Friday, April 20, 2012

Chapter 16 Part 2

అధ్యాయము 16
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 2
శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము

యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాడులకు యీ ఘటనాక్రమమంతయునూ అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు నాలుగువైపులా సరిహద్దులందు తాటిచెట్లు ఉండెను. ఆ తాటిచెట్లను కల్లుగీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు యీయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరపపండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరపపండ్లు కోయబడెను. అవి అన్నియునూ బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకొనిపోవుటకు సిద్ధముగానుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యము చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు పదుగురు. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లూకమును గాంచితిని. ఆ భల్లూకము చెట్టునుండి క్రిందపడినది. భాల్లూకమనిన అందరకునూ భయమే! వాడియైన తన గోళ్ళతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్ఛరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాడులవారి నామమును ఉచ్ఛరించినపుడు తన చేతులతో తాళమువేయుచూ ప్రసన్నముగానుండెను. నేను మిరపపండ్ల బస్తాలతో రెండెడ్లబండిలో యింటికి చేరితిని. నా బండికి ముందుభాగమున భాల్లోకము నడుచుచుండెను.

మా యింటిలోని వృద్ధదంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండువారందరికి యిది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్ఛరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భాల్లోకము కూడా ఆనందముగా స్వీకరించినది.

ఆ రోజునుండి భల్లూకము మా యింటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబసభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా యింట ప్రతి నిత్యమును దత్తప్రభువుల లీలావిశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను.

శ్రీమన్నారాయణ యీ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాల స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగనే అది ఆనందముతో గంతులు వేయసాగినది.

శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను

మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారినుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాన్త్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా యింటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకమునందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొనియుండెను. తాంత్రికుడు ఒకానొక యోగప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగప్రక్రియద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను.

శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధకర్మల నుండి రక్షించుట

శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రికబాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవులయొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మఫలముల తీవ్రతను క్షీనింపచేయుదురు.

శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యధావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగానుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదులవారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి.

నామపారాయణము జరుగుచున్నపుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవమువలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటిని అది పొందసాగెను. భక్తులు నామ పారాయణము చేయునపుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్త్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్త్వము నశించి మానవత్త్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూకతత్త్వములోనికి మార్పుచెందుటచే తాంత్రికుడు భల్లూకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్ళతో బంధించి అడవిలో దించివైచిరి.

భల్లూకము మానుషభాషలో మాట్లాడనారంభించి, "అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను. ఎక్కువ వడ్డీలను వసూలుచేయుచూ జనులను మిగుల బాధించితిని. తత్ఫలితముగా భల్లూకజన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమజన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికితోడు శ్రీపాదుల వారి భక్తుడను, మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు, శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చలభక్తితో వారినారాధించువారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను." అని పలికెను.

అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చటనుండియో మూడు నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునపుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన మూడు నాగుపాములు భల్లూకమునకు మూడుసార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చటనుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయునూ మా యింటనే ఉండినవి.

మాకు సర్వకాల సర్వావస్థలందునూ శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయినవారు గాని, మైలదోషము సోకినవారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి.

నాగుపాములు మాయింట నివసించుటచే మా యింటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్తభక్తులు మా యింటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని, శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయభావముతో నుండెడివి. వృద్ధదంపతులు యింటి భాగములోని కొంతస్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించియుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్దారించిరి. తీర్పు వెలువడునంతవరకునూ ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుటకు అనుమతి యీయబడెను. మా దాయాదులు గ్రామపెద్దలను ధనప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైననూ తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట యుండెను. నాగులచవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమియునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు "నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము! మా అభీష్టములు తీర్చుము" అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకూ దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును.

శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగులచవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్న వారు ప్రార్థనచేయు వారు, పాలుపోయు వారు యీ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి.

నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము యిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును, మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే మూడు నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు.

(ఇంకా ఉంది..)                         

Saturday, April 7, 2012

Chapter 16 Part 1

అధ్యాయము 16 
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 1 

నేను శ్రీపాదులవారి దివ్య చరితమును మననము చేసికొనుచూ, మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసికొనుచూ పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననెడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడయి ఉన్నాడు. అతడు "అయ్యా! కొంతసేపు యిక్కడ విశ్రమించి చెరుకురసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు." అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు యిచ్చిన చెరుకురసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. "అయ్యా! నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే! అయితే వారు బ్రాహ్మణులు. మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును, మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్ధికపరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పులబాధకు తట్టుకొనలేక చార, స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములనోసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము "దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలనమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన యెడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది." అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల యింట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు, "బాపనార్యుల యింట లభించేది అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురయిన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభామయిన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది." అని పలికిరి. శ్రీ బాపనార్యులు "మా భూములను యిదివరకే పంటకాపులకు ఒసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమయిన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకక పోదు." అనిరి. తదుపరి శ్రీపాదులవారు, "ఇదిగో! గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి యీ మినుములను పారవేయవలసినది. రాతిక్రింద కప్పకు కూడ ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది." అనిరి.

