క్షురకర్మ చేసిన యెడల పూర్వపు కల వచ్చునని" సెలవిచ్చెను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వారు వినరయ్యిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండు గీసిరి. గెడ్డము, మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూతవైద్యునొకని రావించిరి. అతడు చిత్రవిచిత్రమైన వేషధారణ చేసి యుండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివైచి కత్తితో నా గుండున గాయమునేర్పరచిరి. దానిపై నిమ్మకాయ రసము, మరి యింకనూ వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తరువాత సుబ్బయ్యను బ్రాహ్మణదయ్యము పట్టెననియూ, అందుచేత యితడు జందెము ధరించి మంత్రములను వల్లించుచుండెననియూ తేల్చిరి. తిరుపతిలో నున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియూ అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉన్దేననియూ తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొనిపోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీకుడనని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకొందునని తెలిపితిని. ఆ బ్రాహ్మణపెద్దలు నేను చెప్పునది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకొనెననియూ అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని" వారికి చెప్పిరి.

గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లి పోయితిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహ లోనికి వచ్చునప్పటికి నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొనియుండుటను నేను గ్రహించితిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను. నాతో తదాకారమయిపోయెను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యెననియూ 7 1/2 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియూ నా మనస్సునకు తోచెను.

(ఇంకా ఉంది..)