మేము బాపనార్యుల యింట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధదంపతులు మాత్రముండిరి. వారుకూడ కమ్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుతచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడ కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడ లేదు. ఆ విధముగ ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననెడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్ఠులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికీ తమ ఆస్తిపాస్తులను యీయవలెననెడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధదంపతుల యింట మాకు ఆతిధ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలించిననూ ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా యింటిల్లిపాదికీ, వాంతులు, విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినపుడు వృద్ధదంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్యభావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ యింట తిష్ఠవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశక్యత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో, రేవో యిచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. 

దాయాదులకు వృద్ధదంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని, వారు మాత్రము అక్కరలేదు. మేముకూడ వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకొనవలెననెడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలోవారు రాజీకివచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని, మమ్ములను ఆ యింటనుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి.

దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచిపడి అతనిని ఆ వృద్ధదంపతుల యింటికి తీసుకొనివచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. "మీ యింటనున్న యీ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ యింటనున్న ఆ యింట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ యింటి నుండి పంపించివేయుడు."

దానికి వృద్ధ దంపతులు "మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నయెడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంతధానము ఖర్చు అయిననూ, వారికి ఉన్న అమంగళములన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరునూ మంత్రాధీనులయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సద్బ్రాహ్మణులయిన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది. " అని ఆ జ్యోతిష్కుని కోరిరి. 

జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా! శంకరభట్టూ! ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మలకునూ వేదమే మూలమయి ఉన్నది. యాగములచేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకునూ, దేవతలకునూ పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు అయిదు రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్యసహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమయిన దోషములు లేవు. వృద్ధదంపతుల పుణ్యమా అని మాకు పరమపవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్పహవిస్సులు, మంత్రసామర్థ్యము వలన ఏయేదేవతలకు ఎంతకావలయునో అంతవృద్ధిని పొందును. 

భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది 

గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల యిహలోకస్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోకస్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పదిమందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యులవంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడయిన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి.


(ఇంకా ఉంది..)            

Chapter 15 Part 3 (Last Part)

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 3 
మహారాజునకు గర్వభంగము 

పీఠికాపురము సంస్థానమునేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనెడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలెననెడి కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజుశర్మ యింటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, 'శీఘ్రముగా శ్రీపాదులవారిని తీసుకొని అప్పలరాజుశర్మయు, బాపనార్యులును కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని.' అవమానకరమైన యీ ఆహ్వానమును శ్రీపాదులవారు తిరస్కరించిరి. అప్పలరాజుశర్మకు కోటలోనికి వెళ్ళుటకు యిష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, "నాయనా! బంగారూ! కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా!" అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదులు "తాతా! మహారాజునకు భక్తిలేదు. నా దర్శనము అంత సులభమైనది కాదు." అనెను. శ్రీపాదులవారు భటులతో "మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా యిచ్చటకు రావచ్చును. అతడు కేవలము యీ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను యీ సృష్టికంతకునూ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చునపుడు వట్టి చేతులతో రారాదు. నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన యెడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును." అని కరాఖండీగా చెప్పిరి.

శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజుశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహ వర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన యీ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. 'నేను తలచుకున్న ఆ బుడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక! నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు.' అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యెను. శోషవచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి. అయిననూ అతడు నీరసముగా నుండెను.

ఇంతలో అతని మనోనేత్రమునకు వికారస్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. 'నేనే శక్తిని! నీలోనికి ఉరుకుచున్నాను.' అని అరచుచూ అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తిధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. 'వెంటనే నాలో నుండి వెళ్ళిపో!' అని అతడు హీనస్వరముతో అరచెను. 'ఇదిగో! వెళ్లిపోవుచున్నాను!' అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకుపోయెను. ఆ రకముగా పోవునపుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయూ, శక్తి బయల్వెడలుటయూ జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజ పురోహితులయిన  సుందరరామశర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకొనిన తదుపరి శరీరములోనికి శక్తి రాకపోకలు నిలచిపోయెను. అంతట శర్మ యిట్లనిరి. "మహారాజా! చూచినారా! మా అర్చన యొక్క శీఘ్ర ఫలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి. అది మీకు వ్యర్థము. వారి యింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజావిశేషమున అప్పలరాజుశర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చవుకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైననూ మూర్ఖుడై శ్రీపాదుని దత్తవతారమని స్తుతించుచున్నాడు. మీరెంతమాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాల గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతముగనయిననూ శ్రీపాదుని యిచ్చటకు తీసుకురాగలరు ?" ఈ మాటలు, ముఖస్తుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని యిచ్చటకు రప్పించిన యెడల నాకు కలుగు లాభమేమి? పై పెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదులవారి వద్ద కొన్ని క్షుద్రవిద్యలున్నట్లు, నాకు అనుమానముగా ఉన్నది. నాపైన శ్రీపాడుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయిన, యీ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేల? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కులపురోహితులు. మా శ్రేయస్సును కాంక్షించువారు." అని పలికెను.

అంతట శర్మ యిట్లనెను. "మహారాజా! దత్తపురాణమును బ్రాహ్మణులచేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధానము చేయవలెను. భూరిదక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన యెడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును."

రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాల అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసెడి రోజునుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండును. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయెను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యెను. కొండనాలుకకు మందువేసిన ఉన్ననాలుక ఊడిపోయెనను విధముగ బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమీయసాగిరి. బక్కచిక్కిన దేహములతో, ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ళవలె నుండిరి. ఏమిరా! మాకు శ్రాద్ధభోజనము పెట్టుటలేదేమి? మేము యీ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా ? అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధకలాపములను చేయుచున్నానని రాజనెను. "నీవు చేయుచున్నావు సరే! కాని అవి మాకు అందుత లేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినపుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినపుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును." అని పితరులు రాజుతో ననిరి. కనులు మూసినాను, తెరచిననూ పితరుల యొక్క యీ గోలతో ఆర్త నాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్ర అనునట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచూ, యింటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నపుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగుచోటుకి రాజు వచ్చి వీక్షించినపుడు - దీనముగా, హీనముగా, కృశించిన శరీరములతో, ప్రేతకళతో నున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై, రాజు పరిస్థితి చాల దయనీయముగా నుండెను.

సుందరరామశర్మ యింట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడు నొకదానిని తెచ్చి తన తండ్రిని స్థంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రిమీద ఉమ్మివేసి, తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినపుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్దిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణము పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు యధేచ్చగా యింట తిరగాడుచూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు విక్రుతముగా నవ్వుచూ నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరములవారు పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు? మేమే! మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమియునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది, ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులయినవారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేదించ దలచితిమి." అని పలుకుచుండిరి.

పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును కూడా భయభ్రాంతులై, "దత్తపురాణము పారాయణచేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము కాని యిది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనమువలన శంకరుడు ప్రసన్నుడై, తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యము చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసిన అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్ళకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు, నింద్యములయిన వాక్కులతో తమను వేధించువారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన యీ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై, వాక్కులచేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్త్వముతో రక్షించి, భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసెడి యెడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో." అని పరితపించుచుండిరి.

సృష్టిలో మానవుడు కూలియే. కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు

వెంటనే బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును, శ్రీపాదుల వారిని శరణు జొచ్చిరి. అంతట శ్రీపాదులువారు "ఈ సృష్టిలోని ప్రతీ మానవుడును కూలియే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనయిన యెడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ యిచ్చెదను. అప్రసన్నుడనయిన యెడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే యిచ్చెదను. ఆలయములో స్వయంభూదత్తుడుగా నున్నది నేనే! కాలాగ్నిశమన దత్తరూపములో నున్నది నేనే! జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను. నాకు ముఖమునకు మంగళ హారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టినయెడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్తపురాణములోని విష్ణుదత్తుడును, అతని భార్యయును, యీ కలియుగములో అప్పలరాజుశర్మగాను, సుమతీ మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరియొక కల్పమందు లాభాదమహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడ బాపనార్యులు వారే! వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేశచతుర్థి నవతరించుట కూడా దివ్యసంకల్పములో భాగము. వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారము నుండియూ వెంకటప్పయ్య  శ్రేష్ఠిగారితో ఋణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నృశింహరూపములో ఋణానుబంధము కలిగిన నరసింహవర్మ, నిజంగా పుణ్యాత్ములు గనుకనే వారికి నాతో యీ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండును. నేను నృశింహసరస్వతిగా అవతరించునపుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించెదను. వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి యిచ్చటనున్న భూతప్రేతములకు విముక్తి కలిగించినట్లే. నృశింహ సరస్వతిగా అవతరించునపుడు నా గంధర్వనగరమునకు వచ్చిన భక్తుల నావహించిన భూతప్రేతములను పారద్రోలి, ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంతమాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన యెడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జా నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన యెడల, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదా దత్తా! శ్రీవల్లభా! దిగంబరా! అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటిని దహించివేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుటవలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున, మీరు దత్తపురాణమును పారాయణ చేసియున్ననూ, మీకు దాని ఫలితము లేకపోగా, వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము." అని తెలిపిరి.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము


(అధ్యాయము 15 సమాప్తం)